దేవుడా..చూస్తున్నా!
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:40 AM
నిన్నటి వరకూ ఆలయాల భద్రత దేవుడికెరుక. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరగని ఆలయం లేదు.. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఆలయాల ధ్వంసం ఘటనలు జరుగుతూనే ఉండేవి..
జిల్లాలో 1625 ఆలయాలు
భద్రతకు సర్కారు ప్రణాళిక
ఇప్పటికే 764 టెంపుల్స్‌లో నిఘా
861 ఆలయాల్లో ఏర్పాటుకు ప్లాన్
రూ.2.27 కోట్లతో అంచనాలు
ఆభరణాలకు బీమా తప్పనిసరి
టెంఫుల్స్ బాధ్యత ఈవోలదే
కార్పొరేషన్(కాకినాడ), జూలై 20 (ఆంధ్రజ్యోతి) : నిన్నటి వరకూ ఆలయాల భద్రత దేవుడికెరుక. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరగని ఆలయం లేదు.. ప్రతి రోజూ ఏదో ఒక చోట ఆలయాల ధ్వంసం ఘటనలు జరుగుతూనే ఉండేవి.. ఎప్పుడు జరిగింది.. ఎలా జరిగిందనేది కనిపెట్టడం పోలీసులకు కత్తి మీద సాముగా ఉండేది.. అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది.. దేవుడి సమస్యకు దారి చూపింది.. భద్రత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రతి ఆలయంలో నిఘా పటిష్టత దిశగా అడుగుల వేస్తోంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆల యాల భద్రత చర్యలను పరిశీలిస్తే అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రధాన ఆలయాలతో పాటు, చిన్న ఆలయాల వద్ద ఇదే పరిస్థితి. పలు ఆలయాల్లో నిఘా వ్యవస్థ నిద్దరోతోంది. రాత్రివేళల్లో అయితే కనీస బందోబస్తు కూడా ఉండడంలేదు.ఈ మేరకు ప్రభుత్వం ఆలయాలపై దృష్టి పెట్టింది.ఆలయాల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే దిశగా సీసీ కెమెరాలతో హైటెక్ భద్రత చర్యలు చేపడుతోంది. ఆలయాలపై విధ్వంస ఘటనలు, చోరీలు అరికట్టేందుకు ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ఆలయ పరిసరాల్లో కెమెరాలు బిగించడంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రభుత్వానికి నష్టం కలగకుండా, భక్తుల ఆస్తులను కాపాడేందుకు ఐటీ ఆధారిత భద్రతకు శ్రీకారం చుట్టారు.
ఆలయాలు 1,625
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,625 ఆల యాలు ఉన్నాయి.వీటిలో 764 ఆలయాల్లో మా త్రమే సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంది. మిగిలిన 861 ఆలయాలకు నిఘా వ్యవస్థ కొరవడింది. కాకినాడ జిల్లాలో 344 ఆలయాలకు 88 ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.మిగిలిన 256 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ.64 లక్షల ప్రతిపాదనలు చేశారు.తూర్పుగోదావరి జిల్లాలో 353 ఆల యాలు ఉన్నాయి. వీటిలో 230 ఆలయాల్లో సీసీ కెమెరా వ్యవస్థ ఉంది. మిగిలిన 123 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ.42 లక్షలతో అంచనా ప్రతిపాదనలు చేశారు. కోనసీమ జిల్లా లో 928 ఆలయాలకు 446 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. మిగిలిన 482 ఆలయాలకు రూ.1.21 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆభరణాలకు బీమా..
ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల్లో విలువైన వెండి, బంగారం,ఇతర ఆభరణాలకు బీమా తప్పనిసరి చేశారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాలు,అగ్నిప్రమాదాల కారణంగా బీమా అవ సరాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో విలువైన ఆభరణాల న్ని బీమా చేయించాలని ఒక నిబంధన తెచ్చింది.ఈ మేరకు ఆలయాల్లో ఉన్న వెం డి, బంగారం ఆభరణాలకు బీమా తప్పనిసరి చేశారు. విలువైన వస్తువులకు బీమా చేయించడం ద్వారా నష్టాన్ని క్లైమ్ చేసుకుని ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా భర్తీ చేయవచ్చు. ఉదాహరణకి గత వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో రథం కాలిపోయింది. అప్పటికే ఆలయ ఈవో ఆ రథానికి బీమా చేయించారు. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.98 లక్షలు రికవరీ అయింది. ఉమ్మడి జిల్లాలో 1,182 ఆలయాల్లో విలువైన నగలు ఉండగా 700 దేవస్థానాలకే బీమా చేయించి నట్టు తెలుస్తోంది. మిగిలిన ఆలయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అవకతవకలకు అడ్డుకట్ట
పలు ఆలయాల్లో సీసీ కెమెరాలు పటిష్టంగా పనిచేస్తుండడంతో హుండీ లెక్కింపుల్లోను పారదర్శకత పెరిగింది. చోరీలు, అవకతవకలకు అడ్డుకట్ట పడుతోంది. సెలవు రోజులు, బ్రహ్మోత్సవాలు, పండుగల వేళల్లో వేలాదిగా వచ్చే భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఈ సాంకేతిక భద్రతా వ్యవస్ధ కీలకంగా మారుతోంది. హుండీల లెక్కింపుల్లోనూ నిఘా వ్యవస్థ గట్టిగా పనిచేస్తోంది. ఆలయాలకు వచ్చే ఆభరణాల భద్రతకు నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది. అధికారులు పర్యవేక్షిస్తారు. ఇంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఆల యాల్లో దొంగతనాలు దోపిడీలు జరిగితే వాటి పూర్తి బాధ్యత ఆలయ ఈవోలదే అని అధికారలు స్పష్టం చేశారు. సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత ఈవోలదేనని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోతే వచ్చే పరిణామాలకు ఈవోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉం టుంది. మొబైల్ యాప్‌ల ద్వారా కెమెరాలను నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
861 ఆలయాలకు.. రూ. 2.27 కోట్లు
గతంలో ఆలయాల్లో జరిగిన దోపిడీ కేసుల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర షోషించాయి. అందుకే 861 ఆలయాల్లో రూ.2.27 కోట్లతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.ఆలయాల్లో ఆభరణాల బీమా బాధ్యత ఈవోలదే. సీసీ కెమెరా నిఘాలో ఏ విధమైన ఘటనలు జరిగినా బాధ్యత ఈవోలదే.
-డీఎల్‌వీ రమేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్, దేవదాయ ధర్మదాయశాఖ