జయ జయ.. సత్యదేవా
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:20 AM
అన్నవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి గురువారం సత్యదీక్షాపరులతో పసుపు
పసుపుమయమైన అన్నవరం
3వేలమంది సత్యదీక్షల విరమణ
ఉచిత సామూహిక వ్రతాలు
అన్నవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి గురువారం సత్యదీక్షాపరులతో పసుపుమయంగా మారింది. 27 రోజులపాటు అత్యంత నియమనిష్టలతో దీక్షలు చేపట్టిన సత్యదీక్షాపరులు దీక్షలను విరమించారు. శిరసున ఇరుముడులు పెట్టుకుని పలువురు మెట్టమార్గం, మరికొందరు వివిధ వాహనాల్లో స్వామి సన్నిధికి చేరుకున్నారు. వారందరికీ వార్షికకల్యాణ వేదికపై ఉన్న అర్చకస్వాములు ఇరుముడులను స్వీకరించారు. వీటిని స్వామిపాదాల చెంతఉంచారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేశారు. సుమారు 3వేలమంది సత్యదీక్షలను విరమించారు.
సత్యదేవుడికి జన్మనక్షత్ర పూజలు
సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా గురువారం మూలవరులకు జన్మనక్షత్రపూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 2గంటలకు స్వామి,అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి అభ్యంగనస్నానమాచరింప చేశారు. ఈ సందర్భంగా మహన్యాసపూర్వక ఏకాదశ రు ద్రాభిషేకాలు, పంచామృతాలతో మంత్రపూర్వకంగా అభి షేకం చేపట్టారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు ధరింపచేసి సుగందభరితపుష్పాలతో అలంకరించి సర్వదర్శనాలకు భక్తులను అనుమతించారు. యాగశాలలో ఆయుష్యహోమం నిర్వహించగా ఈవో సుబ్బారావు పాల్గొన్నారు.