Share News

ఆక్వాకు ట్రంప్‌ దెబ్బ!

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:51 AM

అంతర్జాతీయ విపణిలో ‘డాలర్ల’ సిరులు కురిపించే ఆక్వా రంగం అమెరికా అధ్యక్షుడు డోనాల్డట్రంప్‌ దెబ్బకు విలవిల్లాడుతోంది. రొయ్యల ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 50శాతం సుంకం విధించడంవల్ల ఉత్పత్తిదారుడైన రైతుకే తీవ్ర నష్టం కలుగుతోంది. రష్యా-భారత్‌ సంబంధాల నేపథ్యంలో ట్రంప్‌ భారత్‌పై వివిధ రకాల పరిశ్రమల ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక్కడినుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తులు సంక్షోభంలో చిక్కుకున్నాయి.

ఆక్వాకు ట్రంప్‌ దెబ్బ!

  • ట్రంప్‌ 50శాతం సుంకం ఎఫెక్ట్‌తో ఆక్వారంగం కుదేలు

  • సుంకం విధించకుండానే తగ్గిన రొయ్యల ధరలు

  • ఎగుమతి, దిగుమతిదారులు కుమ్మక్కై.. రైతులకు కుచ్చుటోపీ

అంతర్జాతీయ విపణిలో ‘డాలర్ల’ సిరులు కురిపించే ఆక్వా రంగం అమెరికా అధ్యక్షుడు డోనాల్డట్రంప్‌ దెబ్బకు విలవిల్లాడుతోంది. రొయ్యల ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 50శాతం సుంకం విధించడంవల్ల ఉత్పత్తిదారుడైన రైతుకే తీవ్ర నష్టం కలుగుతోంది. రష్యా-భారత్‌ సంబంధాల నేపథ్యంలో ట్రంప్‌ భారత్‌పై వివిధ రకాల పరిశ్రమల ఉత్పత్తులపై సుంకాన్ని విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక్కడినుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తులు సంక్షోభంలో చిక్కుకున్నాయి.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి):

అమెరికాలోని దిగుమతిదారులు భారత్‌లోని ఎగుమతిదారుల మధ్య కుదిరిన పరస్పర అవగాహనలతో పెరిగిన సుంకాలు విభజిస్తూనే రొయ్యలు పండించే రైతులను మాత్రం నిలువు దోపిడీ చేస్తున్నారు. కొన్నినెలల వ్యవధిలో అమెరికా సుంకం ప్రభావంతో భారత్‌లోని ఆక్వా ఎగుమతిదారులు తమ కష్టాన్ని దోచుకున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 50శాతం సుంకం ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఆక్వా సాగు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఓ నిర్ణయం తీసుకుని ధరలు నిర్ణయించి ఉత్పత్తిదారులైన తమకు మేలు చేయాలని రైతులు కోరుతున్నారు.

అమెరికా సుంకంతో తగ్గిన ధరలు

అమెరికా వివిధ రకాల వస్తువుల ఉత్పత్తులపై 50శాతం సుంకాన్ని విధించింది. దీంట్లో ప్రధానమైన ఆక్వా ఉత్పత్తులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సాధారణంగా వచ్చే క్రిస్మస్‌ నాటికి రొయ్యల కొనుగోళ్లు అమెరికాలో అనూహ్యంగా ఉంటాయి. దీంతో ఆ సమయానికి భారత్‌తోపాటు ఏపీ వంటి రాష్ట్రాలనుంచి అమెరికావాసులకు కావాల్సిన 20, 30, 40, 50 కౌంట్‌ రొయ్యలను ఎగుమతి చేస్తుంటారు. దాన్ని సాకుగా చూపి 60నుంచి 100 కౌంట్‌ లోపు ఉన్న రొయ్యల ధరలను కిలోకు రూ.40కు పైగానే తగ్గించి ప్రస్తుతం ఉత్పత్తిదారుడైన ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేసి వారిని నిలువునా దోచేస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి రైతుల కష్టాన్ని నిలువునా దోచేస్తున్నారని ఈసారి అమెరికా సుంకం ప్రభావాన్ని సాకుగా చూపి కిలోకు రూ.40 నుంచి రూ.50 మేర ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో ట్రంప్‌ 25శాతం సుంకం విధించినప్పుడు అమెరికా, భారత్‌లోని ఎగుమతి, దిగుమతిదారులు సిండికేట్‌గా మారి ఆ సుంకం మొత్తాన్ని ఇరువురూ విభజించుకున్నారు. అమెరికాలో రొయ్యలను దిగుమతి చేసుకుని వారు 10 నుంచి 12 శాతం సుంకాన్ని భరించేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అయినా ఆసమయంలో రైతుల నుంచి ధరలు తగ్గించి కొనుగోలు చేయడంవల్ల మధ్యలో బాగుపడింది ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ అని రైతుల ప్రధాన ఆరోపణ.ఇప్పు డు ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ట్రంప్‌ విధించిన సుంకాల్లో కొంత మేర భరించి ఆక్వా ఉత్పత్తి చేసే రైతులకు రాయితీలు కల్పిస్తే తప్ప ఈపరిశ్రమ కోలుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇదేపరిస్థితి కొనసాగితే ఏపీతోపాటు జిల్లావ్యాప్తంగా ఆక్వా రైతులు క్రాప్‌ హాలిడేకు దిగనున్నట్టు రైతుల హెచ్చరికలను బట్టి తెలుస్తోంది.

సుంకాలు లేకుండానే.. ధరల తగ్గింపా

-అల్లూరి రమేష్‌రాజు, జిల్లా ఆక్వా కమిటీ చైర్మన్‌

ట్రంప్‌ విధించిన సుంకాలవల్ల కిలో రూ.40 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. సుంకాలు అమలు కాకుండానే ఎక్స్‌ పోర్ట్‌లు పన్నులు మినహాయించి ధరలు చెల్లిస్తున్నారు. ఇతర కౌంట్‌లపై కూడా అమెరికా మాదిరిగానే పన్ను మినహాయిస్తున్నారు. సుంకాల బారినుంచి బయట పడాలంటే ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలివ్వాలి

-త్సవటపల్లి నాగభూషణం, రాష్ట్ర ఆక్వా ఫెడరేషన్‌ సలహాదారుడు

అమెరికా-భారత్‌లోని ఆక్వా ఎగుమతి, దిగుమతిదారుల మధ్య పరస్పర అవగాహనతో వ్యాపారలావాదేవీలు జరుగుతున్నాయి. మొదట్లో ట్రంప్‌ విధించిన 25శాతం సుంకం ఇరుదేశాలు చెరిసమానం భరించేలా ఒప్పం దాలు కుదిరాయి. ఇప్పుడు 50శాతంసుంకంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఆదుకోకపోతే ఎగుమతులు చేయడం కష్టం.

ఆక్వా రైతులకే నష్టం

-కె.వెంకట్రాజు (కేవీ రాజు), రొయ్యల కొనుగోలుదారు

సుంకాల ప్రభావం చివరిగా రైతులపైనే పడుతోం ది. ఏ దేశం సుంకం విధించినా నష్టపోవాల్సింది ఆక్వా రైతులే. అక్కడ సుంకాల అమలు లేకుండానే ఇక్కడ ఎగుమతిదారులు రైతులను నిలువు దోపిడీ చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వంద కౌంటు రొయ్యలను ఇష్టారాజ్యంగా కొనుగోలుచేసి రైతులకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నారు. ప్రభుత్వాలే ఆక్వారంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

Updated Date - Aug 10 , 2025 | 01:51 AM