Simhagiri: సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:22 AM
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల హరినామ స్మరణ నడుమ బుధవారం సింహ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది.
సింహాచలం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల హరినామ స్మరణ నడుమ బుధవారం సింహ‘గిరి ప్రదక్షిణ’ ప్రారంభమైంది. ఆషాఢమాస శుక్ల పక్ష చతుర్దశినాడు సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేయడం అనాదిగా వస్తోంది. ఏటా మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి పుష్పతేరు(ప్రచార రథం)కు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి సింహగిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు) పాల్గొన్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఈవో నిరంతరం సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.