అత్యంత అమానుషం!
ABN , Publish Date - May 08 , 2025 | 12:28 AM
కాకినాడ జిల్లా పిఠాపురంలో అత్యంత అమానవీయ, అమానుష సంఘటన జరిగింది. ముక్కు పచ్చలారని ఆరునెలల చిన్నారిని నూతిలో పడవేయడమే గాక అదే ఇంటి వద్ద క్షుద్రపూజలు చేశారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
పిఠాపురంలో ఆరు నెలల చిన్నారిని నూతిలో పడేసిన వైనం
ఆపై క్షుద్రపూజలు
బంధువులపైనే అనుమానాలు
కాకినాడ జిల్లా పిఠాపురంలో అత్యంత అమానవీయ, అమానుష సంఘటన జరిగింది. ముక్కు పచ్చలారని ఆరునెలల చిన్నారిని నూతిలో పడవేయడమే గాక అదే ఇంటి వద్ద క్షుద్రపూజలు చేశారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
పిఠాపురం, మే 7 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన టైల్స్ పనిచేసే పెదపాటి సతీష్‌కు పట్టణంలోని యానాదుల కాలనీకి చెందిన శైలజ ప్రేమించుకుని రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఆరునెలల చిన్నారి యశ్విత ఉంది. ప్రస్తుతం శైలజ పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలోని అమ్మగారి ఇంటి వద్ద ఉంటోం ది. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి ఇంటి వద్ద కింద గదిలో చిన్నారి యశ్విత, తల్లి శైలజ, అమ్మమ్మ, బంధువులు, మేడపై తాతయ్య దుర్గారావు మరొకరు నిద్రించారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత పాప కనబడడం లేదని చిన్నారి తాత దుర్గారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు, కుటుంబసభ్యులు చూడగా ఇంటి పక్కనే ఉన్న బావి(నూతి) వద్ద చిన్నారి అమ్మమ్మ సెల్‌ఫోన్ కనిపించింది. దీంతో నూతిలో వెతకగా చిన్నారి పడి ఉండటాన్ని గమనించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని వెలి కి దీశారు. అదే సమయంలో చిన్నారి ఇంటి వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. ఇంటి బయట కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఇతర పూజా సామాగ్రి పడి ఉండటం కలకలం రేపిం ది. ఈ సంఘటన జరిగిన సమయంలో చిన్నారి తండ్రి సతీష్ నరసింగపురంలోని తన ఇంటి వద్ద ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కఠినంగా శిక్షించాలి
ముక్కుపచ్చలారని ఆరునెలల చిన్నారిని నూతిలో పడవేయడానికి ఎలా మనస్సు వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజాము సమయంలో ఇంటి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. క్షుద్రపూజలు కోసం చిన్నారిని ఈ విధంగా చేసి ఉంటారని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి అమానుష సంఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
అన్నీ అనుమానాలే
చిన్నారి నూతిలో పడి మరణించడం, క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంపై కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్న సమాధానాలు పొంతనలేకుండా ఉండటంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు. తల్లి పక్కన నిద్రించిన చిన్నారిని ఎవరు తీసుకెళ్లారు, ఎవరు నూతిలో పడవేశారు, క్షుద్రపూజల సామాగ్రి అక్కడ ఎందుకు ఉంది తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్నారిని నూతిలో పడవేసినట్లు అర్ధరాత్రి దాటిన త ర్వాత పడుకున్న ఇతర కుటుంబసభ్యులకు ఎలా తెలిసింది, అర్ధరాత్రే పోలీసులకు ఎలా ఫిర్యాదు చేశారు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బయట వ్యక్తులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఇందులో బంధువుల ప్రమేయం ఉండవచ్చనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పా టిల్, పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్, పట్టణ ఎస్‌ఐ మణికుమార్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు అక్కడ ఆధారాలు సేకరించారు.