బాల్యవివాహాల టోల్ ఫ్రీ నంబరే తెలీదా..!
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:14 AM
బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరే మీకు తెలీదా.. ఇక మీరు ప్రజలకు ఏం అవగాహన కల్పిస్తారు. మొదట మీరే అవగాహన పెంచుకోండి.. తర్వాత ప్రజలకు అవగాహన కల్పిద్దురుగాని.. ’ అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డిపై అధికారులు, ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు.

ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరే మీకు తెలీదా.. ఇక మీరు ప్రజలకు ఏం అవగాహన కల్పిస్తారు. మొదట మీరే అవగాహన పెంచుకోండి.. తర్వాత ప్రజలకు అవగాహన కల్పిద్దురుగాని.. ’ అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డిపై అధికారులు, ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే మాట్లాడారు. బాల్య వివాహాలు ఈ మండలంలోనే అధికంగా జరుగుతున్నాయని, జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో ఉందని, వాటిని అరకట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని, దాని గురించైనా తెలుసా అని ప్రశ్నించాగా.. అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండిపోయారు. దీంతో అవాక్కైన ఎమ్మెల్యే.. దీనిబట్టి చూస్తూ మీరు ప్రజలకు ఏ మాత్రం అవగాహన కల్పిస్తున్నారో ఇట్టే అర్థమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట మీరు 1098 టోల్ ఫ్రీ నెంబర్‌పై అవగాహన పెంచుకోండి.. తర్వాత ప్రజలకు కల్పించండని చురకలంటించారు.