Share News

నాచుతో ఉపాధి

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:25 AM

బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉప్పునీటి జలాల ద్వారా సముద్రపు నాచు ఉత్పత్తికి ప్రభుత్వం ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారి మామిడికుదురు మండలం కరవాక సముద్ర తీరంలో పైలెట్‌ ప్రాజెక్టుగా సముద్రపు నాచు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. దీనిద్వారా మత్స్యకార ప్రాంతానికి చెందిన యువత, మహిళలు ఉపాధి మార్గాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు లపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది.

నాచుతో ఉపాధి
సముద్ర తీరంలో నాచు తయారీకి అనువైన ప్రదేశాల కోసం ఇటీవల కోనసీమ తీరంలో పర్యటించిన తమిళనాడులోని మండపానికి చెందిన శాస్త్రవేత్తల బృందం

  • ఉప్పునీటి ద్వారా సముద్రపు నాచు తయారీ

  • పైలెట్‌ ప్రాజెక్టుగా కరవాక ఎంపిక

  • తమిళనాడు శాస్త్రవేత్తల బృందం పర్యటన

  • తీర ప్రాంత గ్రామాల్లో అనువైన ప్రదేశాల గుర్తింపు

  • మత్స్యకార యువత, మహిళా సంఘాలకు ఉపాధి

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉప్పునీటి జలాల ద్వారా సముద్రపు నాచు ఉత్పత్తికి ప్రభుత్వం ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారి మామిడికుదురు మండలం కరవాక సముద్ర తీరంలో పైలెట్‌ ప్రాజెక్టుగా సముద్రపు నాచు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. దీనిద్వారా మత్స్యకార ప్రాంతానికి చెందిన యువత, మహిళలు ఉపాధి మార్గాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు లపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టింది. అంతర్వేది నుంచి హోప్‌ఐలాండ్‌ వరకు ఉన్న సుమారు 93 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో 12కు పైగా తీర ప్రాంత గ్రామాలను సముద్రపు నాచు ఉత్పత్తికి అనువైన ప్రాంతాలుగా ఇటీవల ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలించింది. తమిళనాడులోని మండపం ప్రాంతానికి చెందిన సీఎస్‌ఎంసీఆర్‌ఐలో సముద్రపు నాచు ఉత్పత్తుల పరిశోధనలో కీలకంగా ఉన్న పనిచేసే శాస్త్రవేత్త డాక్టర్‌ సతీష్‌ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలతోపాటు జిల్లాలోని మత్స్య, అటవీ, రె వెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఒక బృందం కోనసీమలోని తీర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో మామిడికుదురు మండలం సముద్ర తీరమైన కరవాకలో పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా సము ద్రపు నాచు తయారీని ఇటీవల శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ దశల్లో నాచు ఉత్పత్తి కొనసాగుతోంది.

ఎంపిక చేసిన తీర ప్రాంతాలు

సముద్రపు నాచు ఉత్పత్తి తయారీకి అనువైన ప్రదేశాలను శాస్త్రవేత్తల బృందం ఇటీవల పరిశీలించింది. కాట్రేనికోన మండలంలోని కొత్తపాలెం, పల్లం, నీళ్లరేవు, చిర్రయానం, గచ్చకాయలపొర, ఉప్పలగుప్తం మండలం ఎన్‌.కొత్తప ల్లి, ఎస్‌.యానం, వాసాలతిప్ప, మామిడికుదురు మండలంలోని గోగన్నమఠం, కరవాక, గొల్లపాలెం, తూర్పుపాలెం, సఖినేటిపల్లి మండలంలోని చింతలమోరి, కేశవదాసుపాలెం, అంతర్వేది, గొంది, అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం, ఎన్‌.రామేశ్వరం, రెబ్బనపల్లి, ఓడలరేవు తదితర గ్రామాలను పరిశీలించిన అధ్యయన బృందం ఏడు నుంచి ఎనిమిది ప్రాంతాల్లో నాచు ఉత్పత్తికి అవసరమైన స్థలాలను కూడా పరిశీలించారు. ప్రస్తుతం మామిడికుదురు మం డలం కరవాకలో నాచు తయారీ పైలెట్‌ ప్రాజెక్టులో నాచును ఉత్పత్తి చేస్తున్నారు. ఉప్పునీరు లభ్యమయ్యే తీర ప్రాంతంలో సముద్ర జీవన వైవిధ్యం పెంపు, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర వహించేందుకు వీలుగా సముద్రపు నాచుసాగు వల్ల తీర గ్రామాల ప్రజలకు అధిక ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

  • సాగు చేయనున్న నాచు జాతులు

కప్ప ఫైకస్‌ అల్వారెజీ అనే నాచు ద్వారా కేరాజీనన్‌ అనే పదార్థాన్ని తీస్తారు. ఇది ఆహారపదార్థాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలతో స్థిరపరిచే పదార్థంగా వినియోగిస్తారు. అలాగే గ్రాసిలేరియా ఎడ్యులిస్‌ అనే నాచు ద్వారా ఆగర్‌ అనే పదార్థాన్ని తయారు చేస్తారు. ఇది మైక్రో బయాలజీ ల్యాబ్‌లు, ఆహార పరిశ్రమ, ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఈ రెండు జాతులు కూడా పంటల సాగులో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా పంటల వృద్ధిని పెంచే సహజ ఉత్పత్తులైన జీవవృద్ధి ఉద్దీపకాలు (బయో స్టిమిలెంట్‌)గా ఉపయోగిస్తారు.

  • ఆదాయ, పర్యావరణ ప్రయోజనాలు

సముద్రపు నాచుసాగు తీరప్రాంత ప్రజలకు స్థిరమైన ఆదాయాన్ని కల్పిస్తుంది. ఈ సాగుకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను డీఆర్డీఏ మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్వయం సంఘాల మహిళలు, మత్స్యకారులు, యువకుల్లో ఔత్సాహికులైన వారిని గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుకు గ్రీన్‌ క్లైమేట్‌ ఫండ్‌, నాబార్డు నిధులు సమకూర్చనున్నాయి. ప్రాజెక్టును కోనసీమలో అమలు చేసేందుకు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధ్యయన బృందాలను నెల్లూరు జిల్లాకు కూడా పంపారు.

Updated Date - Aug 09 , 2025 | 01:25 AM