Share News

6వేల మంది రైతులతో యోగా అభ్యసనం

ABN , Publish Date - May 30 , 2025 | 12:25 AM

జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలతో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు.

6వేల మంది రైతులతో యోగా అభ్యసనం

అమలాపురం, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలతో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. శ్వాసపై ధ్యాసతో ఆరోగ్యాన్ని సుసంపన్నం చేసే యోగాను ప్రతీ వ్యక్తికి చేరువ చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6వేల మంది రైతులతో యోగా అభ్యసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం ఉదయం వందలాది మంది రైతులతో యోగా అభ్యసన కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. యోగా గురువులు ఆయుష్‌ వైద్యుల ద్వారా ఘనంగా రైతులతో అభ్యసన కార్యక్రమాలను సువిశాలమైన ప్రాంగణంలో నిర్వహించారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగా ఆచరణతో దేహ ధారుడ్యంతో పాటు మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవాలన్నారు. ప్రతీరోజు 15 నిమిషాల నుంచి ప్రారంభించి దశలవారీగా గంట పాటు యోగాసనాలను అలవరచుకోవాల్సిందిగా కలెక్టర్‌ ఉద్భోదించారు. జిల్లా వ్యాప్తంగా ఈకార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ కుటుంబానికి ప్రతీ వ్యక్తికి యోగాను చేరువ చేసేందుకే యోగాంధ్ర కార్యక్రమాలను 26రోజులు 26 ఇతివృత్తాలతో అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ప్రతీ ఒక్కరూ యోగాను అలవరచు కోవాల్సిందిగా సూచించారు. భారతీయ వారసత్వ సంపదగా ప్రసిద్ధి గాంచిన యోగాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ యోగాంధ్ర 2025ను ప్రారంభించడం ప్రజలు అదృష్టంగా భావించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు యోగాసనాలు నిర్దేశిత ఇతివృత్తాలతో ఆచరిస్తూ యోగేంద్ర అభినయంలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సామాజిక మాద్యమాల ద్వారా వీటికి ప్రచారం కల్పించాల్సిందిగా సూచించారు. జూన్‌ 2న రంగోళి పోటీలు, 4న గ్రామ, మున్సిపల్‌, ప్రభుత్వ అధికారుల ద్వారా మేజర్‌ ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పర్యాటక, దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. యోగా అభ్యసన కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యాధికారి విజయ్‌కుమారి, డీఆర్వో రాజకుమారి, ఏవో కాశీవిశ్వేశ్వరరావు, డీఈవో సలీంబాషా, వ్యవసాయాధికారి బోసుబాబు, డీఆర్డీఏ పీడీ గాంధీ, డ్వామా పీడీ మధుసూదన్‌, యోగా గురువు ప్రసాద్‌, రైతులు, స్వయం సంఘాల సభ్యులు, ఉపాధి కూలీలు, పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని యోగా అభ్యసనాలను చేశారు.

Updated Date - May 30 , 2025 | 12:25 AM