Share News

అన్నవరం.. భక్తజనసంద్రం

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:39 AM

అన్నవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడు కొలువైన రత్న,సత్యగిరిలు బుధవారం జై సత్యదేవ నామస్మరణతో మార్మోగాయి. స్వామి వెలసి భక్తులతో పూజలందుకునే 2 కొండల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన

అన్నవరం.. భక్తజనసంద్రం
గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

వేడుకగా సత్యదేవుడి గిరిప్రదక్షిణ

సత్యదేవ నామస్మరణతో మార్మోగిన రత్న, సత్యగిరులు

ఉదయం పల్లకీసేవలో, మధ్యాహ్నం సత్యరథం వెంబడి గిరియాత్రలో పాల్గొన్న 2 లక్షలమంది భక్తులు

అన్నవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడు కొలువైన రత్న,సత్యగిరిలు బుధవారం జై సత్యదేవ నామస్మరణతో మార్మోగాయి. స్వామి వెలసి భక్తులతో పూజలందుకునే 2 కొండల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన స్వామివారి గిరిప్రదక్షిణకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2 లక్షల మంది విచ్చేయడంతో అన్నవరం భక్తజనసం ద్రమైంది. గతేడాది మాదిరిగా సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను ఉదయం 8.30 గంటలకు పల్లకీలో, సత్యరథం భక్తులతో మధ్యాహ్నం 2గంటలకు గిరియాత్ర ప్రారంభించారు. ఉదయం 7.30కి కొండపై నుంచి స్వామి,అమ్మవార్లను పల్లకీలో మెట్లమార్గం గుండా కొండదిగువున తొలిపావంచా వద్దకు తోడ్కొనివచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, అన్నవరం దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌, గిరిప్రదక్షిణ ప్రత్యేకాధికారి ఆర్‌జేసీ వేండ్ర త్రినాధరావు టెంకాయి కొట్టి స్వామివారి పల్లకీసేవ ద్వారా గిరిప్రదక్షిణ ప్రారంబించారు. స్వామి,అమ్మవార్లను పల్లకీలో పండితుల మంత్రోచ్చరణలు భక్తుల గోవిందనామస్మరణలతో ఈ గిరియాత్ర తొలిపావంచా వద్ద నుంచి జాతీయ రహదారి మీదుగా బెండపూడి సమీపంలో పుష్కరకాలువ రోడ్డుగుండా సుమారు 8.5 కిలోమీటర్లమేర సాగింది.

పంపా తీరం వద్ద ముగిసే..

పంపా తీరం వద్ద గిరిప్రదక్షిణ యాత్ర ముగిసింది. చివరగా ప్రత్యేక మండపంలో స్వామి,అమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించి చతుర్వేదపండితుల వేదస్వస్తి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలందజేశారు. కొందరు భక్తులు యాత్ర అనంతరం పంపా రిజర్వాయర్‌లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి రత్నగిరి కొండకు చేరుకోగా మరికొందరు తిరిగి స్వగృహాలకు చేరుకున్నారు. గిరియాత్ర విజయవంతంతో సిబ్బందిని ఈవో, చైర్మన్లు అభినందించారు. ఇదిలా ఉండగా గిరిప్రదక్షిణ దారిలో రోలింగ్‌ సరిగా చేయకపోవడం,ఎండుగడ్డి అక్కడకక్కడా మాత్రమే పరచడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యలో కొన్నిచోట్ల గ్రీన్‌కార్పెట్‌ పరచడం ఉపశమనం కలిగించింది.

ప్రభుత్వ అప్రమత్తతతో ప్రత్యేక ఏర్పాట్లు

ఇటీవల కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇటు రెవెన్యూ, పోలీస్‌, దేవదాయశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. సుమారు 700మంది పోలీసులు, ఆరుగురు తహశీల్దార్లు, 20మంది వీఆ ర్వోలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు పర్వవేక్షణలో ప్రత్తిపాడు సీఐ సూరి అప్పారావు పల్లకీ, సత్యరథం వెంబడి నడుస్తూ ఎక్కడా తోపులాటలకు ఆస్కారం ఇవ్వకుండా రోప్‌పార్టీ ద్వారా కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.

శోభాయమానంగా పంపా హారతులు

కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి పంపాహారతులు కార్యక్రమం అత్యంత శోభాయామానంగా జరిగింది. రాత్రి 6.30కి స్వామి, అమ్మవార్లను కొండపై నుంచి మేళతాలాలు, పండితుల మంత్రోచ్ఛరణల నడుమ తెప్పోత్సవానికి వినియోగించిన పంటు వద్దకు తోడ్కొనివచ్చి పంటుపై ఆశీనులు గావించి గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం నదీమతల్లికి పసుపు, కుంకుమ, చీర సమర్పించారు. అనంతరం అర్చకస్వాములు పంపానదికి ఏడురకాలైన హారతులిచ్చారు. ముందుగా ఏక హారతి, నేత్రహారతి, బిల్వ హారతి, సర్పహారతి, కుంభహారతి, నక్షత్ర హారతులనంతరం చివరగా కర్పూరహారతులిచ్చారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనంతో కార్యక్రమం ము గిసింది. ఈవో, చైర్మన్‌, ప్రత్యేకాధికారి పాల్గొనగా వైదిక కార్యక్రమాలను ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం, ఇంద్రగంటి నరసింహమూర్తి రుత్విక్‌లు చామర్తి కన్నబాబు, పాలంకి పట్టాభి తదితరులు నిర్వహించారు.

కొండలు, గుట్టలు దాటుకుని...

సత్యరథం ద్వారా ప్రదక్షిణకు దేవస్థానం విస్తృత ప్రచారం చేపట్టడంతో అధికసంఖ్యలో భక్తులు సత్య,రత్నగిరికొండల వెంట నడిచారు. కొండలు, గుట్టలు దాటుకుని గోవిందనామస్మరణల నడుమ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. దేవస్థానం, దాతల సహకారంతో పండ్లు, మజ్జిగ, బిస్కట్‌ ప్యాకెట్ల స్టాల్స్‌ ఏర్పాటుచేశారు. దేవస్థానం తరుపున సుమారు 2 లక్షల మంచినీటి ప్యాకెట్లను పీఆర్వో విభాగం అందుబాటులో ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇబ్బందులు జరగకుండా ఈవో, చైర్మన్‌, ప్రత్యేకాధికారి ఎప్పటికప్పుడు వాకీటాకీల ద్వారా సమాచారం తెలుసుకుని అధికారులకు సూచనలు చేశారు. మార్గమధ్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. గిరియాత్రకు తరలివచ్చిన భక్తులతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

వైభవంగా జ్వాలాతోరణం

కార్తీకపౌర్ణమి సందర్భంగా కొండదిగువున తొలిపావంచా వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం వైభవం గా జరిగింది. పంపా హారతులు ముగిసిన తరువాత స్వామి,అమ్మవార్లను పంపాతీరం నుంచి తొలిపావంచా వద్దకు రాత్రి 8గంటలకు తోడ్కొనివచ్చారు. తొలిపావంచాకు ఇరువైపులా ఎండిగడ్డితో తోరణాన్ని ఏర్పాటుచేశారు. స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం అర్చకస్వాములు వేదమంత్రాల నడుమ తోరణానికి నిప్పంటించారు. వాటి మధ్యలో పల్లకీలో స్వామి,అమ్మవార్లను ముమ్మారు ప్రదక్షిణ చే యించారు. తోరణం నుంచి జ్వాల అనంతరం వెలువడిన భష్మం కోసం భక్తులు పోటీపడ్డారు. ప్రత్తిపా డు సీఐ సూరి అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను జాతీయరహదారి మీదుగా మళ్లించారు.

Updated Date - Nov 06 , 2025 | 12:39 AM