Share News

ఉన్నత విద్యామండలి X కళాశాల విద్యాశాఖ!

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:36 AM

ఉన్నత విద్యాశాఖలో ఆధికార పోరు సాగుతోంది. ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ మధ్య అధికారాల మార్పిడి ప్రయత్నాలు అంతర్గత విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ విభేదాలు వచ్చే విద్యా సంవత్సరంపై ప్రభావం చూపించే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాదికి తెలంగాణ ఈఏపీసెట్‌ తేదీలు ప్రకటించింది. కానీ ఇక్కడ ఇంతవరకూ కన్వీనర్లనే నియమించలేదు. ఉన్నత విద్యాశాఖలో ఉన్నత విద్యామండలి పాత్ర కీలకం.

ఉన్నత విద్యామండలి X కళాశాల విద్యాశాఖ!

ఉన్నత విద్యాశాఖలో అధికారం కోసం పోరాటం

పలు అంశాల్లో మండలికి తగ్గిన ప్రాధాన్యం

త్వరలో అడ్మిషన్ల బాధ్యతలూ తొలగింపు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉన్నత విద్యాశాఖలో ఆధికార పోరు సాగుతోంది. ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ మధ్య అధికారాల మార్పిడి ప్రయత్నాలు అంతర్గత విభేదాలకు దారితీస్తున్నాయి. ఈ విభేదాలు వచ్చే విద్యా సంవత్సరంపై ప్రభావం చూపించే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాదికి తెలంగాణ ఈఏపీసెట్‌ తేదీలు ప్రకటించింది. కానీ ఇక్కడ ఇంతవరకూ కన్వీనర్లనే నియమించలేదు. ఉన్నత విద్యాశాఖలో ఉన్నత విద్యామండలి పాత్ర కీలకం. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ బాధ్యత మొత్తం మండలి పరిధిలోనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యకు కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగానే ఉన్నత విద్యామండలి బాధ్యతలను బలవంతంగా తీసుకునే ప్రయత్నాలను కళాశాల విద్యాశాఖ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ అడ్మిషన్ల ప్రక్రియకు టెండర్లు పిలిచినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై జీవో విడుదల చేసి పూర్తిస్థాయిలో అడ్మిషన్లను తన పరిధిలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఉన్నత విద్య కమిషనరేట్‌ ఏర్పాటు చేయకుండానే అడ్మిషన్ల బాధ్యతలు తీసుకోవడంపై మండలి వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఎలా తీసుకుంటారని మండలి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా, ప్రవేశ పరీక్షలు నిర్వహణను త్వరలో కళాశాల విద్యాశాఖకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారాల మార్పిడి ప్రయత్నాలతో ఇటీవల ఉన్నత విద్యాశాఖలో పలు అంశాల్లో సమన్వయం కుదరట్లేదు. వర్సిటీ వీసీల నియామకానికి ఏర్పాటుచేసిన సెర్చ్‌ కమిటీల సభ్యులను మండలి ప్రమేయం లేకుండా నియమించడంతో ఆ కమిటీల సమావేశాల్లో జాప్యం జరుగుతోందని తెలిసింది. ప్రైవేటు వర్సిటీల అంశంపై ఇటీవల నియమించిన కమిటీని కూడా మండలి సలహా లేకుండానే నియమించినట్లు ప్రచారం సాగుతోంది. ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను ప్రకటిద్దామని మండలి ప్రయత్నించినా సమన్వయం లేకపవడంతో ఆగిపోయింది. ఇలా పలు అంశాల్లో ఉన్నత విద్యామండలికి ప్రాధాన్యం తగ్గినట్లు స్పష్టమవుతోంది.

మంత్రి పేషీ అధికారి జోక్యం

ఉన్నత విద్యాశాఖలో మంత్రి లోకేశ్‌ పేషీలో ఓ అధికారి జోక్యం పెరుగుతోందనే ఆరోపణలున్నాయి. వివిధ విభాగాలను సమన్వయం చేయాల్సిన ఆయన... ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, శాఖలో అంతర్గత అంశాలు మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా తన స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖలో అదనపు డైరెక్టర్లు, జేడీల బదిలీల సమయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకున్నారని ఆ శాఖ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సాంకేతిక విద్యాశాఖ నుంచి డెప్యుటేషన్‌పై సచివాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కూడా ఉన్నత విద్యాశాఖపై పెత్తనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంజనీరింగ్‌ అడ్మిషన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన్ను డెప్యుటేషన్‌పై సచివాలయంలో నియమించడంపై విమర్శలున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు.

Updated Date - Feb 07 , 2025 | 05:36 AM