Operation Eagle: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:29 AM
రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నియంత్రణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఈగల్ ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు..
రైళ్లలో తనిఖీలు చేసి చెక్ పెడుతున్న పోలీసులు
‘ఆపరేషన్ ఈగల్’ కొనసాగిస్తాం: డీజీపీ
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి నియంత్రణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక విభాగం(ఈగల్) ఏర్పాటు చేయడంతో స్మగ్లర్లు రూటు మార్చారు. విశాఖ జిల్లా మన్యంలో గంజాయి సాగు పది వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించేసిన పోలీసుల చర్యలు స్మగ్లర్లను ఆర్థికంగా దెబ్బతీశాయి. దేశంలో ఎక్కడా లేని శీలావతి రకం గంజాయి మన రాష్ట్రంలో లభిస్తుండంతో దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించేంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేసి 459 మందితో ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో గంజాయి కట్టడికి చర్యలు చేపడుతోంది. ఓ వైపు విద్యార్థుల్లో, వినియోగదారుల్లో అవగాహన తీసుకొస్తూ.. మరో వైపు సరఫరాదారులపై ఆయా ప్రాంతాల పోలీసులతో కలిసి కేసులు పెడుతోన్న ఈగల్ బృందం రోడ్డు మార్గంలో మత్తు పదార్థాల సరఫరాకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే ఒడిసా నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు మన రాష్ట్రం మీదుగా వెళ్లే రైళ్లలో గంజాయి తరలిస్తున్నారు. దీనిపై దష్టి సారించి గత నెల 3 నుంచి 11 వరకు చేపట్టిన ‘ఆపరేషన్ ఈగల్’ మంచి ఫలితాలు ఇచ్చిందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. మన రాష్ట్రం గుండా వెళ్లే పలు రైళ్లలో తనిఖీలు నిర్వహించి 43 కిలోల గంజాయి, 436 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకుని పది మందిపై ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్టు చెప్పారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్, రాయగడ- గుంటూరు ఎక్స్‌ప్రెస్, కోర్బా- విశాఖపట్నం, ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై ఎక్స్‌ప్రెస్, టాటానగర్- ఎర్నాకుళం, ప్రశాంతి ఎక్స్‌ప్రె్‌సలలో గంజాయి తరచూ పట్టుబడుతోందని వెల్లడించారు. మత్తు పదార్థాలకు ఎవరూ అలవాటు పడొద్దని, గంజాయి విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు.