Share News

మంత్రాలయంలో పార్కింగ్‌కు కష్టాలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:13 AM

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు పార్కింగ్‌ కోసం అష్టకష్టాలు పడుతున్నారు.

మంత్రాలయంలో పార్కింగ్‌కు కష్టాలు
ప్రధాన రహదారిపైనే వాహనాల పార్కింగ్‌

మంత్రాలయం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు పార్కింగ్‌ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గదులు తీసుకున్న లాడ్జీల వద్దే వాహనాలు పార్కింగ్‌ చేయాల్సి ఉండగా.. అక్కడ స్థలం లేక ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రధాన రహదారులు, పాఠశాల ఆవరణాలలో కార్లను పార్కింగ్‌ చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు లాడ్జీల యజమానులు అద్దెల రూపాల్లో నిలువుదోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.400లకు వచ్చే రూము రద్దీ సమయాల్లో రూ.8వేల నుంచి ఆపైనే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మంత్రాలయంలో 120 ప్రైవేటు లాడ్జీలు ఉన్నా.. చాలా లాడ్జీల్లో పార్కింగ్‌కు స్థలమే లేదు. దీంతో జడ్పీ పాఠశాల, సంత మార్కెట్‌, తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం, నాగలదిన్నె, ఎమ్మిగనూరు, మాధవరం, రోడ్డులో ఇరువైపులా పార్కింగ్‌ చేస్తూ ఇతర వాహనాలకు అడ్డంకీగా మారుతున్నారు. రాఘవేంద్ర సర్కిల్‌ నుంచి గ్రామ పంచాయతీ వరకు హోటళ్లు, లాడ్జీలకు ఇరువైపులా ప్రధాన రహదారుల వెంట ఆపడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి పార్కింగ్‌ కోసం స్థలం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:13 AM