వేలాది వివాహాల వేదిక కనిపించదిక..
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:29 AM
అన్నవరం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అన్నవరంలో సామాన్యుడు వివాహం చేసుకోవలన్నా.. సత్యదేవుడి దర్శనానికి విచ్చేసి దేవస్థానంలో బసచేయాలన్నా ముందుగా గుర్తొచ్చేది సీతారామ సత్రం. అయితే ఈ సత్రం ఇప్పుడు కనుమరుగుకానుంది. 1970వ దశకంలో నిర్మించిన ఈ సత్ర ంలో ఇప్ప
రత్నగిరిపై శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రం
భవనం తొలగింపు ప్రక్రియకు చర్యలు
నూతన సత్రం నిర్మాణానికి వడివడిగా అడుగులు
అన్నవరం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అన్నవరంలో సామాన్యుడు వివాహం చేసుకోవలన్నా.. సత్యదేవుడి దర్శనానికి విచ్చేసి దేవస్థానంలో బసచేయాలన్నా ముందుగా గుర్తొచ్చేది సీతారామ సత్రం. అయితే ఈ సత్రం ఇప్పుడు కనుమరుగుకానుంది. 1970వ దశకంలో నిర్మించిన ఈ సత్ర ంలో ఇప్పటివరకు సుమారు 10వేలకు పైగా జంటలు ఒక్కటయ్యారు. వివాహం చేసుకోవాలంటే నేడు వేలాదిరూపాయల ఖర్చుతో కల్యాణ మండపాలు పెళ్లి బృందాలకు చుక్కలు చూపిస్తున్నాయి. సీతారామ సత్రం ప్రా రంభమైన 19 70వ దశకంలో రూ.20 చొప్పున అద్దె చెల్లించి పెళ్లికూతురు తరుపున ఒకటి పెళ్లికొడుకు తరుపున మరొకటి గదులు బుకింగ్ చేసుకుని వివాహాలు జరిపించుకునేవారు. కాలక్రమంలో ఈ సత్రం గది అద్దె రూ.200 అయింది. 2 గదులకు మొన్నటివరకు రూ.400 ఖర్చుతో సామాన్య పెళ్లి బృందాలు తమ వివాహాలను జరిపించుకున్నారు. మరో పక్క స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులు తక్కువ ఖర్చుతో ఈ సత్రం గదుల్లో బస చేసేందుకు ఆసక్తి కనబరిచేవారు. అయితే ఈ సత్రం శిథిలావస్థకు చేరడంతో జేఎన్‌టీయూ శాస్త్రవేత్తలు పరిశీలించి భవనం తొలగించాలని నివేదిక ఇవ్వడంతో ఆ భవనం తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం ఈ సత్రంలో 80 గదులున్నాయి. దీనిస్థానంలో నూతనంగా నిర్మించే సత్రంలో జీ+2లో 210 గదులుండేలా దీనికి రూ.23 కోట్లు వ్యయమవుతుందని ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళిక పొందుపరిచారు. నిధులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో 210 గదులు ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్మించాలని దేవదాయ కమిషనర్ సూచించడంతో మొదటిదశలో రూ.7.07 కోట్లతో ఒకబ్లాక్ నిర్మించేందుకు టెండర్లను పిలవగా కమిషనర్ ఆమోదం లభించింది. ప్రస్తుతం పాతభవనం తొలగిస్తుండగా నూతన భవనం పూర్తికావడానికి 18 నెలలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్నవరం దేవస్థానం చరిత్ర లో ఇప్పటికే టీటీడీ సత్రం కూల్చి దానిస్థానంలో ప్రసాద్‌స్కీం నిధులతో అన్నదాన భవనం నిర్మిస్తుండగా ఆలయ పశ్చిమరాజగోపురం ఎదురుగా ఉన్న సత్యదేవ సత్రం (30 వీఐపీ) తొలగించి భక్తుల కోసం విశ్రాంతి షెడ్డును నిర్మించారు. ఏదిఏమైనా వేలాది వివాహాలకు వేదికైన సీతారామసత్రం కూల్చివేయడం బాధాకరమైనా భక్తులకు మరిన్ని సౌకర్యాలతో ఈ స్థానంలో నూతన భవనం ఏర్పాటు కావడం హర్షించదగిన పరిణామం. నూతనంగా నిర్మించే సత్రం ప్రారంభమైతే గదుల అద్దె సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా లేదా అనేది వేచి చూడక తప్పదు.