చెయ్యేరు.. జనం మురిసేరు!
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:55 AM
సీఎం తో సమస్యలు చెప్పుకున్నారు..వెంటనే పరిష్కా రం చూపారు.. హామీలు ఇచ్చారు..జనం మురి సేరు..మా బాబే అంటూ జేజేలు పలికారు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల పరిధిలోని రెండు గ్రామాల్లో శనివారం ఆరు గంటలపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఆస క్తిగా సాగింది.
చంద్రబాబుకు నీరాజనం
2 గ్రామాల్లో 6 గంటల పర్యటన
సమస్యలు విని.. పరిష్కారం
జూన్ 12 తర్వాత గేర్ మారుస్తా
ఆకట్టుకున్న చంద్రబాబు ప్రసంగం
అమలాపురం, మే 31(ఆంధ్రజ్యోతి): సీఎం తో సమస్యలు చెప్పుకున్నారు..వెంటనే పరిష్కా రం చూపారు.. హామీలు ఇచ్చారు..జనం మురి సేరు..మా బాబే అంటూ జేజేలు పలికారు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల పరిధిలోని రెండు గ్రామాల్లో శనివారం ఆరు గంటలపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఆస క్తిగా సాగింది. ప్రజావేదిక నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం పురికొల్పారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మరో సమావేశం నిర్వహించి కేడర్‌కు నేనున్నాను అనే భరోసాను కల్పించారు. నేనున్నంత వరకు టీడీ పీకి ఓటమి ఉండదంటూ కేడర్ హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు. సీహెచ్ గున్నేపల్లిలోని హెలిప్యాడ్‌కు శనివారం 12 గంటలకు చేరుకున్న చంద్రబాబుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాట్రేనికోన మండలం చెయ్యేరులో చెరువు పూడికతీత పనుల్లో నిమగ్నమైన ఉపాధి శ్రామికులతో చెరువుగట్టున నడుస్తూ ముచ్చటించారు. ప్రజావేదిక సభలో చలోక్తులు, చురకలు, వార్నింగ్‌లు, హెచ్చరికలు చేస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది.ఈ నెల 12వ తేదీ నాటికి ఏడాది పాలన పూర్తి కావడంతో పాలనా పరంగా గేర్ మారుస్తానంటూ సంకేతాలు పం పారు. చెయ్యేరులోని ప్రజావేదిక సభకు చేరుకుని రెండు బంగారు కుటుంబాలను దాతలకు దత్తత ఇచ్చారు. అదే వేదికపై సుమారు గంటా 45 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రజావేదికలో నివేదికలను తప్పుడు తడకలుగా ఇవ్వడంతో అధికారులను మందలించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 10వేల ఇళ్లకు సోలార్ పవర్ కల్పించకపోతే ’ఎమ్మెల్యే పవర్ కట్’ అవుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు వెల్లివిరిశా యి. అవినీతి అధికారులకు ఘాటైన హెచ్చరికలు చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తాన న్నారు. ఇటీవల ఒక పాస్టర్ మరణాన్ని కొందరు స్వార్థపరులు హత్యగా విష ప్రచారం చేశారన్నారు. బంగారు కుటుంబాలకు భవిష్యత్తుకు భరోసా ఇస్తూ దాతలకు బాధ్యతలు అప్పగించారు. సాయంత్రం 5.45 గంటలకు సీహెచ్.గున్నేపల్లి నుంచి హెలికాఫ్టర్‌పై ఉండవల్లిలోని నివాస గృహానికి బయలుదేరి వెళ్లారు.
మీరు చెప్పినట్టే అధిష్ఠానం నడుస్తుంది..
నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం
ముమ్మిడివరం, మే 31 (ఆంధ్రజ్యోతి) : పార్టీకి కార్యకర్తలే ముఖ్యం. మీ అభిప్రాయాల మేరకే పార్టీ అధిష్ఠానం నడుచుకుంటుంది. అనునిత్యం ప్రజలతో మమేకమై ఓటుబ్యాంకు పెంచే దిశగా పనిచేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ముమ్మిడివరం మండలం సీహెచ్.గున్నేపల్లి సత్తెమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో జరిగిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు పెట్టాం. రాబోయే ఎన్నికల్లో గతంలో ఓడిన 11 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలి. టెక్నాలజీని పెంచుకుని సేవలు విసరిస్తున్నాం. ప్రజలతో కార్యకర్తలు మమేకమై మరింత పేరు తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో మహిళల ప్రాధాన్యత పెంచాల్సి ఉందన్నారు. 25 మార్కెటింగ్ కమిటీ చైర్మన్ల నియామకానికి సంబంధించి సర్వే నిర్వహించగా కొంతమందికి 90 శాతం, కొంతమందికి 50 శాతం రిపోర్టు వచ్చిందన్నారు. ఎస్సీ ఓటు బ్యాంకు పెంచేందుకు పీ4 అమలు చేస్తున్నాం అంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పనితీరుపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టింగుల్లో వెనుకబడి ఉన్నారంటూ చురక వేశారు. నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ముమ్మిడివరం నగర పంచాయతీ పార్టీ అధ్యక్షుల పనితీరు విశ్లేషించారు. బెస్ట్ అవార్డులు తీసుకున్న క్లస్టర్ ఇన్‌చార్జి గొలకోటి దొరబాబు, యూనిట్ ఇన్‌చార్జి దూలిపూడి వెంకటసుబ్బారావు, బూత్ ఇన్‌చార్జిల దంగేటి వీరప్రసాద్‌లను అభినందించారు. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
రూ.2 లక్షల చొప్పున పరిహారం
ఇటీవల గోదావరిలో గల్లంతై మృత్యువాత పడ్డ బాలుర కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా రూ.2 లక్షల చొప్పున పరి హారం ప్రకటించి వెంటనే అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అవగాహన లేకుండా సరదాల కోసం స్నానాలకు దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి శ్రామికులతో 15 నిమిషాలు..
నాయకుడంటే ఎలా ఉండాలి.. ప్రజలతో మమేకం కావాలి.. వారి సమస్యలు తెలుసుకోవాలి.. వాటి పరిష్కారానికి మార్గా లు వెతకాలి.. చెయ్యేరు గ్రామంలో ఇటువంటి ఆసక్తికరమైన సంఘటనే చోటుచేసుకుంది. ఆ గ్రామంలో రూ.9.86 లక్షలతో చేపట్టనున్న చెరువు పూడికతీత పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నరేగా పథకం కింద అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ మహిళా శ్రామికులతో ముచ్చటించారు. వారితో కలిసి చెరువు గట్టున తిరుగుతూ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల పథకంపై అభిప్రాయాలు అడిగి తెలుసుకు న్నారు. పెన్షన్ పంపిణీలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. గ్రామంలో ఉన్న టీడీపీ నాయకుల పనితీరు.. ఉపాధి కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ చెరువులో పూడికతీత పనులు ఎంతకాలం ఉంటాయని ఉపాధి కూలీలను అడగ్గా, రెండు నెలల పాటు ఉంటాయని సమాధానమిచ్చారు. సుమారు పదిహేను నిమిషాల పాటు వారితో గడిపి పథకాల అమలుపై సమాధానాలు రాబట్టి సంతృప్తిని వ్యక్తంచేశారు.
అడిగింది లేదనకుండా.. అన్నీ ఓకే..!
చెయ్యేరు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి హామీల వర్షం కురిపించారు. వృద్ధ గౌతమీ నదీపాయపై పల్లంకుర్రు- జి.మూలపాలెం మధ్య అసం పూర్తిగా ఉన్న వారధి నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ముమ్మిడివరం- కాట్రేనికోన వంతెన, గోగులంక బ్రిడ్జి, కుండలేశ్వరం బ్లడ్‌బ్యాంక్ ఆధునీకరణ, చెయ్యేరులో చెరువును సీపీడబ్ల్యూ పథ కంలో మంజూరు చేయాలని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కోరారు. వీటికి నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను చంద్రబా బు వెంటనే ఆదేశించారు. చెయ్యేరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించాలని కోరారు.వీటికి యాక్షన్‌ప్లాన్ తయారుచేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ కావాలని కోరడంతో మం జూరు చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆగస్టు నాటికి బంగారు కుటుంబాల సర్వే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎంతో చిన్నారుల.. చిరు కోరిక!
అమలాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి) : నాడు సీఎం అంటే ప్రజలకు దూరం..దూరం.. నేడు సీఎం చిన్నారులకూ దగ్గరే.. చెయ్యేరు ప్రజావేదిక వద్ద అదే గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ప్రయత్నించారు.. అది గమ నించిన సీఎం దగ్గరకు పిలిచి ఏం కావా లమ్మా అని అడిగారు.. అంతే చిన్నారుల్లో పట్టలేని ఆనందం.. అడిగిందే తడవుగా క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ కిట్ కావాలి సార్ అంటూ కోరారు. అడిగిందే తడవుగా వెంటనే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్‌ను పిలిచి వెంటనే చిన్నారులకు క్రికెట్ కిట్ అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ ద్వారా చిన్నారులకు క్రికెట్ కిట్ అందజేశారు. కిట్ అందుకున్న చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు.