Share News

డ్రిప్పు సేద్యం సబ్సిడీ ఖరారు

ABN , Publish Date - Feb 19 , 2025 | 10:58 PM

సూక్ష్మ సాగునీటి పథకం కింద డ్రిప్పు, తుంపర్ల పరికరాలను అమర్చేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సబ్సిడీని ఖరారు చేసిందని కర్నూలు జిల్లా ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి తెలిపారు.

 డ్రిప్పు సేద్యం సబ్సిడీ ఖరారు

ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం

మిగతా రైతులకు 90 శాతం

ఉమ్మడి జిల్లాలో 15వేల హెక్టార్లలో డ్రిప్పు ఏర్పాటు

కర్నూలు అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ సాగునీటి పథకం కింద డ్రిప్పు, తుంపర్ల పరికరాలను అమర్చేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సబ్సిడీని ఖరారు చేసిందని కర్నూలు జిల్లా ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడిపి రాజశేఖర్‌ పంపిన ఉత్తర్వులు బుధవారం తమ కార్యాలయానికి అందినట్లు పీడీ తెలిపారు. ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ, సన్న చిన్నకారు రైతులకు వంద శాతం సబ్సిడీపై పరికరాలు అందుతాయన్నారు. దీని వల్ల రైతులందరికీ బోరుబావులు ఉన్న వారికి వంద శాతం సబ్సిడీపై డ్రిప్పు పరికరాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీ, ఎస్టీయేతర సన్న చిన్న కారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా 2.18 లక్షలు) ఉంటుందని, అదే విదంగా ఉమ్మడి జిల్లాలో 5 నుంచి 10 ఎకరాల్లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (3.14 లక్షలు) ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఈ పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం (రూ.19 వేలు), 12.5 ఎకరాల్లోపు పొలం కలిగిన ఇతర సామాజికవర్గాలకు 50 శాతం చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు పీడీ ఉమాదేవి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15వేల హెక్టార్లకు డ్రిప్పు పరికరాలను ఈ ఆర్థిక సంవత్సరం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పీడీ తెలిపారు. ప్రస్తుతం భూగర్బజలాలు అడుగంటుతున్న నేపథ్యంలో డ్రిప్పు, తుంపర్ల సేద్యం కలిగిన రైతులకు పంట చేతికొచ్చేవరకు పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 10:58 PM