ఇక సచివాలయాలు కాదు..విజన్ యూనిట్లు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:52 AM
గ్రామ/వార్డు సచివాలయాలను ప్రభు త్వం విజన్ యూనిట్లుగా మార్పు చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాలను ప్రభు త్వం విజన్ యూనిట్లుగా మార్పు చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇకపై సచివాలయాలు అనే పేరు తొలగించి విజన్ యూనిట్లుగా పిలుస్తారన్నారు. జిల్లాలో శుక్ర వారం నుంచి వాట్సప్ ఆధారిత సేవలు ‘మన మిత్ర’పై క్యాంపెయిన్‌ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఇకపై ప్రతి శుక్రవారం గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సప్ సేవల డెమో, క్యూ ఆర్ కోడ్ గురించి కరప త్రాలను అందజేసి అవగాహన కల్పిస్తారన్నా రు. ఈ క్యాంపెయిన్ ఉన్న రోజున అత్యవసర వైద్య కారణాలు మినహా సెలవు మంజూరు చేయడం జరగదన్నారు. డీఎల్‌డీవోలు ప్రతి శనివారం నివేదిక సమర్పించాలన్నారు.
పోషకాహారం లోపం రానివ్వొద్దు..
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పోషకాహార స్థితిని క్రమం తప్పకుండా పరిశీలించి, ప్రమాదస్థితిలో ఉన్న చిన్నారులను వెంటనే గుర్తించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. తక్కువ బరువు, తగిన ఎత్తు లేకపోవడం, బలహీనస్థితి తదితర సమస్యలున్న చిన్నారులపై అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ విభాగం, శిశు సంరక్షణ సంస్థల పనితీరుపై కలెక్టర్ సమీక్షించారు. పోషకాహారలోపం ఉన్న పిల్లలకు అదనపు పోషకాహారం, వైద్య పరీక్షలు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన సమయంలో టీవీలు ఆన్ చేయరాదన్నారు. 104 వాహనాలు వచ్చినపుడు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాల న్నారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి టి.శ్రీదేవి, లేడీ ఆర్గనైజర్ ఏ.రాజ్యలక్ష్మి, ఇన్‌ఛార్జి జిల్లా శిశు సంరక్షణ అధికారి ఆర్.అనంత ప్రదీప్ పాల్గొన్నారు.
ఓట్ల ప్రక్రియ వేగవంతం
రాజమహేంద్రవరం, నవంబరు 6 (ఆం ధ్రజ్యోతి) : ఓటరు నమోదు ప్రక్రియను వేగ వంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాద వ్ రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం సమీక్షించారు. జిల్లాలో ఫారం 6,7,8కి సంబంధించి 20,344 దరఖాస్తులు రాగా 20,114 పరిష్కరించామ న్నారు. 230 ఫారాలు వివిధ దశల్లో ఉన్నా యని చెప్పారు.బీఎల్‌వో, ఏఈఆర్వో, ఈఆర్వో స్థాయిల్లో తుది పరిశీలన జరుగుతుందని, చిరునామా ధ్రువీకరణ,పలు పత్రాల లోపం వంటి కారణాలతో కొంత ఆలస్యం అవుతోం దన్నారు.వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.బుక్ ఏ కాల్ విత్ బీఎ ల్‌వో సేవకు సంబంధించి ఓటర్లకు అవగా హన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 65 అభ్యర్థనలు స్వీకరించి 40 సమాధానాలు పంపగా 24 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం రూర ల్‌లో అత్యధికంగా 14 పెండింగ్ అభ్యర్థనలు ఉన్నాయన్నారు.జేసీ వై.మేఘ స్వరూప్, డీఆర్వో టి.సీతారామమూర్తి పాల్గొన్నారు.