Share News

‘ధర’హాసం!

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:36 AM

అరటితోపాటు కొబ్బరి మార్కెట్‌ ధరలు అనూహ్యంగా పుంజుకోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. కర్పూర అరటి ధర గతంకంటే రెట్టింపు పలుకుతుండడం,ఆ రకం కర్పూర సాగు చేసిన రైతులకు పంట పండినట్టయింది. కొబ్బరిలో కూడా ధరల పెరుగుదల రానున్న రోజుల్లో మరింత పుంజుకోవచ్చని అంచనా. ఇక కురిడీ కాయకు అద్భుత ధర పలుకుతోంది.

‘ధర’హాసం!

  • అరటి, కొబ్బరి రైతుల్లో ఆనందం

  • కర్పూర, చక్రకేళీ గెల రూ.600 పైనే

  • ఉత్పత్తి తగ్గడంతో పెరిగిన డిమాండ్‌

  • కొబ్బరికీ రికార్డు స్థాయిలో పెరుగుదల

  • కురిడీ వెయ్యింటికీ రూ.27 వేలు

  • పచ్చికాయ మాత్రం రూ.19వేల లోపే

(అమలాపురం- ఆంధ్రజ్యోతి)

అరటితోపాటు కొబ్బరి మార్కెట్‌ ధరలు అనూహ్యంగా పుంజుకోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. కర్పూర అరటి ధర గతంకంటే రెట్టింపు పలుకుతుండడం,ఆ రకం కర్పూర సాగు చేసిన రైతులకు పంట పండినట్టయింది. కొబ్బరిలో కూడా ధరల పెరుగుదల రానున్న రోజుల్లో మరింత పుంజుకోవచ్చని అంచనా. ఇక కురిడీ కాయకు అద్భుత ధర పలుకుతోంది.

కర్పూర.. గతంకంటే రెట్టింపు

ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని గోదావరి నదీ పరీవాహక లంక గ్రామాల్లో అరటి సేద్యం చేస్తున్న రైతులకు ఈసారి పంట పండినట్టయింది. రావులపాలెం అరటి మార్కెట్‌ నుంచి నిత్యం వేలాది కర్పూర, చక్రకేళీ సహా వివిధ రకాల అరటి ఉత్పత్తులు వివిధ రాష్ట్రాలతోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కర్పూర రకానికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది జనవరిలో కర్పూర అరటి గెల రూ. 120 నుంచి రూ.250 వరకు ధర పలికింది. మే, జూన్‌ నెలలో కర్పూర రకం గెల ఒక్కోటీ రూ.300 నుంచి రూ.600 వరకు ధర పలుకుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చక్రకేళీ కంటే కర్పూర రకానికే ధర పెరిగింది. గతంలో కర్పూర రకానికి మార్కెట్‌ పూ ర్తిగా పడిపోవడంతో రైతులు ఆ రకం పంటపై పెద్దగా దృష్టిపెట్టలేదు. దాంతో సాగు తగ్గిపోయింది. ఈ కారణంగా కర్పూరానికి డి మాండ్‌ పెరిగింది. రావులపాలెం మార్కెట్‌ నుంచి నెలకు 7వేల నుంచి 8,500 వరకు అరటి గెలలు ఎగుమతి అయ్యేవి. జనవరి నెలలో మార్కెట్‌యార్డు నుంచి 9 వేల నుంచి 10 వేల వరకు అరటిగెలల విక్రయాలు జరిగేవి. ప్ర స్తుతం కర్పూర రకం వినియోగం పెరగడంతో ఒడిశా, విశాఖపట్నం, హైదరాబాద్‌, ఖమ్మం వంటి ప్రాంతాలకు అరటి ఎగుమతులు పెరిగాయి. చక్రకేళీ అరటిగెల ప్రస్తుతం రూ.400 నుంచి రూ.700 వరకు ధర పెరగడంతో రైతులకు లాభసాటిగా మారింది. రానున్న శ్రావణమాసం, వినాయకచవితి, పండుగల సీజన్‌లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది.

రికార్డు స్థాయిలో కురిడీ ధరలు

కొబ్బరి రైతులకు ఈసారి దశ తిరిగిందనే చెప్పాలి. ధరల పెరుగుదల కొనసాగుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీనికితోడు నిల్వచేసిన కురిడీ కొబ్బరి ధరలు వెయ్యింటికీ రూ.27వేల వరకు ధర పలక డం రికార్డు నెలకొల్పింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తులు తగ్గిపోతుండడంతో గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ లభిస్తోంది. పచ్చికాయ కొబ్బరి ధర వెయ్యి కాయ మాత్రం రూ.18వేల నుంచి రూ.19 వేల వరకు ధర పలుకుతున్నట్టు కొబ్బరి రైతులు చెబుతున్నారు. రానున్న శ్రావణమాసం, వినాయక చవితి వంటి పర్వదినాల సమయంలో వీటి ధరలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి 50 లారీలకు పైగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి. అయితే గతంకంటే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో కొబ్బరి ఉత్పత్తులు ధరలు పెరిగినప్పటికీ ఉత్పత్తులు మాత్రం తగ్గుముఖం పట్టడం రైతులను ఒకింత నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం కొత్త కొబ్బరి క్వింటాల్‌ రూ.23,500, రెండో రకం కొత్తకొబ్బరి రూ.20 వేలు, కురిడీ కొబ్బరి పాతరకంలో గండేరా వెయ్యి కాయ రూ.27 వేలు, గటగటా వెయ్యి రూ.25 వేలు,కురిడీ కొబ్బరి కొత్తరకంలో గండేరా వెయ్యికాయ రూ.25వేలు, గటగటా వెయ్యి రూ.23 వేలు ధర పలుకుతున్నాయి. నీటికాయ రూ. 18 వేల నుంచి రూ.19వేల మధ్య ధర పలుకుతోంది. మొత్తం మీద అరటి, కొబ్బరి ధరల పెరుగుదల రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Updated Date - Jun 29 , 2025 | 12:36 AM