Share News

జిల్లా అంతా అముడా పరిధిలోకి తేవాలి

ABN , Publish Date - May 06 , 2025 | 02:02 AM

జిల్లాలో నూతనంగా ఏర్పడిన అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ(అముడా) కార్యకలాపాలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వమించేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అముడా ఉపాధ్యక్షురాలు టి.నిషాంతి విజ్ఞప్తిచేశారు.

జిల్లా అంతా అముడా పరిధిలోకి తేవాలి

అమలాపురం, మే5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతనంగా ఏర్పడిన అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ(అముడా) కార్యకలాపాలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వమించేందుకు కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, అముడా ఉపాధ్యక్షురాలు టి.నిషాంతి విజ్ఞప్తిచేశారు. సోమవారం అమలాపురంలోని నల్లవంతెన వద్ద గల అముడా కార్యాలయంలో చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు అధ్యక్షతన బోర్డు సభ్యులతో కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. అముడా కార్యకలాపాల తీరు, ప్రతిపాదనలపై పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా జేసీ నిషాంతి మాట్లాడుతూ అముడా పరిధిలో భవన నిర్మాణాలు, అనుమతులు, పంచాయతీల నుంచి ఆన్‌లైన్‌లో డెవలప్‌పెంట్‌ చార్జీలు వసూలుచేసే సాఫ్ట్‌వేర్‌ గురించి చర్చించారు. అముడా పరిధిలో మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయని, మిగిలినవి రుడా పరిధిలో ఉన్నందున జిల్లా అంతా యూనిట్‌గా చేసి అముడాలోకి తీసుకువస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఉపయోగపడేవి ఉంటే అముడాకు అప్పగించాలని జిల్లా యంత్రాగాన్ని కోరుతూ బోర్డు తీర్మానించింది. అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు మాట్లాడుతూ అథారిటీ అభివృద్ధికి సభ్యులంతా సలహాలివ్వాలని కోరారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎస్‌.రాజబాబు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకరరావు, ఆర్‌అండ్‌బీఎస్‌ఈ బి.రాము, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పీకేపీ ప్రసాద్‌, ప్లానింగ్‌ అధికారి ఎ.సత్యమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 02:02 AM