Share News

District Reorganization: మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:03 AM

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాల పేర్లు మార్పు.. డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి...

District Reorganization: మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన
Andhra Pradesh Districs

  • ఏడుగురు మంత్రులతో ఉపసంఘం

  • జిల్లాల పేర్ల మార్పు, డివిజన్లు, మండల,గ్రామాల సరిహద్దులపై ప్రజల విన్నపాల పరిశీలన

  • సరిహద్దులు, చారిత్రక నేపథ్యంపై అధ్యయనం

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించాలని సూచన

  • నివేదికకు కాలపరిమితి విధించని వైనం

అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాల పేర్లు మార్పు.. డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ మంగళవారం ఉత్తర్వులు(జీవో 1378) జారీ చేశారు. ఉపసంఘంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, పురపాలక మంత్రి పొంగూరు నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్‌ అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌, వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సభ్యులు.

జగన్‌ ప్రభుత్వం 2022లో లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేపట్టిన సంగతి తెలిసిందే. 13 జిల్లాలను 26గా చేసింది. జిల్లాల ఏర్పాటు, అందుకు జరిగిన కసరత్తుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు నాటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో జగన్‌ సర్కారు అధికార యత్రాంగాన్ని జిల్లాలకు పంపింది. దాదాపు 80 వేల అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నిటినీ జగన్‌ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. జిల్లాల అంశంపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాల పేర్లు, వాటి సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్చాలని కోరారు.


వీటిపై తక్షణమే స్పందించకూడదని ప్రభుత్వ వర్గాలు తొలుత భావించాయి. జిల్లాల పునర్విభజన తమ పరిశీలనలో లేదని రెవెన్యూ మంత్రి అనగాని ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చారు. అయితే జిల్లాలు, డివిజన్‌, మండలాల సరిహద్దుల విషయంలో పాలనాపరంగా అనేక సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు నివేదికలు పంపించాయి. కలెక్టర్లు, సీనియర్‌ అధికారులనుంచి కూడా పలు సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేసింది. మంత్రివర్గ ఉపసంఘంతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నది ప్రభుత్వం ఉద్దేశమని అధికార వర్గాలు అంటున్నాయి. ఇందుకు అధిక సమయం పడుతుంది. అందుకే ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలో కాలపరిమితి నిర్దేశించలేదని సమాచారం.


ఉపసంఘం చేయాల్సింది ఇవీ..

  • పరిపాలనా సౌలభ్యం కోసం వాస్తవిక పరిస్థితులనుదృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు ప్రతిపాదించాలి.

  • జిల్లాలు, డివిజన్‌, మండలాల సరిహద్దుల వివాదాలను పరిశీలించి వాటికి పరిష్కారాలు చూపాలి. అలాగే జిల్లా కేంద్రానికి, రెవెన్యూ డివిజన్‌, మండల కేంద్రాలకు ప్రజలు సులువుగా చేరుకునేలా దూరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనలు ఇవ్వాలి.

  • ఆయా ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక నేపఽఽథ్యాన్ని కాపాడుతూ జిల్లా, డివిజన్‌ యూనిట్ల సరిహద్దులను ప్రతిపాదించాలి.

  • ఆయా ప్రాంతాల మధ్య ఆర్థిక-సామాజిక సమతుల్యతను పెంపొందించేలా ప్రతిపాదనలు ఇవ్వాలి.

  • భౌగోళిక పరిమితితోపాటు సౌలభ్యంతో కూడిన పరిపాలన ఉండేలా ప్రతిపాదనలు రూపొందించి నివేదించాలి.

  • ఇంకా ప్రజల నుంచి వచ్చే విన్నపాలు, ఫిర్యాదులను అధ్యయనం చేసి.. సరిహద్దులు ఎలా ఉండాలి.. జిల్లా ప్రధాన కేంద్రం ఎక్కడుండాలి.. జిల్లాల సాంప్రదాయిక పేర్లు ఎలా ఉండాలి.. పరిపాలనా సౌలభ్యం, వనరులన్నీ సర్దుబాటయ్యేలా ప్రతిపాదనలు ఇవాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 08:57 AM