పెద్దేవంలో ఆగని గేదెల మృత్యుఘోష
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:18 AM
మండలంలోని పెద్దేవం గ్రామంలో గేదెల మృత్యుఘోష ఆగలేదు.
తాళ్లపూడి, అక్టోబరు 6 (ఆంద్రజ్యోతి) : మండలంలోని పెద్దేవం గ్రామంలో గేదెల మృత్యుఘోష ఆగలేదు. ఇంకనూ వరుస మరణాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. నేటికీ గ్రామంలో 40 గేదెల వరకూ మృత్యువాతపడ్డాయి. సోమవారం కొత్తగా ఇద్దరు రైతుల గేదెలకు వ్యాధి సోకిందని సమాచారం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పశు సంవర్థక అధికారి శ్రీనివాస్ తమ సిబ్బందితో సోమవారం గ్రామానికి విచ్చేశారు. అప్పటికే ఒక రైతు వ్యాధి సోకిన రెండు గేదెలను కబేళాకు పంపించేశారు. గేదె మరణిస్తే ఖననానికి సుమారు రూ.10 వేలు ఖర్చవుతుందని.. అదే కబేళాకి తరలిస్తే కనీసం రూ.30 వేలు వస్తున్నాయని పాడి రైతులు అంటున్నారు. జిల్లా పశుసంవర్థక అధికారి ఎ.శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో రైతులు సహకరించడంలేదని.. వ్యాధి బారిన పడిన గేదెలను ఆసుపత్రికి తరలిస్తేనే పూర్తి వైద్యం అందించ గలమని అధికారులు అంటున్నారు. కానీ రైతులు మాత్రం గేదెలను ఇవ్వమని తేల్చి చెబుతున్నారన్నారు.