Share News

కాలం చెల్లిన మందులతో వైద్యంపై సీఎం సీరియస్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:32 AM

రాజమహేంద్రవరం జీజీహెచ్‌ కు వైద్యం కోసం వచ్చిన 55 ఏళ్ల వ్యక్తికి కాలంచెల్లిన టాబ్లెట్లు ఇవ్వడంతో వాటిని వాడిఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైనట్టు వచ్చిన సమాచారంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు.

కాలం చెల్లిన మందులతో వైద్యంపై సీఎం సీరియస్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం జీజీహెచ్‌ కు వైద్యం కోసం వచ్చిన 55 ఏళ్ల వ్యక్తికి కాలంచెల్లిన టాబ్లెట్లు ఇవ్వడంతో వాటిని వాడిఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైనట్టు వచ్చిన సమాచారంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఈ ఏడాది అక్టోబరులో ఎక్స్‌పైర్‌ అయిన మందులను నవంబరు 8న సదరు రోగికి వైద్య సిబ్బంది ఇచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై సీఎం సీరియస్‌గా స్పందిస్తూ విచారణ జరిపించి బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వచ్చిన ఆదేశాలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోందని భావిస్తున్నారు. ఇటు రాజమహేంద్రవరం జీజీహెచ్‌ వైద్యవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై జీజీహెచ్‌కు ఎలాంటి సంబంధంలేదని, అసలు ఆ వ్యక్తి జీజీహెచ్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకోలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ స్పష్టంచేశారు. తమ డ్రగ్‌ స్టోర్‌లో ఉన్న అన్ని మెడిసిన్స్‌ను నిశితంగా పరిశీలించామని, అసలు ఆ బ్యాచ్‌ టాబ్లెట్లు తమ వద్ద లేవని తెలిపారు. జీజీహెచ్‌కు వచ్చే రోగులకు వైద్యసేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదని, ఆసుపత్రిలో వైద్యం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఒక అర్బన్‌ హెల్త్‌సెంటర్లో ఇచ్చిన టాబ్లెట్లు వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. నారాయణపురంనకు చెందిన ఒక వ్యక్తి వైద్యం కోసం వెళ్లినపుడు అర్బన్‌హెల్త్‌సెంటర్‌ వైద్యసిబ్బంది అతనికి కాలం చెల్లిన టాబ్లెట్లను ఇచ్చినట్టు తెలిసింది. ఇది బీపీ కోసం వాడే టాబ్లెట్‌ అని సమాచారం. కాకినాడ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి గత ఏడాది జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు ఈ టాబ్లెట్లు సరఫరా జరిగాయని చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం సీరియస్‌ కావడంతో విజయవాడలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ అధికారి ఒకరు శనివారం ఇక్కడికి వచ్చి దీనిపై విచారణ జరిపారు. కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి కూడా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Updated Date - Nov 23 , 2025 | 01:32 AM