Posani Krishna : దూషణలు, విద్వేషాలే పోసాని పని
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:35 AM
అసభ్య పదజాలంతో దూషించి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే సినీ నటుడు పోసాని కృష్ణమురళి పనిగా పెట్టుకున్నారని పోలీసుల..
సభ్య సమాజం ఆమోదించలేని పదజాలం వాడారు.. రక్షణ కల్పించొద్దు
హైకోర్టులో ఏఏజీ, పీపీ వాదనలు
సెక్షన్ 35(3) అనుగుణంగా నడుచుకోండి
పోలీసులకు న్యాయస్థానం ఆదేశం
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): అసభ్య పదజాలంతో దూషించి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే సినీ నటుడు పోసాని కృష్ణమురళి పనిగా పెట్టుకున్నారని పోలీసుల తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇలా చేయడం ఆయన అలవాటుగా మార్చుకున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను పిటిషనర్ అసభ్యకర పదజాలంలో దూషించారన్నారు. సభ్య సమాజం అంగీకరించలేని పదజాలంతో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారన్నారు. రాష్ట్రంలో 5 పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషనర్ కోరారని, ఇందులో కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలైందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విశాఖ జిల్లా పద్మనాభం, అనంతపురం, సూళ్లూరుపేట పోలీసులు పీటీ వారెంట్లు వేసినప్పటికీ అవి అమల్లోకి రాలేదన్నారు. పిటిషనర్‌కు రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్.. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలు చేసి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నందున ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర నాలుగు కేసులలో పీటీ వారెంట్లు అమలు కానందున పిటిషనర్ విషయంలో బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
పోసాని కస్టడీపై తీర్పు రిజర్వు
కర్నూలు/నరసరావుపేట లీగల్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పోసాని కృష్ణమురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కర్నూలు జిల్లా ఆదోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి తీర్పును రిజర్వ్ చేశారు. పోసానిపై నమోదైన కేసులో వివరాలు రాబట్టేందుకు మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఆదోని త్రీటౌన్ పోలీసులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న ఇన్‌చార్జి న్యాయాధికారి అపర్ణ తీర్పును రిజర్వు చేశారు. పోసాని తరఫున సీనియర్ న్యాయవాది జీవన్‌సింగ్ బెయిల్ పిటిషన్ వేయగా.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
పోసాని కృష్ణమురళిని కస్టడీకి కోరుతూ నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయాధికారి తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై గురువారం జరగాల్సిన వాదనలు ఆయన న్యాయవాదుల కోరిక మేరకు శుక్రవారం జరగనున్నాయి.