Share News

ఆటో జోష్‌!

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:50 AM

ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో, మ్యాక్సీ, మోటార్‌ క్యాబ్‌ డ్రైవర్లు ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ఆటో జోష్‌!
రాజమహేంద్రవరంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు చిత్రంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు తదితరులు

ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 వేలు

11,915 మందికి రూ.17.87 కోట్లు జమ

కంబాలచెరువు నుంచి ఆటోనడిపిన మంత్రి నిమ్మల

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో, మ్యాక్సీ, మోటార్‌ క్యాబ్‌ డ్రైవర్లు ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కంబాలచెరువు పార్కు వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కడి నుంచి స్వయంగా ఆటో నడుపుతూ ఆనం కళాకేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో లేకపోయినా సాయం అందించామన్నా రు. గత ప్రభుత్వంలో అనేక ఆంక్షలు పెట్టి 2.61 లక్షల మందికి మాత్రమే రూ.10 వేలు చొప్పున రూ.260 కోట్లు ఖర్చు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో రూ.10 వేలు ఇస్తూ మరో చేత్తో పన్నులు పేరిట ముక్కుపిండి వసూలు చేసిన పరిస్థితి ఉందన్నారు. రోడ్లన్నీ గుంతలమయం కారణంగా ఆటోల మరమ్మతులకే ఏడాదికి రూ.20 వేల వరకూ ఖర్చయ్యేదన్నారు. ఆటోలపై వివిధ రూపాల్లో జరిమానా వేయడం, గ్రీన్‌టాక్స్‌ రూ.20 వేలకు పెంచి ఆటోడ్రైవర్లపై గుదిబండ వేశారన్నారు. మద్యం బలహీనతలను ఆసరాగా చేసుకుని నాసిరకమైన మద్యాన్ని అధిక ధరలకు విక్రయించేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటోలపై ఎక్కడా ఫైన్లు వేయడంలేదని, గ్రీన్స్‌ ట్యాక్స్‌ రూ.3 వేలకు తగ్గించామన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రజల సంక్షేమం కూడా అభివృద్ధి అని భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 11,915 మంది డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.17.87 కోట్లు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబు అమ రావతిలో పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం చెక్కును మంత్రి ఆటోడ్రైవర్ల యూనియన్‌ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ మేఘా స్వరూప్‌, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా రవాణా అధికారి ఆర్‌.సురేష్‌, జనసేన ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ,కూటమి నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 12:50 AM