Share News

Inter Low Turnout: వేసవి తర్వాత వస్తాంలే సార్‌

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:35 AM

ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచే ప్రారంభించినప్పటికీ, వేసవి వేడి, గ్రూపులపై అస్పష్టత, ఫలితాల ఆలస్యం వల్ల విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో బ్రిడ్జి కోర్సులు, పుస్తకాల పంపిణీ జరిగినా, వాస్తవిక పరిస్థితుల్లో విద్యార్థులు తరగతులకు ఆసక్తి చూపడం లేదు

Inter Low Turnout: వేసవి తర్వాత వస్తాంలే సార్‌

  • ఇంటర్‌ విద్యా సంవత్సరం మార్పుపై మిశ్రమ స్పందన

  • జూన్‌ 1కు బదులు ఈసారి ఏప్రిల్‌ 1నే ప్రారంభం

  • తరగతులకు వచ్చేందుకు విద్యార్థుల అనాసక్తి

  • రోజూ 30 శాతం మందే హాజరు

  • కొన్ని కాలేజీల్లో అయితే పది శాతమే

  • టెన్త్‌ ఫలితాలు వచ్చాకే ఇంటర్‌లో చేరే ఆలోచన

  • సెకండియర్‌ విద్యార్థుల హాజరూ తక్కువే

  • గ్రూప్‌ ఎంపికపై అస్పష్టత.. ఠారెత్తిస్తున్న ఎండలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరం మార్పుపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. విద్యా సంవత్సరాన్ని రెండు నెలలు ముందుకు తీసుకొచ్చినా కాలేజీలకు విద్యార్థులు రావడం లేదు. కొత్తగా ఫస్టియర్‌లో విద్యార్థులు చేరడం సంగతి అటుంచితే, ఫస్టియర్‌ నుంచి సెకండియర్‌కు ప్రమోట్‌ అయిన విద్యార్థులు కూడా కాలేజీలకు హాజరు కావడం లేదు. సాధారణంగా ఏటా జూన్‌ 1న ఇంటర్‌ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈలోగా ప్రైవేటు కాలేజీలు ఇంటింటి ప్రచారం చేసుకుని విద్యార్థులను చేర్పించుకుంటున్నారని, ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనే ఆలోచనతో ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌ 1 నుంచే ప్రారంభించారు. టెన్త్‌ ఫలితాలు రాకపోయినా కాలేజీల్లో చేరాలని ప్రభుత్వ కాలేజీలు విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఫస్టియర్‌ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నాయి. ఇంగ్లిష్‌, గణితం, సైన్స్‌ సబ్జెక్టులపై ప్రాథమిక బోధన ప్రారంభించారు. అలాగే సెకండియర్‌ విద్యార్థులకు కూడా ప్రాథమికాంశాలపైనే బోధిస్తున్నారు. సుదీర్ఘకాలంగా జూన్‌లో కాలేజీలు ప్రారంభమయ్యే సంస్కృతికి అలవాటుపడిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడే వేసవిలో తరగతుల ప్రారంభంపై ఆసక్తి చూపడం లేదు.


హాజరు చాలా తక్కువ

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గరిష్ఠంగా 30 శాతం మందే కాలేజీలకు హాజరవుతున్నారు. పలు కాలేజీల్లో హాజరు శాతం మరీ దారుణంగా ఉంది. చిత్తూరు జిల్లాలో ఓ కాలేజీలో 300 మంది విద్యార్థులకు గాను గరిష్ఠంగా 50 మంది మాత్రమే వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 350 మంది విద్యార్థులున్న ఓ కాలేజీలో 50 నుంచి 100 మంది మాత్రమే తరగతులకు హాజరవుతున్నారు. ఇక కొన్ని కాలేజీల్లో అయితే 10, 20 మంది మాత్రమే తరగతులకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హాజరు శాతం మరీ తక్కువగా ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాల విద్యార్థులే ఉంటారు. వారు వేసవి సెలవుల్లో చిన్నాచితకా పొలం పనులకు వెళ్తుంటారు. అలాంటి వారిని ఇప్పుడు కాలేజీలకు తీసుకురావడం లెక్చరర్లకు కష్టంగా మారింది. ఫస్టియర్‌ విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలు ముగిసినందున ఇప్పుడే కాలేజీలకు వచ్చేందుకు ఆసక్తి చూపట్లేదు. ఇక ఫస్టియర్‌లో విద్యార్థులను చేర్పించాలని ఇంటింటికీ తిరుగుతున్న లెక్చరర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. అసలు ఫలితాలే రాకుండా అప్పుడే కాలేజీ ఏంటని తల్లిదండ్రులు, విద్యార్థులు హేళనగా మాట్లాడుతున్నారని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో రోజంతా కాలేజీలు నిర్వహించడం కూడా హాజరు తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఏటా మార్చిలోనే పరీక్షలు అయిపోతాయి కాబట్టి ఇంటర్‌ కాలేజీలకు ఒంటిపూట బడుల అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఎండలు మండుతున్న సమయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వేసవిలో అంతసేపు కాలేజీలో ఉండాలా? అనే భావనతోనూ విద్యార్థులు హాజరు కావట్లేదు.


పాఠ్యపుస్తకాల పంపిణీ

కాలేజీలు తెరిచిన రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలను ఇంటర్‌ బోర్డు పంపిణీ చేసింది. కాలేజీలు ప్రారంభమైన రోజు నుంచే అన్నీ అందుబాటులో ఉండాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. అందుకు అనుగుణంగా పుస్తకాలు పంపిణీ చేసి, ప్రాథమిక అంశాలపై బోధన ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి అప్పటి నుంచి మే నెలాఖరు వరకు వేసవి సెలవులు ఇస్తారు. అప్పటి వరకూ బోధించిన అంశాలను వేసవిలో విద్యార్థులు చదువుకునే వెసులుబాటు ఉంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం ఈ బ్రిడ్జి కోర్సు, ప్రాథమిక అంశాల తరగతులు వినేందుకు ముందుకు రావట్లేదు.

గ్రూపుపై అస్పష్టతతో ఎలా?

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరే విద్యార్థులు సైన్సేతర గ్రూపులు తీసుకుంటూ ఉంటారు. సీఈసీ, హెచ్‌ఈసీ సబ్జెక్టులు చదువుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో ఇంగ్లిష్‌, గణితం, సైన్స్‌ సబ్జెక్టులపై ఫస్టియర్‌ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అవి ఉపయోగపడతాయి. సీఈసీ, హెచ్‌ఈసీ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ఒక్కటే ఉపయోగపడుతుంది. పైగా ఈ ఏడాది నుంచి కొత్తగా సబ్జెక్టుల విలీనం చేశారు. ఎంబైపీసీ ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో టెన్త్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు ఏ గ్రూపు తీసుకోవాలనే దానిపై స్పష్టతతో లేరు. దీంతో కాలేజీకి వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయం విద్యార్థుల్లో కనిపిస్తోంది.

Updated Date - Apr 11 , 2025 | 04:35 AM