లంచాల ‘రెవెన్యూ’.. అదే మహా‘ప్రసాదం’!
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:29 AM
అమలాపురం/అమలాపురం టౌన్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పారదర్శకంగా పౌరసేవలు అందిస్తున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ ఆ సేవలను పొందాలనుకునే ప్రజలు మాత్రం రెవెన్యూ అధికారులకు భారీగా లంచాలు సమర్పించుకుంటే గానీ పని ముందుకు వెళ్లడం లేదు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా దానికో రేటు నిర్ణయిస్తున్నారు. ఆ రేటుతో ఏ రూటులో వెళ్లాలో కూడా కిందిస్థాయి రెవెన్యూ యంత్రాంగమే సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా రెవెన్యూ
సర్టిఫికెట్ కావాలంటే సొమ్ములు చెల్లించాల్సిందే
ఎఫ్‌లైన్ సర్వేకు రూ.లక్ష డిమాండ్
అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న లంచాల బాగోతం
పట్టించుకోని ఉన్నతాధికారులు
తాజాగా అమలాపురంలో రూ.50వేలు లంచంతో పట్టుబడ్డ తహశీల్దార్, డేటా ఎంట్రీ ఆపరేటర్
అమలాపురం/అమలాపురం టౌన్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పారదర్శకంగా పౌరసేవలు అందిస్తున్నట్టు ప్రకటిస్తున్నప్పటికీ ఆ సేవలను పొందాలనుకునే ప్రజలు మాత్రం రెవెన్యూ అధికారులకు భారీగా లంచాలు సమర్పించుకుంటే గానీ పని ముందుకు వెళ్లడం లేదు. ఏ సర్టిఫికెట్ కావాలన్నా దానికో రేటు నిర్ణయిస్తున్నారు. ఆ రేటుతో ఏ రూటులో వెళ్లాలో కూడా కిందిస్థాయి రెవెన్యూ యంత్రాంగమే సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల నుంచి తహశీల్దార్ల వరకు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల విద్యా సంవత్సరం ప్రారంభసమయంలో ఈడబ్ల్యుసీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నవారి నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశారు. ఇది ఒక కోనసీమ జిల్లా అమలాపురంలోనే కాదు అన్ని కేంద్రాల్లోను ఈ తరహా దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలు శూన్యం. కాగా అమలాపురం తహశీల్దార్ కార్యాలయం కేంద్రంగా సర్టిఫికెట్‌కు రూ.2వేలు లంచం ఇస్తే తప్ప డిజిటల్ సైన్ పడేది కాదు. కార్యాలయాల్లో పనిచేసే చిరుద్యోగులనే కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకుని వసూళ్ల దందా కొనసాగించారనడానికి బుధవారం కోనసీమ జిల్లా అమలాపురం తహశీల్దార్ కేంద్రంలో జరిగిన ఏసీబీ రైడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. తహశీల్దార్ పలివెల అశోక్‌ప్రసాద్, కలెక్షన్ ఏజెంట్‌గా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ రాములు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజోలు ప్రాంతానికి చెందిన గంధం దుర్గాకొండలరావు నుంచి భూమి సర్వే నిమితం రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం సొమ్ముతో పాటు అదనంగా కార్యాలయంలో రూ.5.85 లక్షల సొమ్మును కూడా ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సొమ్ము కూడా భూముల సర్వే నిమిత్తం బుధవారం వచ్చిన కలెక్షనే అంటూ ప్రచారం జరుగుతుంది. రెవెన్యూశాఖలో డెత్ సర్టిఫికెట్లు, భూముల మ్యూటేషన్, భూముల సర్వే, రీసర్వేలు, వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల సర్టిఫికెట్లు, ఇలా ప్రతీ పనికి ఒక రేటు పెట్టుకుని సొమ్ములు చేసుకుంటున్నారనే ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి. పైగా ఇటీవలే తహశీల్దార్ అశోక్‌ప్రసాద్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అమలాపురం డివిజన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. అంతటి హోదాలో ఉండి అడ్డూ అదుపు లేకుండా లంచాల దందాలను కొనసాగిస్తున్నారనే విమర్శలు తహశీల్దార్ కార్యాలయం కేంద్రం గత కొన్ని నెలల నుంచి వెల్లువెత్తుతున్నప్పటికీ ఏ ఒక్క ఉన్నతాధికారి స్పందిండం లేదనే విమర్శలు ప్రజల నుంచి బాహటంగా వ్యక్తమవుతున్నాయి.
కనీస స్పందన ఏది..?
జిల్లా కేంద్రంగా ఉన్న అమలాపురంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో సహా ఎంతో మంది ఉన్నతాధికారులు ఉన్నా ఏనాడు తహశీల్దార్ కార్యాలయంలోకి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడే వేచి ఉండే ప్రజల్ని అడిగితే లంచాల మాటున సాగే ఎన్నో యథార్ధాలు సాక్షాత్కరించేవని ప్రజలు బాహటంగా చెబుతున్నారు. ఇటీవల ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి సచివాలయం-3లో కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీమన్నారాయణ అనే వీఆర్వో మ్యూటేషన్ నిమిత్తం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అయితే ఆ సమయంలో అసలు సూత్రధారులను పక్కకు తప్పించడంలో కొందరు ఉద్యోగులు సహకరించారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇలా కోనసీమ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో మామూళ్ల దందాలు పేట్రేగిపోతున్నప్పటికీ ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడంతో మరింత రెచ్చిపోయి దందాలను యథేచ్ఛగానే కొనసాగిస్తున్నారనడానికి అమలాపురం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన భారీ అవినీతే అద్దం పడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కార్యాలయంలో అదనంగా దొరికిన రూ.5.88లక్షలు నగదు ఎక్కడదనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీసే క్రమంలో కామనగరువు లేఅవుట్‌లో ఉంటున్న తహశీల్దార్ పలివెల అశోక్‌ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి సోదాలు కొనసాగిస్తున్నారు. కాగా రెవెన్యూ అధికారుల అవినీతి అమలాపురం కేంద్రంగా బట్టబయలు కావడంతో మిగిలిన ప్రాంతాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇదీ తహశీల్దార్ అవినీతి బాగోతం...
15 సెంట్ల భూమి ఎఫ్‌లైన్ సర్వేకు అమలాపురం తహశీల్దార్ పలివెల అశోక్‌ప్రసాద్ రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని అదే కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాము రూ.50వేలుకు సెటిల్ చేశారు. బుధవారం సాయంత్రం అమలాపురం తహశీల్దార్ కార్యాలయంలో రూ.50వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు నేరుగా దాడి చేసి పట్టుకున్నారు. దాడి సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో అదనంగా లెక్కలు చూపని రూ.5,88,500 నగదు ఉండడాన్ని గుర్తించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం సమీపంలోని రాజవోలు గ్రామానికి చెందిన గంధం దుర్గాకొండలరావుకు అమలాపురంలో 15 సెంట్ల స్థలం ఉంది. కొండలరావు తండ్రి వెంకటసత్యనారాయణ 1995లో 15 సెంట్ల స్థలాన్ని కొనుగోలుచేసి ఉంచారు. ప్రస్తుతం తండ్రి సత్యనారాయణ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉండడంతో ఆ స్థలాన్ని విక్రయించి వైద్యం చేయించుకోవాలని కొండలరావు కుటుంబం భావించింది. అయితే ఆ భూమిని విక్రయించేందుకు ఎఫ్‌లైన్ సర్వే తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంది. దాంతో కొండలరావు అమలాపురం తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఎఫ్‌లైన్ సర్వే చేయాలంటే రూ.లక్ష చెల్లించాలని తహశీల్దార్ పలివెల అశోక్‌ప్రసాద్ డిమాండ్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ వ్యవహారాన్ని అదే కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాము రూ.50వేలుకు సెటిల్ చేశారు. అయితే అంత మొత్తాన్ని ఇచ్చేందుకు మనస్కరించని కొండలరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో బుధవారం సాయంత్రం అమలాపురం తహశీల్దార్ కార్యాలయంలో కొండలరావు రూ.50వేలు నగదు అందజేస్తుండగా ముందస్తు వ్యూహంతో ఉన్న ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే తహశీల్దార్ కార్యాలయంలో అక్కౌంటెంట్ క్యాష్ రూ.5,88,500 ఉండడాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. లంచంగా ఇచ్చిన రూ.50వేలు నగదుతో పాటు మొత్తం రూ.6,38,500 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. లెక్క చూపకుండా ఉన్న నగదు ఎలా వచ్చిందో విచారణలో తేలుస్తామన్నారు. రామును తహశీల్దార్ కార్యాలయంలో కస్టడీలో ఉంచి తహశీల్దార్ అశోక్‌ప్రసాద్‌ను సమీపంలోనే ఉన్న ఆయన ఇంటి వద్దకు ఏసీబీ అధికారులు తీసుకువెళ్లారు. అశోక్‌ప్రసాద్, రాములను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తున్నట్టు డీఎస్పీ కిశోర్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డివిజన్‌శాఖ అధ్యక్షుడిగా తహశీల్దార్ అశోక్‌ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.