మిమ్మల్ని ఆదుకునేందుకు నేనున్నా!
ABN , Publish Date - Oct 30 , 2025 | 01:27 AM
తుఫాన్ కష్టాల్లో ఉన్న మిమ్మల్ని ఆదుకోవడానికే నేను ఉన్నా.. అందుకే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మిమ్మల్ని పలుకరించి ధైర్యం చెప్పాలని వచ్చానమ్మా. మీరెవ్వరూ భయపడొద్దంటూ తుఫాన్ బారినపడిన బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.
ఓడలరేవు పునరావాస కేంద్రంలో తుఫాన్ బాధితులకు సీఎం భరోసా
రైతులను ఆదుకుంటానని బెండమూర్లంకలో హామీ
ఓడలరేవులో పర్యటించిన చంద్రబాబు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
తుఫాన్ కష్టాల్లో ఉన్న మిమ్మల్ని ఆదుకోవడానికే నేను ఉన్నా.. అందుకే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మిమ్మల్ని పలుకరించి ధైర్యం చెప్పాలని వచ్చానమ్మా. మీరెవ్వరూ భయపడొద్దంటూ తుఫాన్ బారినపడిన బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. మొంథా తుఫాన్ నష్టాలను హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌లో బుధవారం మధ్యాహ్నం దిగిన చంద్రబాబుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ హరీష్‌బాలయోగితోపాటు కలెక్టర్ మహేష్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబునాయుడు నేరుగా ఓడలరేవులోని తుఫాన్ షెల్టర్‌లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ షెల్టర్‌లో ఉన్న బాధితులను చంద్రబాబు అందరినీ పలుకరిస్తూ నమస్కరిస్తూ ముందుకు సాగారు. తర్వాత బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ హెచ్చరికలు తమను ఎంతో భయాందోళనకు గురిచేశాయని, మంగళవారం రాత్రి బతుకు జీవుడా అంటూ భయం గుప్పిట్లో జీవించామని మహిళలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్ట సుఖాలను చంద్రబాబు అడిగి తెలుసుకుని మీరెవ్వరూ అధైర్య పడొద్దు నేనున్నానంటూ వారందరికీ భరోసా ఇచ్చారు. ఆ ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు 25 కిలోల బియ్యం ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు వంతున ఆర్థికసాయాన్ని చంద్రబాబు అందజేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు నాకు తెలుసు. అందుకే వారికి ఏ కష్టం కలగకుండా అన్నివిధాలా చర్యలు తీసుకుంటూ వారిని మనస్ఫూర్తిగా ఆదుకుంటాను. అది నా నైజం. దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఉండవు. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసా ఇచ్చేందుకు ఇంతదూరం వచ్చి మీతో మాట్లాడితే మీ కష్టం తీరడంతోపాటు నాలో కూడా బాధ తగ్గుతుంది.. మీరు అధైర్య పడొద్దు. మీకు నేనున్నానంటూ పదేపదే భరోసా ఇచ్చారు. అదే రీతిన బెండమూర్లంకలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట నష్టాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు రైతు నాయకులు యాళ్ల బ్రహ్మానందం, యాళ్ల దొరబాబులతోపాటు పలువురు రైతుల నుంచి నష్టాలను అడిగితెలుసుకున్నారు. పంట నష్టాలను అధికారులు నివేదించిన తర్వాత రైతులకు సహాయం ప్రకటిస్తానని రైతుల సమక్షంలో హర్షధ్వానాల మధ్య ప్రకటించి వారికి భరోసా ఇచ్చారు.
గాలితోనే.. నష్ట‘మొంథా’..
తెరిపిచ్చిన తుఫాన్
దారిమళ్లిన మొంథా
ఊపిరిపీల్చుకున్న కాకినాడ జిల్లా వాసులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
తుఫాన్ తెరిపిచ్చింది. కానీ, వ్యవసాయ, విద్యు త్ రంగాలకు నష్టంచేకూర్చింది. విపరీతమైన వే గంతో ఈదరుగాలులు.. ఏకధాటిగా వానతో మం గళవారం కనిపించిన భయానక వాతావరణం.. బుధవారం ఉదయానికి మారిపోయింది. తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందన్న అంచనాతో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఆస్తి,ప్రాణనష్టం జరగకుండా చర్య లు చేపట్టింది. జిల్లా కేంద్రాలతోపాటు పలుచోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏ ర్పాటు చేసి పరిస్థితిని అధికారులు సమీక్షించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలకు ప్రజలను తరలించారు. కోనసీమ జిల్లాలోని అంతర్వేదిపాలెంలో తుఫాన్ తీరాన్ని తాకడంతో కాకినాడకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం వాతావరణం పూర్తిగా మేఘావృతమై వర్షం కురిసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచనతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈదురుగాలులకు అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కాకినాడలో విరిగిపడిన చెట్లను మున్సిపల్, ఫైర్ సిబ్బంది తొలగింపజేశారు. విద్యుత్‌శాఖకు రూ.35లక్షలకు పైగా నష్టం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీవ్రత తగ్గినా జిల్లాలో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో రెండురోజులుగా 401 తుఫాన్ సహాయక కేంద్రాల ద్వారా 35,114మందికి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. వాతావరణం తెరిపివ్వడంతో చాలామంది ఇళ్లకు బయల్దేరి వెళ్లారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భారీ ఈదురుగాలులకు 17,172హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. పిఠాపురంలో 400ఎకరాల్లో అరటి, 190ఎకరాల్లో మొక్కజొన్న, 1500 ఎకరాల్లో పత్తి, 5వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. జగ్గంపేటలో స్వీట్‌కార్న్, కూరగాయలు, మినుము పంటలు దెబ్బతిన్నాయి.
హమ్మయ్య.. గట్టెక్కాం!
టెన్షన్ మిగిల్చిన మొంథా తుఫాన్
ప్రశాంతంగా తీరం దాటడంతో ఊపిరిపీల్చుకున్న జిల్లా ప్రజలు, అధికారులు
యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
వారంరోజులుగా మొంథా తుఫాన్ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ మంగళవారం రాత్రి సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం-బియ్యపుతిప్ప మధ్య తీరం దాటింది. దాంతో రాత్రివేళ ఏ విపత్తు ముంచుకొచ్చి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన జిల్లా ప్రజల్లో సర్వత్రా నెలకొంది. అయితే తుఫాన్ ప్రభావం తీరంపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తీరప్రాంత గ్రామాల ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం మండలాల పరిధిలో వీచిన తీవ్రమైన గాలులకు చెట్లు, వృక్షాలతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీనివల్ల ఎక్కడా ప్రాణాపాయం లేకుండా అధికారులు అప్రమత్తతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తెల్లారేసరికి పెద్దగా ఆస్తి నష్టాలు సంభవించలేదన్న సమాచారం సాక్షాత్తూ జిల్లా యంత్రాంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. దీనికితోడు సీఎం చంద్రబాబునాయుడు కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు, బెండమూర్లంకలో పర్యటించి బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడం ద్వారా ప్రజల్లో మరింత ధైర్యం పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల 20 వేల ఎకరాల వరకు వరి పంటకు నష్టం వాటిల్లింది. వీటితోపాటు జిల్లాలో 1590 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 300కు పైగా విద్యుత్ పోల్స్ నేలనంటాయి. వాటిని పునరుద్ధరించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఆర్‌అండ్‌బీ పంచాయతీరాజ్‌రోడ్లు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. వాటి అంచనాలు తయారు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మామిడికుదురు మండలం మాకనపాలెంలో ఒక మహిళ చెట్టు పడి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇంతకు మించిన ప్రాణ, ఆస్తి నష్టాలు పెద్దగా లేకుండా చేయడంలో అధికారుల కృషి భేష్ అంటూ సీఎం వారిని అభినందించారు.