ప్రైవేట్ భూముల్లో కెమికల్ వ్యర్థాల డంపింగ్
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:54 AM
రూరల్ మండలం జక్కంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ రసాయినాల డంపింగ్ వ్యవహారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది.
విజయవాడ రూరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం జక్కంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ రసాయినాల డంపింగ్ వ్యవహారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిగా జరుగుతున్న ఈ డంపింగ్‌తో సుమారు వంద ఎకరాలకు పైగా భూములు దుష్ప్రభావానికి గురయ్యాయి. ఆలస్యంగా గుర్తించిన ప్లాట్ల యజమానులు డంపింగ్ చేస్తున్న ట్యాంకర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
జక్కంపూడి పంచాయతీ పరిధిలో దశాబ్దాల క్రితం రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో 60-40 వెంచర్‌ను ఏర్పాటు చేశారు. 135 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన వెంచర్‌లో 711 ప్లాట్లున్నాయి. కొన్ని అమ్ముడవగా చాలా వరకు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. కొంతకాలంగా వెంచర్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటం రైతులు, ప్లాట్ల యజమానులు గుర్తించారు. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా, ఇటీవల దుర్వాసన విపరీతంగా వస్తుండటం, భూములు రంగు మారుతుండటం గమనించారు. నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి కొంతమంది కలిసి వెంచర్‌లో గస్తీ నిర్వహించారు. అనుకున్నట్టుగానే సోమవారం తెల్లవారుజామున కెమికల్ వ్యర్థాలతో నిండిన ఓ ట్యాంకర్ వెంచర్‌లోకి వెళ్తుండటం గమనించి మెల్లగా మోటారు సైకిళ్లతో వెంబడించారు. ట్యాంకర్‌తో పాటు ఓ వ్యక్తి కూడా ద్విచక్రవాహనంపై అక్కడికి చేరుకున్నాడు. వారిద్దరూ కలిసి కెమికల్ వ్యర్థ రసాయినాలను వెంచర్‌లోని ప్లాట్లలోకి వదిలేందుకు సిద్ధమయ్యారు. దీంతో గస్తీ కాస్తున్న యువకులు డ్రైవర్‌ను పట్టుకోగా ద్విచక్రవాహనంపై వచ్చిన మరో వ్యక్తి పరారయ్యాడు. దీంతో ప్లాట్ల యజమానులు, రైతులు అక్కడే ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకుని ట్యాంకర్‌తో పాటుగా బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ నుంచే కెమికల్ ట్యాంకర్
వెంచర్‌లో కెమికల్ వ్యర్థాలను డంప్ చేస్తున్నది తెలంగాణకు చెందిన ఓ కెమికల్ ఫ్యాక్టరీగా తెలుస్తోంది. సూర్యాపేటలోని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యర్ధాలను డంప్ చేసి వెళ్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ బీహారీ కావడం అతడికి తెలుగు రాకపోవడంతో సమాచారంలో జాప్యం జరుగుతోంది. వ్యర్థాల డంపింగ్‌కు బీహారీని పంపిన వ్యక్తుల ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు మరోకోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వంద ఎకరాలపై దుష్ప్రభావం
ఏడాది కాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న కెమికల్ వ్యర్థాల డంపింగ్ కారణంగా వెంచర్‌లోని సుమారు 100 ఎకరాలపై దుష్ప్రభావం పడింది. ఆయా స్థలాలన్ని కెమికల్ వ్యర్థాలతో నిండి తీవ్ర దుర్వాసన రావడమే కాకుండా భూముల రంగు మారిపోయింది. కొంతభాగం నల్లగాను, మరికొంత భాగం తెలుపు, గోధుమ రంగులతో మారిపోయి అటువైపు వెళ్లలేని విధంగా తయారయ్యాయి. సమీప బోర్ల నుంచి కూడా కలుషిత నీరు వస్తున్నట్టు అక్కడి వారు చెబుతున్నారు. డంపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.