Share News

కోనసీమలో ఆరు అడ్వెంచర్‌ పర్యాటక పాయింట్లకు టెండర్లు: కలెక్టర్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:23 AM

గోదావరి నదీ తీరం వెంబడి పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా ఆరు అడ్వెంచర్‌ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లు పిలిచినట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వెల్లడించారు.

 కోనసీమలో ఆరు అడ్వెంచర్‌ పర్యాటక పాయింట్లకు టెండర్లు: కలెక్టర్‌

అమలాపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): గోదావరి నదీ తీరం వెంబడి పర్యాటకరంగ అభివృద్ధిలో భాగంగా ఆరు అడ్వెంచర్‌ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లు పిలిచినట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో పర్యాటక రంగ, అడ్వెంచర్‌ టూరిజం ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం మంగళవారం నిర్వహించి టెండరు ప్రతిపాదనపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ గోదావరి తీరం వెంబడి దిండిలో మూడు పాయింట్లు, దిండి-అంతర్వేది మధ్య ఒక పాయింటు, అంతర్వేదిలో మరో పాయింటు, ఆత్రేయపురంలో ఒక పాయింటు అడ్వెంచర్‌ టూరిజం కోసం ఎంపిక చేశామన్నారు. ఏజెన్సీలు వాటరు యాక్టివిటీ అడ్వెంచర్‌ కార్యక్రమాల విధి విధానాలపై సమగ్ర ప్రతిపాదనలు, అంచనా వ్యయాలతో నివేదికలు రూపొందించుకుని ఈనెల 15న హాజరుకావాలని ఆదేశించారు. సీ ప్లేన్‌, బోటింగ్‌ యాక్టివిటీ వంటి అడ్వెంచర్‌ యాక్టివిటీలపై మూడు ఏజెన్సీలు స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. స్టాండర్డ్‌ ఆఫ్‌ ఆపరేషన్‌, సెక్యూరిటీపరంగా తీసుకునే భద్రతా ప్రామాణిక చర్యల నివేదిక కూడా సమర్పించాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఫ్రీక్‌ అవుట్‌ ఏజెన్సీ దిండిలో మూడు పాయింట్లను ఎంపిక చేసిందన్నారు. ఆత్రేయపుంలో శివశంకర వాటర్‌ స్పోర్ట్స్‌వారు ఒక పాయింటు, అంతర్వేదిలో బోటింగ్‌వారు ఒక పాయింటు ఎంపిక చేసుకున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో ఏవో కె.కాశీవిశ్వేశ్వరరావు, మూడు కంపెనీల ప్రతినిధులు, పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు పవన్‌కుమార్‌, జిల్లా పర్యాటకశాఖ అధికారి అన్వర్‌, పర్యాటకశాఖ బోటింగ్‌ అధికారి గంగబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:23 AM