Share News

Nara Lokesh: డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో..చీకటి నుంచి వెలుగు వైపు

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:01 AM

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసిందని మంత్రి లోకేశ్‌ అన్నారు..

Nara Lokesh: డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో..చీకటి నుంచి వెలుగు వైపు

ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ.. ఇదే మా ప్రభుత్వ నినాదం: లోకేశ్‌

  • మోదీ, బాబు, పవనన్న కలిసిసుపరిపాలనలో తొలి అడుగు: మంత్రి

  • గుంటూరులో జాతీయ జెండా ఆవిష్కరణ

గుంటూరు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసిందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ‘ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. అందుకు అనుగుణంగానే రాష్ట్రం నలుమూలలకూ వివిధ రకాల పరిశ్రమలు రప్పిస్తున్నాం..’ అని తెలిపారు. గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ దిశగా ఆర్సెలార్‌ మిట్టల్‌, ఏఎన్‌ఎ్‌సఆర్‌, సత్వ వంటి ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి రప్పించామన్నారు. 2019 నుంచి 2024 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రోజులు చూశామని.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘2024 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో చరిత్ర సృష్టించారు. 94 శాతం స్ర్టైక్‌ రేట్‌, 164 సీట్లలో ఎన్డీయేను గెలిపించి రికార్డులు బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న కలిసి సుపరిపాలనలో తొలి అడుగు వేశారు’ అని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్ముతానని.. విద్యా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఏడాదిలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని చెప్పారు. ‘కేజీ నుంచి పీజీ వరకూ కరిక్యులం మార్చాం. పుస్తకాల్లో నా ఫొటోలు, సీఎం ఫొటోలు లేవు. గతంలో 1,200 మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ ఉంటే ఇప్పుడు 9,600 ఏర్పాటు చేశాం. మెగా పేరెంట్స్‌-టీచర్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం. స్టూడెంట్‌ కిట్‌కు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరు పెట్టాం. చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు విద్యార్థులకు ఇస్తున్నాం. వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నాం. మంచి వ్యక్తులను వీసీలుగా నియమిస్తున్నాం’ అని చెప్పారు.


స్వాతంత్య్ర పోరాటంలో తెలుగునేలది ప్రత్యేక చరిత్ర

స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉందని లోకేశ్‌ తెలిపారు. ‘బ్రిటిష్‌ వాడి తుపాకీకి గుండె చూపిన యోధుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అని నినదించారు గరిమెళ్ల సత్యనారాయణ. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతోమంది దేశభక్తులు, సమరయోధులు మన తెలుగు నేలపైనే పుట్టారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణత్యాగం చేశారు. మంగళగిరిలో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు, ఆనాటి ఘట్టాలను గుర్తు చేస్తూ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం’ అని ప్రకటించారు. మన దేశ పవర్‌ ఫుల్‌ మిస్సైల్‌ ప్రధాని మోదీ అని.. పాక్‌కు సరైన శిక్ష వేశారని చెప్పారు. ఆపరేషన్‌ సింఽధూర్‌తో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. ‘ఆపరేషన్‌ సింధూర్‌ జరిగేటప్పుడు కొంతమంది సైనికులను మనం కోల్పోయాం. అందులో మన రాష్ర్టానికి చెందిన మురళీ నాయక్‌ కూడా ఉన్నారు. ఆయన తల్లిదండ్రులను కలిశాను. వారికి ఆయనొక్కడే కొడుకు. సైన్యంలోకి వెళ్లడం వారికి ఇష్టం లేదు.. నీకు ఏమైనా అయితే మేం తట్టుకోలేమన్నారు. అప్పుడు మురళీ నాయక్‌ ఒక్కటే చెప్పారు. నేను యుద్ధంలో చనిపోతే దేశం మొత్తం మీ కోసం నిలబడుతుందన్నారు. ఆయనలాంటి సైనికులు సరిహద్దులో పోరాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నాం’ అని లోకశ్‌ వివరించారు

Updated Date - Aug 16 , 2025 | 04:01 AM