ఆర్టీసీ సిటీ బస్ సర్వీస్‌లు నడపాలి
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:21 AM
మహిళలు, విద్యార్థులు, సినీయర్ సిటిజన్‌ల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఏపీఎస్‌ఆర్టీసీ జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి సిటీబస్ సర్వీస్‌లు నడపాలని ప్రజలు కోరుతున్నారు.
దివాన్‌చెరువులో ఉదయం, సాయంత్రం రద్దీగా ఉంటున్న బస్సులు
కిక్కిరిసి, వేలాడుతూ ప్రయాణం చేస్తున్న విద్యార్థులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, దివ్యాంగులు
దివాన్‌చెరువు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థులు, సినీయర్ సిటిజన్‌ల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఏపీఎస్‌ఆర్టీసీ జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి సిటీబస్ సర్వీస్‌లు నడపాలని ప్రజలు కోరుతున్నారు. రాజానగరం, దివాన్‌చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు, వృత్తివిద్య కళాశాలలు, విద్యా సంస్థలతో ఈ ప్రాంతం విద్యా కేంద్రంగా ఉంది. అలాగే ఇక్కడకు సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రోగులు, బంధువులు వచ్చి వెళ్తుంటారు. దీనితో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో బాటు ఆయా సంస్థల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు కూడా బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో బస్సులు రద్దీగా ఉంటున్నాయి. ఇక కార్యాలయాలు, విద్యాసంస్థలు ప్రారంభమయ్యే ఉదయం వేళల్లోనూ, పనివేళలు ముగిసే సాయంత్రం సమయాలలోనూ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కొంతమంది వేలాడుతూ వేలాడుతూ వెళ్తున్నారు. ఈ కారణంగా దూరప్రాంతాలకు ప్రయాణించవలసిన వారిలో కొంతమంది సీనియర్‌సిటిజన్లు, మహిళలు, దివ్యాంగులు వంటి వారు రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం నుంచి రాజానగరం, కడియం, కోరుకొండ వంటి ప్రాంతాలకు రైల్వేస్టేషన్, కలెక్టరేట్‌లను కలుపుతూ సిటీ బస్సులు నడిపితే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని పలువురు అంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని నగరాల్లో ఆర్టీసీ సిటీబస్ సర్వీస్‌లు నడుపుతున్నందున ప్రజావసరాలను పరిగణలోనికి తీసుకుని రాజానగరం, దివాన్‌చెరువు తదితర పరిసర ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరానికి సిటీ బస్‌లు నడపాలని దివాన్‌చెరువుకు చెందిన సామాజిక కార్యకర్త సూరారపు డేవిడ్‌రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.