Share News

Polavaram Project : రేపటి నుంచే డయాఫ్రం వాల్‌ పనులు!

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:52 AM

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అవాంతరాలు తొలగిపోయాయి. సెంట్రల్‌ సాయిల్‌-మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్‌

 Polavaram Project : రేపటి నుంచే డయాఫ్రం వాల్‌ పనులు!

టీ-5 కాంక్రీట్‌ మిశ్రమానికే జలసంఘం ఓటు

సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ సిఫారసుకు ఆమోదం.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమాచారం

సీఎం ఆమోదించగానే ముందుకు.. ఈ ఏడాది చివరికల్లా పనుల పూర్తికి బావర్‌కు గడువు

టీ-5 కాంక్రీట్‌ మిశ్రమానికే జలసంఘం ఓటు.. సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ సిఫారసుకు ఆమోదం

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమాచారం

సీఎం, మంత్రి ఆమోదించగానే ముందుకు

ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రం వాల్‌

పనుల పూర్తికి బావర్‌కు గడువు

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అవాంతరాలు తొలగిపోయాయి. సెంట్రల్‌ సాయిల్‌-మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్నే నిర్మాణంలో ఉపయోగించాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి తన నిర్ణయాన్ని తెలియజేసింది. దీంతో.. ఈ నెల 18వ తేదీన మంచిరోజు కావడంతో వాల్‌ పనులు ప్రారంభించాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి.. వారి ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించాలని జల వనరుల శాఖ, ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ సిబ్బంది నిర్ణయించారు. ఇప్పటికే యంత్రాలు, నిపుణులను కూర్చుకున్న బావర్‌ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది. పైగా 2016లో అప్పటి డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థతో కలసి బావరే టీ-5 మిశ్రమాన్ని రూపొందించి ఉపయోగించింది. ఇప్పుడూ ఇదే వాడాలని జల సంఘం ఆదేశించడంతో తమ పని మరింత సులువవుతుందని ఆ సంస్థ చెబుతోంది. వాస్తవానికి కాంక్రీట్‌ మిశ్రమంపై అమెరికా, కెనడా నిపుణులకు అవగాహన లేదని పీపీఏ, జల వనరుల శాఖ తొలుతే చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ గతంలో జలసంఘం బాధ్యతలు చేపట్టిన ఏబీ పాండ్యా మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. వారు టీ-16 మిశ్రమాన్ని వాడాలని సూచించారు. అయితే అది పెలుసుగా ఉంటుందని.. అది వాడితే మున్ముందు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ సహా కేంద్ర పరిశోధనా సంస్థలు స్పష్టం చేశాయి. టీ-5 మిశ్రమం మేలని సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ పేర్కొనడంతో జల సంఘం చివరకు దానికే మొగ్గుచూపింది. కాగా.. అంతర్జాతీయ నిపుణులు పోలవరంపై ఇప్పటిదాకా ఇచ్చిన సలహాలన్నీ వృథాగా మిగిలిపోయాయని నిపుణులు అంటున్నారు. వారి అభిప్రాయం తప్పనిసరని చెబుతూ ఈ నెల 2న ప్రారంభం కావలసిన పనులకు జలసంఘం అనవసరంగా మోకాలడ్డి జాప్యం చేసిందని చెబుతున్నారు. అయితే పనులు ఇప్పుడు రెండు వారాలు ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది చివరిలోగా డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తిచేసి తీరాలని బావర్‌కు జలవనరుల శాఖ లక్ష్యం విధించింది.


హంద్రీ-నీవా విస్తరణకు పచ్చజెండా

గండికోట నుంచి సీబీఆర్‌కు అదనపు లిఫ్టుతో జలాల ఎత్తిపోత

అంచనా వ్యయం రూ.3,240 కోట్లు.. యుద్ధప్రాతిపదికన పనుల పూర్తి

కార్యాచరణ కోసం చంద్రబాబు ఆదేశం

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా సుజల స్రవంతి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గురువారమిక్కడ ఉండవల్లిలోని తన నివాసంలో ఈ ప్రాజెక్టుపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో ఆయన సమీక్ష జరిపారు. గండికోట రిజర్వాయరు నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు(సీబీఆర్‌)కు అదనపు లిఫ్ట్‌ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు ప్రస్తుత ధరల ప్రకారం రూ.3,240 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 17.25 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌, 15.835 కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వాల్సి ఉంటుంది. ఈ పనులకు టెండర్లను పిలిచి ప్రారంభిస్తే రెండున్నరేళ్లలో పూర్తవువుతాయని జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భూసేకరణకు తావులేకుండా ప్రస్తుతం ఉన్న కాలువల వెడల్పు, పొడవు పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రూ.2,657 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నుంచి హంద్రీ-నీవాకు రెండో దశ ఎత్తిపోతల పనులను 24 నెలల్లో పూర్తి చేసే పథకంపైనా ఆయన సమీక్షించారు. 28.75 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్‌, 1.25 కిలో మీటర్ల మేర ప్రెషర్‌ మెయిన్‌ తవ్వాల్సి వస్తుందని అధికారులు చెప్పారు. ఆరు స్టేజ్‌లలో పంప్‌ హౌస్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వాస్తవానికి 2021 ఎస్‌ఎ్‌సఆర్‌ ధర ప్రకారం గండికోట రిజర్వాయరు నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుకు ఎత్తిపోతల ద్వారా అదనపు జలాలు తరలించేందుకు రూ.2,700 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను అప్పట్లో మేఘా ఇంజనీరింగ్‌కు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది. 2019-24 మధ్య కాలంలో ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఇన్వెస్టిగేషన్‌ దశలోనే మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ఈ ఎత్తిపోతల పనులు నిలిపివేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ జలవనరుల శాఖ ఆ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు సిద్ధమైంది.

Updated Date - Jan 17 , 2025 | 03:52 AM