Share News

రెండేళ్లలో పోలవరం

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:16 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణా నికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వచ్చే రెండేళ్లలో పోలవరం ఎడమకాలువ ద్వారా నీళ్లు ప్రవహించేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు.

రెండేళ్లలో పోలవరం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు

బీజేపీ పటిష్టానికి చర్యలు

త్వరలో మన పార్టీ - మన జెండా

కుంభమేళా తరహాలో పుష్కరాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పోలవరం ప్రాజెక్టు నిర్మాణా నికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వచ్చే రెండేళ్లలో పోలవరం ఎడమకాలువ ద్వారా నీళ్లు ప్రవహించేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు.రాజమహేంద్రవరంలో సో మవారం చాయ్‌ పే చర్చ, సారథ్యం యాత్ర, బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీని గ్రామస్థాయిలో పటిష్టం చేయడానికి ‘‘మన పార్టీ మన జెండా’’ పేరుతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. వైసీపీ హయాంలో పోలవరం పనులు నత్తనడకన జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, కేంద్రం ఇప్పటికే రూ.15 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగుతాయన్నారు. కూటమిలో సముచిత స్థానం లభించడంలేదని కొంతమందిలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే అయినా మూడు పార్టీలకు సమన్యాయం చేస్తూ పదవులు లభిస్తున్నాయనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కుంభమేళా తరహాలో రాజమహేంద్రవరం పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనే ఆలోచన జరుగుతున్నదన్నారు. రాజమహేంద్రవరం తనకు అత్యంత ఇష్టమైన ప్రాంతం అన్నారు. మహనీయుడు కందుకూరి వీరేశలింగం నడయాడిన రాజమహేంద్రవరం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 19 జిల్లాల్లో సారథ్యం యాత్ర ముగిసిందని, 20వ జిల్లా తూర్పుగోదావరి అన్నారు. రాజకీయ క్షేత్రం అంటేనే బురదమయం అన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లాలంటే డబ్బులు ఇవ్వాల్సి రావడం బాధగానే ఉందన్నారు. అయోధ్య రామాలయంలో దర్శనం, ప్రసాదాల విషయంలో ఆదర్శవంతమైన వ్యవస్థ నిర్మాణమైంది. అలాంటి వ్యవస్థ అన్ని చోట్లా జరగాలన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ప్రస్థానంలో కార్యకర్తల భాగస్వామ్యం ప్రధానమైందన్నారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత బీజేపీ కార్యకర్తలకే దక్కుతుందని అన్నారు. మోదీ తల్లి గురించి రాహుల్‌గాంధీ మాట్లాడిన తీరు దారుణమని, సంస్కారం లేకుండా చేస్తున్న ఇలాంటి విమర్శలను తిప్పికొట్టాలన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని..రాష్ట్రానికి అవసరమైన సహకారం అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ దిశ, దశ మార్చే శక్తియుక్తులు మాధవ్‌లో ఉన్నాయన్నారు. ముందుగా వై.జంక్షన్‌ నుంచి దేవీచౌక్‌ మీదుగా సుబ్రహ్మణ్యమైదానం వరకూ పాదయాత్రగా ర్యాలీ చే శారు.ఆయన వెంట బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, దయాకర్‌రెడ్డి, పరిమి రాధ, నర్సిపల్లి హారిక, కోడూరి లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్‌,క్రెడాయ్‌ ఏపీ చైర్మన్‌ శ్రీనివాస్‌,షేక్‌ సుభాన్‌ ఉన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:16 AM