Political Rivalry : అరాచకాలకు కేరాఫ్..!
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:26 AM
వల్లభనేని వంశీ... ఆయన రూటే వేరు. పైకి మెత్తగా కనిపించినా లోపల అంతా కరకుదనమే. ఏ పని చేసినా చేతికి మట్టి అంటకుండా పకడ్బందీగా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కూడా ఆయనే చేయించారని, ఆనాటి దాడి మొత్తం వంశీ స్ర్కిప్ట్ ప్రకారమే జరిగిందన్న

వల్లభనేని వంశీ... ఆయన రూటే వేరు. పైకి మెత్తగా కనిపించినా లోపల అంతా కరకుదనమే. ఏ పని చేసినా చేతికి మట్టి అంటకుండా పకడ్బందీగా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కూడా ఆయనే చేయించారని, ఆనాటి దాడి మొత్తం వంశీ స్ర్కిప్ట్ ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ శాసనసభ్యుడిగా రెండుసార్లు గెలుపొందిన వంశీ.. ఆ పార్టీలో ఉన్నంతకాలం క్రమశిక్షణగానే ఉండేవారు. జగన్ పంచన చేరిన తర్వాత అరాచకాలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారారు.
వల్లభనేని వంశీ రూటే సపరేటు
జగన్‌తో స్నేహబంధం.. సొంత పార్టీకి నమ్మకద్రోహం
చేతికి మట్టి అంటకుండా పని ముగించడం ప్రత్యేకత
గన్నవరం నియోజకవర్గంలో అనుచరుల ఇష్టారాజ్యం
అక్రమ మైనింగ్‌తో కొండలకు అడ్డగోలుగా గుండు
పేదల భూములు స్వాహా .. రియల్ ప్రాజెక్టుల్లో వాటాలు
ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలు.. టీడీపీ నాయకులపై కేసులు
టీడీపీ ఆఫీసుపై దాడితో అరాచకం పతాక స్థాయికి
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజకీయ విరోధిగా భావించే వైఎస్ జగన్‌ను వల్లభనేని వంశీ కలవడం, నడిరోడ్డుపై ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా వంశీ ఉన్నారు. ఈ ఉదంతంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి రాజీనామాల వరకూ వెళ్లింది. దీంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయినా రాష్ట్ర విభజన తర్వాత వంశీకి టీడీపీ అధిష్ఠానం గన్నవరం సీటు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన వంశీ.. జగన్‌ను మాత్రం విమర్శించేవారు కాదు. వైసీపీ నేతలతో సత్సంబంధాలను కొనసాగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి వైసీపీ హవాలోనూ టీడీపీ శాసనసభ్యుడిగా గెలిచిన ఆయన పార్టీలో మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలను కాలదన్నుకున్నారు. వైసీపీకి చేరువైన తర్వాత మరింత రెచ్చిపోయారు.
గన్నవరంలో అరాచకాలు
గన్నవరంలో తన అనుయాయుల ద్వారా వంశీ సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. సూరంపల్లిలో గొట్టిపుల్ల పార్థసారథికి చెందిన 9 ఎకరాలను వంశీ అనుచరుడు బలవంతంగా రాయించుకున్నాడు. మండలంలో పలు గ్రామాల పరిధిలో అనేకమంది పేదలు, అసహాయుల నుంచి భూములు లాగేసుకోవడం మాయని మచ్చ. వంశీ అనుచరగణంగా ఉన్న ప్రధాన నాయకులంతా బినామీ పేర్లతో అక్రమ మైనింగ్ తవ్వకాలు అడ్డగోలుగా సాగించారు. నియోజకవర్గంలో కొండలను బోడిగుండుగా మార్చారు. పేదల ఇళ్ల పట్టాల పేరుతో కొండపావులూరులోని సర్వే నం.6లో మూడు కొండలను కరిగించేసి భారీగా బయటకు తరలించారు. జగనన్న ఇళ్ల పేరుతో వంశీ అనుచరులు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని, ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల పరిధిలో రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. పేదలకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన డీఫాం పట్టాలు, బీఫాం పట్టాలను వంశీ అనుయాయులు భారీగా కొనుగోలు చేసి మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా కొన్న భూముల్లో 30 మీటర్ల లోతున మట్టి తవ్వకాలు చేశారు. వంశీ అనుయాయులు రియల్టర్లకు కూడా చుక్కలు చూపించారు. నియోజకవర్గంలో వెంచర్లు, టౌన్‌షి్‌పలు ఏర్పాటుచేస్తే అందులో వీరికి వాటాలు ఇవ్వాల్సిందే. కొంతమందిని తరిమేసి చేజిక్కించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సెయింట్ జాన్స్ హైస్కూల్ దగ్గర జాడీల ఫ్యాక్టరీ స్థలాన్ని ఇలాగే నొక్కేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే వంశీ అనుచరుల సంకల్పసిద్ధి స్కామ్ ఒక్కటి ఒక ఎత్తు. ఈ స్కామ్‌లో పేద, మధ్యతరగతి వర్గాలతో పెట్టుబడులు పెట్టించి కోట్లాది రూపాయలను సమీకరించి బోర్డు తిప్పేశారు. చెరువులు, కాల్వల భూములను అక్రమంగా తనకు నచ్చినవారి పేరుతో క్రమబద్ధీకరించారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. తనకు నచ్చకపోతే మాత్రం వారి స్వాధీనంలో ఉన్న భూములను లాగేసేందుకు ఎదురు కేసులు పెట్టేవారు. వంశీ గ్యాంగ్ అరాచకాలపై గన్నవరం ప్రజలు ప్రశ్నించటమే కాకుండా న్యాయస్థానాల్లో పోరాటాలు సాగించారు. దీంతో వారిని మానసికంగా దెబ్బతీసేందుకు అధికారాన్ని ఉపయోగించారు. ఆక్రమణలు అంటూ కూల్చివేతలకు సైతం పాల్పడ్డారు. వంశీ అనుయాయుల అక్రమాలను ప్రజల తరఫున టీడీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే వారిపైనా తప్పుడు కేసులు పెట్టించారు. నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేసే ఉద్దేశంతో భయాందోళనలు సృష్టించటానికీ ఆయన వెనకాడలేదు. టీడీపీ కార్యాలయంపై దాడి ఇందులో భాగమే.
నా భర్తపై తప్పుడు కేసు పెట్టారు : వల్లభనేని పంకజశ్రీ
విజయవాడ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తనకు తెలియదని ఆయన సతీమణి పంకజశ్రీ అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీ్‌సస్టేషన్‌లో ఉన్న వంశీని కలుసుకునేందుకు న్యాయవాది తానికొండ చిరంజీవితో కలిసి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మాకు ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వలేదు. రిమాండ్‌కు తీసుకెళ్లినప్పుడు ఇస్తామని చెబుతున్నారు. అరెస్టు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం. ఎఫ్‌ఐఆర్ ఇస్తే మేం కోర్టుకు వెళతామన్న ఉద్దేశంతోనే ఈవిధంగా చేస్తున్నారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. వంశీ ఆరోగ్యం బాగోలేదు. ఆయన సమయానికి మందులు వేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం పెట్టారో లేదో తెలియడం లేదు. ఆయనకు ఏమైనా జరిగితే దానికి పోలీసులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. గన్నవరం టీడీపీ ఆఫీసు ఆపరేటరు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు ఎలాంటి ఆధారాలను చూపించడం లేదు’’ అని ఆమె ఆరోపించారు.
‘గన్నవరం’ కేసులో నిందితులకు షాక్
36 మందికి ముందస్తు బెయిల్ నిరాకరణ
పది మందికి రెగ్యులర్ బెయిల్ మంజూరు
ఒకరికి ముందస్తు బెయిల్... ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు
విజయవాడ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు తిరస్కరించింది. 36మంది నిందితులు దాఖలు చేసి ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయాధికారి హిమబిందు గురువారం తీర్పును వెలువరించారు. రిమాండ్‌లో ఉన్న వింతా ఆదినారాయణరెడ్డి, చిట్టిబొమ్మల కమలాకరరావు, గద్దె సుధీర్, పుట్టి శివకోటేశ్వరరావు, సంగుర్తి నాగదీప్, సంగుర్తి దుర్గారావు, కలపాల అభిరామ్‌లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అనారోగ్య కారణాల రీత్యా బయట ఉన్న మన్నే సుందరరావుకు ముందుస్తు బెయిల్ ఇచ్చారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక కోర్టులోనే ఈ అంశాన్ని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు కొద్దిరోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ముగ్గురికి రెగ్యులర్ బెయిల్‌ను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు మంజూరు చేసింది.