Power Purchase Agreement: సెకీ-జగన్ డీల్‌పై న్యాయ విచారణ
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:49 AM
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 2021లో జాతీయ కరెంటు కొనుగోలు ఒప్పందంపై న్యాయ విచారణ జరపాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై భారీ భారాలు పడనున్నాయని, ముడుపుల వ్యవహారం కూడా ఉన్నట్లు ఆరోపణలు వెలువడాయి.
అదానీ ఒప్పందంతో జనంపై భారం.. బెజవాడ అఖిలపక్ష భేటీ డిమాండ్
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 2021లో అప్పటి జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న కరెంటు కొనుగోలు ఒప్పందంపై న్యాయవిచారణ జరపాలని పలువురు ప్రముఖులు డిమాండ్‌చేశారు. ఈ ఒప్పందంతో ప్రజలపై రూ.లక్షలాది కోట్ల భారంపడటమే కాకుండా, అమెరికా కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలయిందన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని విజయవాడలో గురువారం జరిగిన భేటీలో కోరారు. సెకీ ద్వారా అదానీతో జరిగిన ఒప్పందం కారణంగా రాష్ట్ర ప్రజలపై ఇరవై ఐదేళ్లపాటు మోయలేని భారం పడనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్. బాబూరావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు ఉత్పత్తి ధరలు తగ్గుతుండగా, సెకీతో గత ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.49కు ఒప్పందం చేసుకోవడం ఏమిటని మండిపడ్డారు. ఈ ఒప్పందం వల్ల విద్యుత్తు రంగం సంక్షోభంలో పడిందని రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘సెకీతో 7వేల మెగావాట్ల కరెంటు కొనుగోలు ఒప్పందాలను జగన్ చేసుకున్నారు. దీని వెనుక ముడుపుల వ్యవహారం నడిచింది. ఆధారాలు ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏసీబీ విచారణకు ఆదేశించాలి. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి తో విచారణ జరిపించాలి’’ అని పీవీ రమేశ్ డిమాండ్ చేశారు. సెకీ-అదానీ విద్యుత్తు ఒప్పందాల్లో రూ.1,750 కోట్ల ముడుపులు జగన్‌కు ముట్టాయంటూ అమెరికా ఫెడరల్ కోర్టులో చార్జిషీట్ దాఖలైందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. జగన్ హయాం సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. సెంటర్ ఫర్ లిబర్టీ అనే సంస్థ కన్వీనర్ నల్లమోదు చక్రవర్తి, సీపీఐ నేత రావులపల్లి రవీంద్రనాథ్, కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ, విద్యుత్‌రంగ నిపుణులు పాల్గొన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..