Southmopuru: అక్షరం అండగా..అభివృద్ధి దిశగా..
ABN , Publish Date - May 21 , 2025 | 04:13 AM
నెల్లూరు జిల్లాలోని సౌత్‌మోపూరు గ్రామానికి ‘ఆంధ్రజ్యోతి’ కార్యక్రమం ద్వారా రూ.1.22 కోట్ల నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం విజయోత్సవ సభకు గ్రామంలో పాల్గొననున్నారు.
సౌత్‌మోపూరు గ్రామంలో నేడు విజయోత్సవ సభ
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ‘ఆంధ్రజ్యోతి’ ఈడీ ఆదిత్య రాక
గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’లో వచ్చిన సమస్యలకు పరిష్కారం
నెల్లూరు రూరల్, మే 20(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఆరంభంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా...’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన కార్యక్రమంతో నెల్లూరులోని మారుమూల గ్రామమైన సౌత్‌మోపూరు అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. నెల్లూరు నగరానికి పశ్చిమాన 23 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామంలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు లేవు. జడ్పీ హైస్కూల్‌కు ప్రహరీ లేదు. శ్మశానాలు ఆక్రమణలకు గురవుతుండేవి. ఇంకా అనేకసమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఈ గ్రామాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గుర్తించింది. గత జనవరి చివరి వారంలో ప్రత్యేక కథనాల ద్వారా వీటిని వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ అధ్యక్షతన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా...’ గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యల పరిష్కారానికి రూ.1.22 కోట్లు మంజూరు చేయించారు. దీంతో గత మూడు నెలలుగా ఈ ఊరి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఇప్పటికే కొన్నిపనులు పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇక్కడ జరిగిన, జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా చూసి, ప్రజలతో మమేకమయ్యేందుకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ‘ఆంధ్రజ్యోతి’ ఈడీ వేమూరి ఆదిత్య, టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి బుధవారం సౌత్‌మోపూరుకి విచ్చేయనున్నారు. వారు ఉదయం 11 గంటలకు గ్రామంలోని గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుని సీసీ రోడ్డును, అనంతరం జడ్పీ హైస్కూల్‌ను సందర్శించి, నిర్మాణంలో ఉన్న ప్రహరీని పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వేసిన సీసీ రోడ్డును చూస్తారు. 11.20 గంటలకు బీసీ కాలనీలో రచ్చబండపై రూ.2 లక్షలతో నిర్మించతలపెట్టిన శ్లాబు పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు బీసీ కాలనీలోని వేంకటేశ్వర కల్యాణ మండపంలో జరిగే వియోత్సవ సభలో పాల్గొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News