Share News

Devasthanam Department: దేవదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ల భర్తీకి చెల్లు

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:21 AM

దేవదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ల పోస్టుల నియామకాలపై 29 సంవత్సరాలుగా నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆర్జీసీ, డీసీ పోస్టుల కొరతను పరిష్కరించేందుకు ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు అవసరం

Devasthanam Department: దేవదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ల భర్తీకి చెల్లు

  • 29 ఏళ్లుగా ఆ పోస్టుల భర్తీ ఊసే లేదు.. ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్‌ చేపట్టని వైనం

  • త్వరలో కొంత మంది అర్జేసీల పదవీ విరమణ

  • దేవుడి శాఖను వేధిస్తున్న అధికారుల కొరత

  • రెవెన్యూ శాఖపై ఆధారపడాల్సిన పరిస్థితి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రూ.కోట్ల విలువైన ఆస్తులు.. లక్షల ఎకరాల భూమి.. నిత్య కల్యాణం.. పచ్చ తోరణంగా ఉండే దేవదాయ శాఖను ఉన్నతాధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ శాఖలో కమిషనర్‌తో పాటు అడిషనల్‌ కమిషనర్లు, జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పోస్టులు కీలకం. వీరి ద్వారానే పాలన నడుస్తుంది. దేవుడి ఆస్తులు, భూములకు రక్షణ కల్పించాలంటే ఈ పోస్టుల్లో రెగ్యులర్‌ అధికారులుండాలి. కమిషనర్‌ పోస్టులో ప్రభుత్వం అఖిల భారత సర్వీసు అధికారిని నియమిస్తుంది. మిగతా పోస్టులను డైరెక్ట్‌ నియామకం లేదా పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఉమ్మడి ఏపీలో రెగ్యులర్‌ ఉద్యోగులతో కళకళలాడిన దేవదాయ శాఖ.. రాష్ట్ర విభజన తర్వాత సీన్‌ మారిపోయింది. శాఖలో పై నుంచి కింది వరకూ ఇన్‌చార్జిలే ఉంటున్నారు. లేదంటే రెవెన్యూ అధికారులతో నింపేస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టులున్నప్పటికీ, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) పోస్టుల నియామకాల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేవదాయ శాఖలో 29 డిప్యూటీ కమిషనర్‌ పోస్టులున్నాయి. ఇందులో 23 పోస్టులను పదోన్నతులు, 6 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. అయితే గత ఏడాది 25 మందికి డీసీలుగా పదోన్నతి కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరికి అదనంగా పదోన్నతి ఇచ్చారు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేపట్టాల్సిన డీసీల పోస్టుల విషయంలో ప్రభుత్వాలు గత 29 ఏళ్లుగా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. చివరగా 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా రెండు డీసీ పోస్టులను భర్తీ చేశారు. ఆ ఇద్దరు కూడా ఇప్పుడు రిటైర్‌మెంట్‌ దగ్గరకు వచ్చేశారు. ప్రభుత్వం డీసీ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టి, నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.


ఆర్జేసీల కొరత..

దేవదాయ శాఖను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్ల (ఆర్జేసీ) కొరత కూడా ఉంది. డీసీ నియామకాలు, పదోన్నతులు లేకపోవడం వల్ల ఈ సమస్య వేధిస్తోంది. శాఖలో మొత్తం 11 ఆర్జేసీ పోస్టులున్నాయి. డీసీ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయడం, ఏసీలకు డీసీ పదోన్నతులు కల్పిస్తే, ఆ తర్వాత రెండేళ్లకు వాళ్లు ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. ప్రస్తుతం దేవదాయ శాఖలో నలుగురు మాత్రమే రెగ్యులర్‌ ఆర్జేసీలుగా ఉన్నారు. వీరిలో త్వరలో కొంత మంది పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఏడాదిలోగా నియామకాలు చేపడితే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7 పెద్ద ఆలయాలున్నాయి. సింహచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు రెవెన్యూ నుంచి వచ్చిన వారిని ఈవోలుగా నియమించారు. మరికొన్ని ఆర్జేసీ పోస్టుల భర్తీకి కూడా బయట శాఖల అధికారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ నుంచి వచ్చిన అధికారులను ఇన్‌చార్జి ఈవోలు, ఇన్‌చార్జి ఆర్జేసీలుగా నియమిస్తున్నారు. ఇన్‌చార్జిలను వేయడం వల్ల కొంత మంది భారీ ఎత్తును జోబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 20 , 2025 | 05:22 AM