జనంతో సీఎం!
ABN , Publish Date - Jul 02 , 2025 | 01:11 AM
సీఎం చంద్రబాబు గేర్ మార్చారు.. జనంలోనే ఉంటున్నారు.. జనం బాధలు వింటు న్నారు..అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.. మీకు నేను న్నానంటూ పేదలకు భరోసాగా నిలుస్తున్నారు.
మలకపల్లిలో జనంతో మమేకం
పీ4లో ఇద్దరు అమ్మాయిల దత్తత
కొవ్వూరుకు వరాల జల్లు
సీఎంను చూసేందుకు జనం క్యూ
రాజమహేంద్రవరం/కొవ్వూరు/తాళ్లపూడి, జూలై 1(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు గేర్ మార్చారు.. జనంలోనే ఉంటున్నారు.. జనం బాధలు వింటు న్నారు..అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.. మీకు నేను న్నానంటూ పేదలకు భరోసాగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో మంగళ వారం మార్గదర్శులు, బంగారు కుటుంబాల పేర జరిగిన ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన హాజ రయ్యారు. తాళ్లపూడి గ్రామానికే కాదు.. మండలానికే సీఎం రావడం ఇదే మొదటిసారి. దీంతో ఆ చిన్న గ్రామం మురిసిపోయింది. సీఎం చంద్రబాబును చూడాలని సగం ఊరు ఉదయం 9 గంటలకే సభకు చేరుకోగా.. మిగతావారు ఇంటి బయట వేచి చూశారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నా రు. సీఎం చంద్రబాబు మలకపల్లి ప్రజల కోసమే తాను వచ్చానని చెప్పడంతో మలకపల్లి మరింత మురిసిపోయింది. ముందుగా చర్మకారుడు పోసి బాబు ఇంటికి నేరుగా వెళ్లి రూ.4 వేలు పింఛన్ అందజేశారు.అతను తయారుచేసే చెప్పులు, టోపీ లు చూశారు. ఒక టోపీ, ఒక చెప్పుల జత తీసుకుని రూ.5 వేలు ఇచ్చారు. గ్రా మంలో మరో మహిళలకు పిం ఛన్ అందజేశారు. అక్కడే ఒక చిన్నపిల్లను ఎత్తు కుని ముద్దాడారు. తల్లితో మాట్లాడా రు. అనంతరం సీఎం మాట్లా డుతూ ‘ప్రతి కుటుంబాన్ని బంగారు కు టుంబంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమమే పీ4.. సమాజం మీకు ఎంతో ఇచ్చింది. అందులో కొంత తిరిగివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్టనర్‌షిప్ (పీ4) ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తానన్నారు. సమాజంలో 10 శాతం ఉన్నతమైన, ఆదర్శవంత మైన కుటుంబాల నుంచి సమాజంలో దిగువన ఉన్న 20 శాతం మంది ప్రజలను దత్తత తీసుకునే బృహత్తర కార్యక్రమం పీ4 అని చెప్పారు. సంప న్నులు పేద కుటుంబాలను దత్తత తీసుకుని మూడు దశల్లో ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉన్నతికి తమ వంతు గా బాధ్య త తీసుకోవాలన్నారు. 2029 నాటికి పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ దేశంలో ఏపీలోనే ఎక్కువ మొత్తంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రగతి తదితర అం శాలను వివరించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం తో సీఎం చంద్రబాబు దార్శనికతతో రూపొందించిన 10 విజన్ డాక్యుమెంట్‌లో పేదరిక నిర్మూలనకు ప్రథమస్థానం ఇవ్వడం జరిగిందన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలని గతంలో 150 పడకల ఈ ఆస్పత్రిని అభివృద్ధి కోసం కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించామని గుర్తుచేశారు. జిల్లాలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతులకునిధులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. కొవ్వూరు పరిసర ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను శుద్ధిచేసి తాగునీరుగా అం దించాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశం్వరరావు విన్నవించారు. వీటిపై సీఎం సాను కూలంగా స్పందిం చారు. అడినవన్నీ ఇచ్చారు.. వెంటనే వరాల జల్లు కురిపించారు.
దేవుడింతే ఇచ్చాడు.. ఇది మా ఖర్మ..అనే ఆలోచన మానేయాలి!
సీఎం చంద్రబాబునా యుడు కొవ్వూరు నియోజకవర్గ పర్యటన ఆసక్తికరంగా సాగింది. గతంకంటే భిన్నంగా ఆయన మాటల్లో మార్పు కనిపించింది. పేదల సేవలో..అనే కార్యక్రమానికి వచ్చిన ఆయన నిజంగా పేదలతో మమేకమయ్యారు. పేదలు ఆత్మ గౌరవంతో, విశ్వాసంతో ఆలోచనలు పెంచుకోవాలని , దేవుడింతే ఇచ్చాడు.ఇది మాఖర్మ, నిత్యం కష్టపడడ మే మా బతుకు అనే ఆలోచనలు చేయడం మానేయమని పిలుపునిచ్చారు. అంతేకాదు చర్మకార పింఛను దారు డైన పోసిబాబును కొవ్వూరు మండలం ధర్మవరంలో కారులో ఎక్కించుకుని తాళ్లపూడి మండలం మలక పల్లి వరకూ సుమారు రెండు కిలోమీటర్ల మేర తీసుకె ళ్లారు. కారులో పక్కనే కూర్చొపెట్టుకుని వృత్తి, జీవన స్థితిగతులపై ఆరాతీశారు. ఆయన ఇంటికి వెళ్లి పింఛన్ ఇచ్చారు. పోసిబాబు మాదిగ డప్పు తీసుకుని ఎలా కొట్టాలో అడిగి కాసేపు డబ్బు వాయించారు. అతని భుజంపై చేయి వేసి వీధిలో నడిచి వెళ్లారు. మరో పింఛన్‌దారుడి బిడ్డను ఎత్తుకుని ఆడించారు. సభానం తరం అనేక మంది సమస్యలు విని అందరికీ అండగా ఉంటానని చెప్పడంతో ప్రజలంతా ఆనందపడ్డారు.
రెండున్నర గంటలు ఆలస్యంగా భోజనం
రాజమహేంద్రవరం : చంద్రబాబు సాఽధారణంగా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య భోజనం ముగిస్తారు. ఆయన కారవాన్‌లోనే భోజనానికి ఓ 15 నిమిషాలు సమయం తీసుకుంటారు. మలకపల్లి సభకు ఆయన 11 గంటలకు రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక 2 గంటలకు చేరుకున్నారు. అప్పటికే కారవాన్‌లో భోజనాన్ని సిద్ధం చేశారు. కానీ ప్రజలు వేచి చూస్తున్నారంటూ ఆయన నేరుగా సభా వేదికపైకి చేరుకున్నారు. సభ ముగిసేసరికి సుమారు సాయంత్రం 4 గంటలు దాటింది. సభ ముగిసిన తర్వాత ప్రజల వినతులు, ఫొటోల అనంతరం ఆయన కార్యకర్తల సమావేశ ప్రాంగణానికి 4.30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అప్పుడు కారవాన్‌లో భోజనం ముగించుకొని 5 గంటలకు సమావేశానికి వెళ్లారు.
పోలీసుల ఓవరాక్షన్..
కొవ్వూరు : సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు అతిచేశారు. ఎవరినీ సీఎం చంద్రబాబు చెంతకు వెళ్లనీయకుండా సుమారు కిలోమీటర్ దూరంలోనే బందోబస్తు నిర్వహించారు. మల్లకపల్లిలో 2 వేల మందికి సరిపడా వేదికను సిద్ధం చేయగా అంత మందినీ తనిఖీ చేసి లోపలకు అనుమ తించారు.. చంద్రబాబు కాన్వాయ్ వస్తుంటే జనాన్ని పక్కకు తోసేశారు.. దీంతో సభకు వచ్చిన జనం అసహనం వ్యక్తంచేశారు. పార్టీ కార్యకర్తల సమావేశం వద్దా ఇదే పరిస్థితి కనిపించింది. ఎంపిక చేసిన వారిని మాత్రమే లోపలకు అనుమతించారు. దీనిపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.