చిన్నారులకు..మందులు వద్దు!
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:46 AM
పిల్లలు ఒక్కసారి దగ్గినా, కొద్దిగా ముక్కు కారినా వెంటనే మందు వేసేయాల్సిందే. నెలా, రెండు నెలల వయసైనా ఇదే పద్ధతి. ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెప్పినా వినిపించుకోని వాళ్లు చాలామంది ఉన్నారు.
నలత చేసినా.. కలత పడొద్దు..
దగ్గు, జలుబు సిరప్‌ల వల్ల నష్టాలు ఎక్కువే
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో 11 మంది మృతి
పిల్లలకు మందులు వద్దని కేంద్రం ఆదేశం
పెద్దల మందులు వాడేసినా ప్రమాదమే
(రాజమహేంద్రవరం/గొల్లప్రోలు-ఆంధ్రజ్యోతి)
పిల్లలు ఒక్కసారి దగ్గినా, కొద్దిగా ముక్కు కారినా వెంటనే మందు వేసేయాల్సిందే. నెలా, రెండు నెలల వయసైనా ఇదే పద్ధతి. ఇది చాలా ప్రమాదమని వైద్యులు చెప్పినా వినిపించుకోని వాళ్లు చాలామంది ఉన్నారు. పసివాళ్లకు కాస్త నలత చేసిందంటే ఇంట్లో కలత మొదలవుతుంది. వాళ్లు నోరు తెరిచి చెప్పలేరు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయో అలానే తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెప్పే సత్యం. కానీ శరీరం సర్దుబాటు చేసుకునే సమయం ఇవ్వడమే ఇక్కడ కీలకాంశం. వాస్తవానికి కాఫ్ సిరప్‌లు పనిచేయడానికే నాలుగు రోజుల సమయం పడుతుందట. వాటికంటే ఆవిరి పడితే చాలావరకూ వేగంగా కోలుకుంటారని పిల్లల వైద్యులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని చిన్నారుల మరణం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు వాడొద్దని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రోగాలు వస్తుం డడం సర్వసాధారణం. ఐదేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. వైరల్ ఇన్ఫెక్షన్లు కావ డంతో మందులతో పెద్దగా ఫలితం ఉండదు. కానీ కొందరు డాక్టర్లు ఏవేవో కాంబినేషన్లతో కూడిన మందులు రాసేస్తారు. చాలామంది మందుల షాపు నుంచి కొనుక్కొని వాడేస్తుంటారు. ఇటీవలకాలంలో చిన్నారుల్లో మందుల వినియోగం గణనీయం గా పెరిగింది. మూడేళ్ల కిందటితో పోల్చుకుంటే చిన్నారుల మం దుల విక్రయాలు దాదాపు 75 శాతం పెరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర స్థితిని సూచిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల పెద్దలు తాగే దగ్గు సిరప్‌ను చిన్నారులకు పట్టగా 11 మంది చనిపోయారు. జైపూర్‌కు చెందిన కేసన్స్ అనే సంస్థ తయారుచేసిన సిరప్ వల్ల ఈ మరణాలు సంభవించినట్టు గుర్తించారు. ఈ సిరప్‌లు నాణ్యతా లోపంతో ఉండడంతోపాటు చిన్నారులకు, పెద్దలకు ఒకే విధమైన సిరప్‌లను మార్కెట్‌లో ఉంచడంతో ప్రాణాపాయం ఏర్పడిందని పరీక్షల్లో తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు వైద్య- ఆరోగ్య శాఖ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అప్రమత్తమయ్యాయి.
దగ్గు వస్తే ఇలా చేసి చూడండి..
రెండేళ్లలోపు వయసున్న చిన్నారుల్లో జలుబు, దగ్గు వచ్చినా మందులు ఇవ్వడం కానీ, సూచించడం కానీ చేయవద్దని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఎలాంటి మందులు వాడకుండానే దగ్గు తగ్గిపోయే అవకాశాలే అధికంగా ఉంటాయని కేంద్రం తెలిపింది. పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం వంటివి సోకితే తగిన విశ్రాంతి ఇవ్వాలి. శరీరంలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి ఇన్ఫెక్షన్‌పై దండెత్తి తరిమి కొట్టే సమయం ఇవ్వాలి. గోరు వెచ్చని ద్రవాలను వైద్యుడి సలహాతో పట్టించవచ్చు. 12 నెలల కంటే ఎక్కువ వయసు పిల్లలకు నిద్ర సమయానికి ఓ అర గంట ముందు కొద్దిగా తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లు పట్టించడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. మూడు రోజులు చూసిన తరువాత చిన్నారుల్లో వచ్చే దగ్గు, రొంప తదితర వ్యాధులకు వైద్యులను సంప్రదిం చాలి. వెంటనే అవసరం ఉండదు.
ఇలా వాడొద్దు..
చిన్నారుల్లో జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, వాంతులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రతి నెలా చిన్నారులను వైద్యులు వద్దకు తీసుకెళితే వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా మందులు మార్పు చేస్తారు. అలా చేయకుండా ఒకే రకమైన మందులను రెండు, మూడేళ్ల వరకు వినియోగిస్తున్నారు. డ్రాప్స్ స్థానంలో పిడియాట్రిక్ సిరప్‌లు, అవి అందుబాటులో లేకుంటే పెద్దల సిరప్‌లు వినియోగించే వారు అధికం.లేకుంటే మెడికల్ షాపులు, ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి వారు సూచించిన మందులను వాడేస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రమాదకరంగా మారింది. దగ్గు, రొంప, జ్వరం వచ్చినప్పుడు ఆరేళ్లలోపు చిన్నారులకు పెద్దల మందులను డోస్ తగ్గించి వాడితే సరిపోతుందనే భావన సరికాదు. చిన్నారులు, పెద్దలు ఎవరైనా సరే వైద్యులు సూచించిన మోతాదులోనే మందులను వినియోగించాలి.
ఈ మందులు వాడితే ప్రమాదమే..!
జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు డీకంజెస్టెంట్లు, యాంటీ హిస్టామైన్, డెక్స్‌ట్రామెథార్‌ఫన్ కాంబినేషన్ల మందులను డాక్టర్లు సిఫారసు చేస్తుం టారు. వాటివల్ల దారుణమైన ప్రతికూలతలు ఉన్నాయి. అవి నేరుగా మెదడుపై ప్రభావం చూపడంతో పిల్లలు మూర్చకు గురవుతారు. మగతగా ఉంటారు. గుండె కొట్టుకొనే వేగం పెరిగి మరణానికి దారి తీస్తుంది. మల విసర్జితానికి ఇబ్బంది కలుగుతుంది. పిల్లలు చిరాకు, ఆందోళనగా ఉండి నీరసించి పోతారు. డెక్స్‌ట్రామెథార్‌ఫన్, గఫెనీసిన్ వల్ల ఎక్కువగా అలా జరుగుతుంది. కానీ మనం రోగం పెరుగుతున్నా తగ్గు తోందని అనుకొని ఆ మందులనే బలవంతంగా పట్టించేస్తాం.
సెల్ఫ్ మెడికేషన్ ప్రమాదకరం..
చిన్నారులతోపాటు పెద్దల్లో సెల్ఫ్ మెడికేషన్ ప్రమాదకరం. ఒకసారి డాక్టరు సూచించిన మందులను నిర్ణీత వ్య వధి దాటిన తర్వాత తరచూ వాడడం వల్ల దుష్ప్రభావం చూపే అవకాశాలు అధికం. వైద్యులు ఏదైనా మందును సూచించినప్పుడు మోతాదు ప్రకారం వాడాలి. చిన్నారుల సిరప్‌లు, డ్రాప్స్‌ను తెరిచిన తర్వాత 21 రోజుల్లోగా వాడాలి. ఆ తర్వాత వా డితే ఇబ్బందికరమే. వైద్యుల సలహా లేకుండా మందులు వాడడం వల్ల చిన్నారుల్లో మెటబాలిజం దెబ్బతినే ప్రమాదముంది. చిన్నారులకు ఏ ఇబ్బంది ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
- డాక్టర్ విజయశేఖర్, చంటి పిల్లల వైద్య నిపుణుడు, ప్రభుత్వాసుపత్రి కాకినాడ
మూడు రోజులు చూడాలి
దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్ష న్లు వస్తే తక్షణమే మందు లు అవసరం లేదు. కాచి చల్లార్చి గోరు వెచ్చగా తేనె నీళ్లు (ఏడాది దాటాక), తేనె లవంగం నీళ్లు, ఆవిరి పట్ట డం వంటివి చేయవచ్చు. మూడ్రోజుల తర్వాత కూడా దగ్గు వస్తుంటే డాక్టరును సంప్రదించా లి. అవసరం అనుకుంటే వారి పర్యవేక్షణలోనే తగు మోతాదులో మందులు వాడాలి. డెక్స్ ట్రామెథార్‌ఫన్ నాలుగేళ్లలోపు పిల్లలకు వాడ కూడదు. మందుల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
- కొండా ఉమా శివరామకృష్ణ, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, రాజమండ్రి