Share News

క్వారీ భూముల్లో ‘డ్రాగన్స్‌’

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:23 AM

బాపులపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గ్యాంగ్‌ చేసిన అరాచకాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకునే పొలాలను దౌర్జన్యంగా ఆక్రమించి యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు చేశారు. ఆ తర్వాత ఆ భూములను చదును చేసి డ్రాగన్‌ ఫ్రూట్‌, మొక్కజొన్న, నిమ్మతోటలను సాగు చేసి ఆదాయం పొందుతున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లతో పట్టాలు పుట్టించి పాసుపుస్తకాలను పొందారు. వాటిని స్థానిక సహకార సంఘాల్లో చూపి రుణాలు సైతం తీసుకున్నారు. వైసీపీ నేతల బహుళ ప్రయోజన దందాలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

 క్వారీ భూముల్లో ‘డ్రాగన్స్‌’

- బాపులపాడు మండలంలో వంశీ అనుచరుల భూదందాలు

- కొండల్లో అక్రమంగా తవ్వకాలు..ఆపై చదును చేసి పంటల సాగు

- క్వారీ గోతుల్లోని నీటితో మొక్కజొన్న, డ్రాగన్‌ ఫ్రూట్‌, నిమ్మతోటల పెంపకం

- సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ నేతలపై భౌతిక దాడులు

- ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న వంశీ గ్యాంగ్‌ బహుళ ప్రయోజన అరాచకాలు

బాపులపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గ్యాంగ్‌ చేసిన అరాచకాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకునే పొలాలను దౌర్జన్యంగా ఆక్రమించి యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు చేశారు. ఆ తర్వాత ఆ భూములను చదును చేసి డ్రాగన్‌ ఫ్రూట్‌, మొక్కజొన్న, నిమ్మతోటలను సాగు చేసి ఆదాయం పొందుతున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో బినామీ పేర్లతో పట్టాలు పుట్టించి పాసుపుస్తకాలను పొందారు. వాటిని స్థానిక సహకార సంఘాల్లో చూపి రుణాలు సైతం తీసుకున్నారు. వైసీపీ నేతల బహుళ ప్రయోజన దందాలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

-ఆంధ్రజ్యోతి-హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌

- రేమల్లె శివారులో మల్లవల్లి పారిశ్రామికవాడకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న సర్వే నంబర్‌ 418-8, 9ల్లోని సుమారు 22 ఎకరాల భూమిని హరిదాసులకు పట్టాలు కేటాయించారు. ఆ భూమిని రెవెవన్యూ అధికారుల సహకారంతో కొందరు పెద్దలు భయపెట్టి ఆక్రమించుకోవడంతో పాటు 20 అడుగుల లోతు క్వారీ తవ్వి గ్రావెల్‌ను తరలించేశారు. ఈ క్వారీ గోతుల్లోని నీటితో చుట్టు పక్కల మొక్కజొన్న సాగు చేస్తున్నారు.

- పైభూమికి ఎదురుగా ఉన్న 422 సర్వే నంబరులోని 18 ఎకరాల భూమిలో అక్రమంగా తవ్వకాలు సాగించి తదనంతరం చదును చేసి డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట సాగు చేస్తున్నారు. మొత్తం భూమి విలువ ఇప్పటి లెక్కల ప్రకారం సుమారు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని స్థానికులు చెబుతున్నారంటే ప్రభుత్వానికి ఎంత భారీ నష్టం వాటిల్లిందో అర్థమవుతోంది. అక్రమంగా తరలించిన గ్రావెల్‌ లెక్క వేస్తే అదే సుమారు రూ.17కోట్ల వరకూ ఉంటుందని అంచనా. దీన్ని బట్టి ఒక్క చోట సుమారు 38 ఎకరాల్లో రూ.37 కోట్ల ప్రజాధనం పెద్దల పాలైంది.

- మల్లవల్లిలోని మూడు ఎకరాల అసైన్డ్‌ భూమిలో అక్రమ క్వారీయింగ్‌ నిర్వహించి 12 అడుగుల లోతు తవ్వేడంతో పాటు చదును చేసి నిమ్మతోట సాగు చేసుకుంటున్నారు. దీనికి స్థానికంగా ఉండే మండల స్థాయి వైసీపీ నాయకుడొకరు అండగా నిలబడటంతో ప్రజలు కూడా ఏమీ చేయలేని స్థితిలో అధికారులు వస్తే ఆధారాలు చూపిద్దామంటూ ఎదురుచూస్తున్నారు.

- కోడూరుపాడులోని శ్రీకోదండ రామస్వామి ఆలయానికి 1968లో వెలమదొరలు సర్వే నంబర్‌ 111-1లో ఎకరం భూమి దానంగా ఇచ్చారు. ఆ భూమిని కూడా వదలకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో( రూ.లక్షల్లో ముడుపులు ఇచ్చి) వంశీ అనుంగ సహచరుల ద్వారా వేరే వ్యక్తి మైనారిటీ వ్యక్తులకు రిజిసే్ట్రషన్‌ చేశారు. స్థానిక వైసీపీ నాయకుడు ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

- ఇక పోలవరం కాలువపై రెండు వైపులా ఉన్న గట్లపై కొండల్లా ఉన్న మట్టిని సైతం తమ అధికారాన్ని ఉపయోగించి తవ్వి తరలించేయడంతో పాటు కొన్ని చోట్ల అనధికారిక లేఅవుట్లకు మెరక తోలారు. జగనన్న కాలనీల మెరక పేరుతో పోలవరం గట్టును కొల్లగొట్టారు.

- బాపులపాడు మండలంలోని వందల ఎకరాల్లో వంశీ అనుచరులు చేసిన అవినీతి, అక్రమ తవ్వకాలపై అటు టీడీపీ నాయకులు, ఇటు స్థానికులు పోరాటం చేస్తున్నా అధికారుల్లో మాత్రం చలనంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ క్వారీయింగ్‌పై విజిలెన్స్‌ విచారణ అంటూ ఆరు నెలల కిందట హడావుడి చేసి నోటీసులిచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ బడాబాబులు మాత్రం కార్లలో కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాడు ఎన్నికల వేళ ప్రత్యర్థులపై భౌతిక దాడులు

సార్వత్రిక ఎన్నికల వేళ వంశీ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తరఫున ప్రచారం చేస్తున్న నేతలపై భౌతిక దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడుల్లో గాయపడ్డ ఎందరో ఆస్పత్రుల పాలయ్యారు.

- కొయ్యూరులో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రెంటపల్లి బాబూరావు అనే వ్యక్తిని దారుణంగా కొట్టారు. గుండె ఆపరేషన్‌ చేయించుకున్న ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. యార్లగడ్డ దగ్గరుండి మెరుగైన వైద్యం అందించడంతో బాబూరావు తిరిగి కోలుకున్నారు.

- కుమార్తె బారసాల ఏర్పాట్లు చేసుకుంటున్న బాపులపాడు తెలుగు యువత అధ్యక్షుడు చెరుకూరి హరికృష్ణను మరో రెండు రోజుల్లో ఎన్నికలు అనగా దాడి చేసి కొట్టారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేసినా ఇప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోలేదు.

- టీడీసీ ఎన్నికల చీఫ్‌ ఏజెంట్‌ ఆళ్ల గోపాలకృష్ణపై కొత్తమల్లవల్లిలో వైసీపీ శ్రేణులు మూకదాడి చేశాయి. దుస్తులు చించివేసి వాహనాన్ని ధ ్వంసం చేశాయి. వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ ఈ కేసులో పురోగతి లేదు.

Updated Date - Feb 23 , 2025 | 01:23 AM