నేరం.. బేరం..!
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:37 AM
ఖాఖీల డొంక కదులుతోంది. ఇద్దరు డీఎస్పీలు, సీఐలే కాకుండా అదే జాబితాలో మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది.
కదులుతున్న ఖాఖీల డొంక
పోలీసులు శాఖలో పెరిగిపోతున్న అవినీతి అక్రమాలు
కానిస్టేబుళ్లు, హోంగార్డులను అడ్డు పెట్టుకొని దోపిడీ
ఉత్సవాల బందోబస్తు పేరుతోనూ వసూళ్లు
పంచాయితీలకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు
నంద్యాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఖాఖీల డొంక కదులుతోంది. ఇద్దరు డీఎస్పీలు, సీఐలే కాకుండా అదే జాబితాలో మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారుల అవినీతి ఆరోపణలపై ఆంధ్రజ్యోతిలో ‘గాడి తప్పుతున్న.. ఖాఖీలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు పోలీసు శాఖలోనూ పెనుదుమారం రేపింది. ఈ క్రమంలోనే మరి కొంత మంది సీఐలు, ఎస్‌ఐలు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. వీరంతా నెలవారి మామూళ్లతో తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరైతే మరీ దారుణం. డబ్బులు తీసుకొని తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసు స్టేషన్లు పంచాయితీలకు అడ్డాగా మారాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
అవినీతి అక్రమాల్లో ఆ ఇద్దరు డీఎస్పీలు.. ఐదుగురు సీఐలే కాదు.. మారికొంత మంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ వసూళ్లతో పాటు మరికొందరు సీఐలు, ఎస్‌ఐలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డోన సబ్ డివిజన పరిధిలోని ఓ సీఐ కింద పని చేస్తున్న ముగ్గురు ఎస్‌ఐలు తమదైన శైలిలో మట్కా, పేకాట, నాటుసారా, బెల్ట్ షాపుల నుంచి పెద్దఎత్తున మామూళ్లు తీసుకుంటున్నారని సమాచారం. ఆయా ఎస్‌ఐలు కానిస్టేబుళ్లతోపాటు హోంగార్డులను అడ్డుగా పెట్టుకొని ఆయా వర్గాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. అయితే సదరు సీఐకి తెలిసి జరుగుతోందా.. లేక సదరు ఎస్‌ఐ స్థాయిలోనే అక్రమ వసూళ్లకు తెరలేపారా.. అనే అనుమానాలు లేకపోలేదు. ఇదే సబ్ డివిజన పరిధిలోని మరో సీఐ, ఓ ఎస్‌ఐకి ఓ పేరుమోసిన పీడీఎస్ వ్యాపారి నుంచి నెలవారి మామూళ్ల రూపంలో నెలకు సీఐకి రూ.2 లక్షలు, ఎస్‌ఐకి - రూ.లక్ష, ఆపై ఉన్నతాధికారికి రూ.లక్ష చొప్పున ముడుతున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. సదరు వ్యాపారిపై ఇప్పటికే 40 కేసులు నమోదయ్యాయని సమాచారం. వీటితోపాటు మట్కా, పేకాటరాయుుళ్ల నుంచి సదరు సీఐ, ఎస్‌ఐలకు నెలవారి మామూళ్లు వస్తున్నట్లు వినికిడి.
ఫ ఆత్మకూరు సబ్ డివిజనలోని ఓ దేవస్థానం పరిధిలోని ఓ ఎస్‌ఐ పోస్టు పది నెలల నుంచి ఖాళీగా ఉంది. దీంతో సదరు స్టేషనకు చెందిన సీఐనే అంత తానై వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా గుట్కా, సిగరెట్లు, బీడీలు యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా వ్యాపారుల దందాకు అడ్డులేకుండా సదరు సీఐకి నెలవారి మామూళ్లు పెద్దఎత్తున ముట్టచెబుతున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో సదరు స్టేషనకు ఎస్‌ఐని రాకుండా తెరవెనుక కథ నడిపించి అక్రమ వసూళ్లకు అడ్డు లేకుండా చేసుకున్నారని ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది.
ఫ మోనార్క్ డీఎస్పీపై మరిన్ని ఆరోపణలు...
ఇటీవల జరిగిన శ్రీశైలం బ్రహ్మోత్సవాల సమయంలో కూడా సదరు డీఎస్పీ అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారని తెలుస్తోంది. ప్రధానంగా సదరు డీఎస్పీ మంజూరు చేసిన సుమారు 400 వెహికల్ పాసుల విషయంలోనే సదరు డీఎస్పీ తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించారని సమాచారం. ఈ క్రమంలో అక్కడి సత్రాలు, దుకాణాలకు చెందిన వ్యాపారులతోపాటు తహసీల్దార్ సైతం పాసుల విషయంలో సదరు డీఎస్పీతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. సదరు డీఎస్పీ ఆఫీసుకు.. 12 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఓ మండలంలోని.. రెండు మద్యం దుకాణాల నుంచి మొదట రూ. 80 వేల చొప్పున నెలకు రూ.1.60 లక్షల సదరు డీఎస్పీ తీసుకునే వారని సమాచారం. అయితే ప్రస్తుతం సదరు దుకాణాల నుంచి నెలకు రూ.1.20 లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇవ్వకపోతే సంబంధిత ఎస్‌ఐని రంగప్రవేశం చేయించి పలు రకాలుగా బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. పీడీఎస్ బియ్యం వ్యాపారుల నుంచి నెలవారి మామూళ్లు తీసుకుంటున్నారని తెలిసింది. ఒక్కొక్కరితో నెలకు రూ.లక్ష చొప్పున సదరు డీఎస్పీ క్యాష్ చేసుకుంటున్నట్లు ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. ఇటీవల తాజాగా.. తమ సబ్ డివిజన పరిధిలోని రెండు మండలాలకు చెందిన బియ్యం వ్యాపారుల నుంచి రూ. 2 లక్షలు తీసుకున్న ట్లు సమాచారం. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా తమ సిబ్బందిపై సదరు డీఎస్పీ బెదిరింపులకు దిగుతున్నారని తెలిసింది.
ఫ ఆత్మకూరు సబ్ డివిజనలోని ఓ రూరల్ సర్కిల్ సీఐ స్టేషనకు వచ్చే ప్రతి కేసును పంచాయితీ చేసి క్యాష్ చేసుకుంటున్నారని తెలిసింది. రేషన బియ్యం తరలింపు వ్యాపారులతో కూడా నెలవారిగా రూ.లక్ష తీసుకుంటున్నారని సమాచారం. వీటితో పాటు సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో జరిగే జాతరలు, పోలీసుల బందోబస్తు పేరుతో సదరు సీఐ నాయకులు, ఆయా గ్రామాల పెద్దల నుంచి వసూలు చేసినట్లు తెలిసింది. ఇటీవల రెండు గ్రామాల వారి నుంచి సుమారు రూ.2 లక్షలు వసులు చేశారని సమాచారం. అదేవిధంగా అదే సర్కిల్ పరిధిలోని ఓ ఎస్‌ఐ సైతం ఇసుక ట్రాక్టర్ పట్టుబడిన ఒక్కొక్క ట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం.
ఫ ఇదే సబ్ డివిజన పరిధిలోని ఓ సీఐ..(గాడితప్పుతున్న ఖాఖీలు కథనంలోని ఓ సీఐ) ఓ మండల ఎస్‌ఐ ఇద్దరు కలిసి గత 15 రోజుల వ్యవధిలో పేకాటస్థావరాలపై దాడులు చేశారు. ఆయితే కేసు నమోదు చేయకుండా.. పట్టుబడిన రూ. 2.50 లక్షలతో పాటు అదనంగా రూ. 2.50 లక్షలు పేకాటరాయుళ్ల నుంచి తీసుకున్నారని తెలిసింది. అదే మండల ఎస్‌ఐ పరిధిలోని మరో ప్రాంతంలో దాడులు చేయగా రూ. 4 లక్షలు పట్టుబడితే రూ. 12 వేలు చూపించి బొక్కేశారని ఆశాఖ వర్గాల నుంచి సమాచారం. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆపై అధికారి సైతం వారిపై తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించి క్యాష్ చేసుకున్నారని తెలిసింది. డీఎస్పీని ఆసరాగా తీసుకుని సదరు సీఐ, ఎస్‌ఐ కూడా జేబులు నింపుకుంటుండటం పలు విమర్శలకు తావిస్తోంది.
ఫ నంద్యాల సబ్ డివిజనకు పడమర దిశగా ఉన్న పోలీసుస్టేషనలో పని చేస్తున్న ఓ సీఐ, ఎస్‌ఐపై పలు ఆరోపణలు ఊపందుకున్నాయి. సదరు మండల పరిధిలోని కంకర, మట్టి, క్వారీల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే టిప్పర్ల డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్ నుంచి రూ. 5 వేల చొప్పున.. మొత్తంగా 50 టిప్పర్లకు కలిపి నెలకు.. రూ. 2.50 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం అంతా కూడా సదరు సీఐ వద్ద పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌తో పాటు ఓ హోంగార్డు కనుసన్నుల్లో జరుగుతోందని సమాచారం. ఇక నాటుసారి విక్రేతల నుంచి సుమారు నెలకు.. రూ.1.50 లక్షలు, రెండు మద్యం దుకాణాల నుంచి నెలకు రూ. 2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. వీటితో పాటు బెల్ట్‌షాపుల రూపంలో ఒక్కొక్క షాపు నుంచి రూ.25 వేల చొప్పున సుమారు రూ.2 లక్షల వరకు జేబులు నింపుకుంటున్నారని సమాచారం. ఇంత పెద్దమొత్తంలో సంపాదన రావడంతో పోలీసు స్టేషన సేవలపై సదరు అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేయకుండా పంచాయితీలు చేసి ఇరువర్గాల నుంచి తవదైన శైలిలో సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. ఇదే క్రమంలో తమకు ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికార పార్టీకి చెందిన నాయకులను అడ్డుగా పెట్టుకున్నారనే ప్రచారం ఉంది. గత నెలలో తమ పరిధిలోని ఓ గ్రామంలో పట్టపగలే.. 5తులాలు బంగారు, రూ.50 వేలు నగదు చోరీకి గురైతే సదరు పోలీసులు ఇంత వరకు కేసు కూడా నమోదు చేయలేదని తెలిసింది. ఇదే తరహాలో మరో గ్రామంలో 8తులాల బంగారు, రూ.10 వేలు నగదు చోరీకి గురైతే ఇక్కడ కూడా కేసు నమోదు చేయలేదని తెలిసింది. మరీ దారుణం ఏమిటంటే.. సదరు స్టేషనకు పక్కనే ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి బుల్లెట్ వాహనం సైతం ఏడాది కింద చోరీకి గురైనా పోలీసుల కేసు నమోదు చేయడం లేదని బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. అక్రమ సంపాదన మోజులో పడి.. అసలు పోలీసు పని పక్కన పెట్టారనే విమర్శలు లేకపోలేదు. ఆయితే.. సదరు పరిధిలోని ఓ సోలార్ ప్లాంట్‌లో మాత్రం ఏ నిమిషం ఏం జరిగినా సదరు సీఐ, ఎస్‌ఐలు వెంటనే వాలిపోతారనే విమర్శలు అక్కడ లేకపోలేదు.
ఫ నంద్యాల సబ్ డివిజనకు 14 కిలోమీటర్ల దూరంలో ఓ మండల పోలీసుస్టేషనలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడు మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయా వ్యాపారులు మిగిలిన గ్రామాల్లో గుట్టుగా (బెల్ట్‌షాపు) మద్యం అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. తమ అక్రమ వ్యాపారాలకు అడ్డులేకుండా నెలవారి మామూళ్లతో పోలీసులకు సరిపెడుతున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది.
ఫ నంద్యాల సబ్ డివిజనకు కూత వేటు దూరంలో ఉన్న.. ఓ మండల పోలీసు స్టేషన పని చేస్తున్న ఓ ఎస్‌ఐ గత దసరా పండుగ నేపథ్యంలో ఆయుధ పూజ పేరుతో..సదరు మండల పరిధిలోని 20 గ్రామాలకు చెందిన నాయకులు, వ్యాపారుల నుంచి సుమారు రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. తమ పరిధిలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను చంపితే.. సదరు కేసును కూడా ఆత్మహత్యగా చిత్రీకరించి సుమారు రూ. 50 వేలు బొక్కేశాడని తెలిసింది. సదరు ఎస్‌ఐ రోడ్డు ప్రమాదాల కేసుల్లోను తమదైన శైలిలో చేతివాటం ప్రదర్శించారని సమాచారం. ఇక పేకాటరాయుళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఓ హోంగార్డును పెట్టుకుని మరీ నెలవారీ మామూళ్లకు పాల్పడుతున్నారని ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది.
ఫ ఆళ్లగడ్డ పరిధిలోని మరో సీఐ సైతం స్టేషనకు వచ్చే బాధితులతో పంచాయితీలు చేయడం.. తమదైన శైలిలో ఇరువర్గాల నుంచి క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇందుకు.. ఓ పంచాయతీ కార్యదర్శి తమ పరిధిలో జరిగిన ఓ అక్రమ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన సదరు సీఐ కేసు కట్టనీయకుండా వ్యవహరించారని తెలిసింది. దీంంతో చేసేదీ లేక సదరు పంచాయతీ కార్యదర్శి నేరుగా డీఎస్పీ, ఎస్పీకి కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఎఫ్‌ఐఆర్‌కు నమోదు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇలా సదరు సీఐ తమదైన శైలిలో ఓ ప్రైవేట్ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. కానిస్టేబుళ్లు, హోంగార్డులు సైతం బరితెగించి అక్రమ వసూళ్లకు బరితెగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.