చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:17 AM
చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏపీ/తెలంగాణ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ సెమినార్ జరిగింది.

జనగణనలో కులగణన చేపట్టాలి: తెలుగు ఎంపీల డిమాండ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏపీ/తెలంగాణ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ సెమినార్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఈటల రాజేందర్, బీద మస్తాన్‌రావు, దగ్గుమళ్ల ప్రసాదరావు, పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, మల్లు రవి, అంబిక లక్ష్మీనారాయణ, పార్థసారథి, బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ‘త్వరలో చేపట్టే జనగణనలో కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. క్రిమిలేయర్‌ను తొలగించాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలి. రూ.2లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు.