Share News

వారధికి పొంచి ఉన్న ప్రమాదం

ABN , Publish Date - May 25 , 2025 | 01:57 AM

లంకవాసులకు రోడ్డు రవాణా మార్గాలు కల్పించేందుకు గౌతమీ గోదావరి నదీపాయపై రామకృష్ణ మిషన్‌వారు నిర్మించిన వివేకానంద వారధికి ముప్పు పొంచి ఉంది.

వారధికి పొంచి ఉన్న ప్రమాదం
వివేకానంద వారధి.

ముమ్మిడివరం, మే 24 (ఆంధ్రజ్యోతి): లంకవాసులకు రోడ్డు రవాణా మార్గాలు కల్పించేందుకు గౌతమీ గోదావరి నదీపాయపై రామకృష్ణ మిషన్‌వారు నిర్మించిన వివేకానంద వారధికి ముప్పు పొంచి ఉంది. వరదనీటి ప్రవాహ వేగానికి వివేకానంద వారధి లంకాఫ్‌ ఠాణేలంకవైపు లంకభూమి కోతకు గురవుతోంది. దీంతో ఆ వారధికి ప్రమాదం పొంచి ఉంది. లంకవైపు పిల్లర్‌ వద్ద 20 మీటర్ల వెడల్పున, 50 మీటర్ల పొడవునా భూమి కోతకు గురైంది. ఇక్కడ భూమి మరికొంతమేర కోతకు గురైతే వారధి పిల్లర్‌ దెబ్బతిని వారధి మనుగడకే ప్రమాదం వాటిల్లనుంది. 1996లో సంభవించిన పెనుతుఫాన్‌ తాకిడికి ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లో లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఆ సమయం లో ఆపన్నులకు సేవలు అందించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన రామకృష్ణ మిషన్‌వారు లంక వాసులకు రోడ్డు నిర్మాణం కల్పించేందుకు వారధి నిర్మాణం చేపట్టారు. 1998-99లో రూ.3.25 కోట్లతో వారధిని నిర్మింపజేశారు. దీంతో ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలు, లంకాఫ్‌ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక, అయినవిల్లి మండలంలోని యలకల్లంక, గుణ్ణం మెరక గ్రామాలకు సంబంధించి సుమారు 8 వేల మంది ప్రజల రాకపోకలకు రోడ్డు మార్గం ఏర్పడింది. కానీ ఆ తరువాత గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా నదీ ప్రవాహానికి భూమి కోతకు గురవుతోంది. దీంతో కోతకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆయిల్‌ ఇండియా కంపెనీ రూ.కోటి 20లక్షలతో ప్రతిపాదనలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. 2023లో ఆగస్టు నెలలో వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి లంక గ్రామాల నదీకోత నివారణకు 3 కిలోమీటర్ల మేర రక్షణచర్యలకు రూ.150 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్యాకేజీలో వివేకానంద వారధి వద్ద సుమారు 300 మీటర్ల మేర రక్షణ చర్యలకు రివిట్‌మెంట్‌ పనులకు ప్రతిపాదనలు రూపొందించినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో వారధి రక్షణ చర్యలు చేపట్టేందుకు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు తాజాగా రూపొందించారు. వారధి వద్ద రూ.300 మీటర్ల మేర పిచ్చింగ్‌, రివిట్‌మెంట్‌ వంటివి చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. అవి కార్యరూపం దాల్చితే సమస్య పరిష్కారమవుతుంది. నిధుల మంజూరుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది.

Updated Date - May 25 , 2025 | 01:57 AM