అమరావతికి మణిహారంగా ఓఆర్‌ఆర్ నిర్మాణం
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:29 AM
ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ చుట్టూ దేశంలోనే అతిపెద్ద అవుటర్ రింగురోడ్డును నిర్మించిన చంద్రబాబు.. విభజిత రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ అంతకన్నా పెద్ద అవుటర్‌రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 190 కిమీ పొడవు, 70 మీటర్ల వెడల్పుతో 6 వరసలుగా అమరావతికి మణిహారంగా నిర్మించనున్నారు. ఏడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఏడాదిలోపు పనులు ప్రారంభించటానికి చర్యలు తీసుకుం టున్నారు.
-190 కిమీ పొడవు.. 70 మీటర్ల వెడల్పు.. 6 వరసలు
-ఏడు నెలల్లో టెండర్లు.. ఏడాదిలోగా పనులు ప్రారంభం
-మొత్తం ఖర్చు కేంద్రమే భరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక
ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ చుట్టూ దేశంలోనే అతిపెద్ద అవుటర్ రింగురోడ్డును నిర్మించిన చంద్రబాబు.. విభజిత రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ అంతకన్నా పెద్ద అవుటర్‌రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 190 కిమీ పొడవు, 70 మీటర్ల వెడల్పుతో 6 వరసలుగా అమరావతికి మణిహారంగా నిర్మించనున్నారు. ఏడు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఏడాదిలోపు పనులు ప్రారంభించటానికి చర్యలు తీసుకుం టున్నారు.
(ఆంధ్రజ్యోతి, మంగళగిరి):
అవుటర్ రింగు రోడ్డు ఏర్పాటుతో ప్రపంచం, దేశంలో చాలా నగరాలు స్వల్ప వ్యవధిలోనే ఎంతగానో అభివృద్ధి చెందాయి. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతి నగర నిర్మాణ పనులతోపాటు ఏకకాలంలో అవుటర్‌రింగు రోడ్డును భారీస్థాయిలో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ చుట్టూ దేశంలోనే అతిపెద్ద అవుటర్‌రింగురోడ్డును నిర్మించిన చంద్రబాబు.. విభజిత రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ అంతకన్నా పెద్ద అవుటర్ రింగు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నయాపైసా ఖర్చు లేకుండా మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. సుమారు 190 కిలోమీటర్ల నిడివిలో ఏర్పాటయ్యే ఈ ఓఆర్‌ఆర్ 70 మీటర్ల వెడల్పుతో ఆరు వరసలతో దేశంలోనే అతిపెద్ద ఓఆర్‌ఆర్‌గా నిలవబోతుంది. అమరావతికి మణిహారంగా నిలిచే ఓఆర్‌ఆర్ ప్రాజెక్టును ఏడాదిలోగా పట్టాలెక్కించి ఆపై మూడేళ్లలోగా పూర్తి చేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంగా ఉంది. భూసేకరణ ప్రక్రియను సత్వరమే ప్రారంభించి వచ్చే ఏడు మాసాలలోగా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తుంది. ఆపై నాలుగైదు మాసాల్లోగా నిర్మాణ పనులను మొదలెట్టాలనిలక్ష్యంగా పెట్టుకుంది. ఓఆర్‌ఆర్ నిర్మాణానికి సుమారు 4,205 ఎకరాలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తుండగా, అందులో సుమారు 306 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీంతో 3,899 ఎకరాలను సేకరిస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
కృష్ణా డెల్టాకు మహర్దశ
అమరావతి ఓఆర్‌ఆర్‌తోపాటు మరో రెండు లింకురోడ్లను అనుసంధానంగా నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. చినకాకాని వద్ద ఎన్‌హెచ్-16లో కలుస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ను తూర్పుదిశగా సుమారు 17 కిలోమీటర్లు పొడిగిస్తూ ఆరులేన్ల రహదారిని నందివెలుగు వరకు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. ఈ కొత్త రహదారి విజయవాడ పశ్చిమబైపాస్-ఎన్‌హెచ్-16ని నందివెలుగు వద్ద అవుటర్‌రింగురోడ్డుతో అనుసంధానం చేస్తుంది. ఈ రహదారితో విజయవాడ తూర్పు బైపాస్ రహదారి అవసరం ఉండదని ఎన్‌హెచ్‌ఏఐ తేల్చిచెప్పింది. చినకాకాని వద్ద ఎన్‌హెచ్-16తో పశ్చిమ బైపాస్ కలిసే ప్రాంతంలో ప్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌ను సరికొత్తగా నిర్మిస్తారు. ఇక్కడ నుంచి మొదలయ్యే అనుసంధాన రహదారి నంబూరుకు ఉత్తరంగా పెనుమూలి, మంచికలపూడి, కంఠంరాజు కొండూరు, దుగ్గిరాల, చింతలపూడికి ఆవలివైపుగా వెళ్లి నందివెలుగు వద్ద ఓఆర్‌ఆర్‌తో కలుస్తుంది. ఈ రహదారితో పాటు మంగళగిరి-తెనాలి-నారా కోడూరు రూటులో ప్రస్తుతం ఉన్న డబుల్‌లేన్ రోడ్డును నాలుగులేన్ల రహదారిగా అభివృద్ధి చేయబోతున్నట్టు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇక రెండో లింకురోడ్డు విషయానికొస్తే.. బుడంపాడు వద్ద గుంటూరు హైవే జంక్షన్ నుంచి నారాకోడూరు వరకు సుమారు ఆరున్నర కిలోమీటర్ల పొడవున ఆరులేన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్‌తో లింకు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మూడు అలైన్‌మెంట్లను పరిశీలిస్తున్నారు.
మూడు దశలు.. 11 ప్యాకేజీలుగా..
ఓఆర్‌ఆర్‌ను 11 ప్యాకేజీలుగా విభజించి మూడు దశలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్ల్లా కంచికచర్ల నుంచి గుంటూరు జిల్లా పొత్తూరు వరకు 63 కిలోమీటర్ల పొడవునా మొదటి దశలో పనులను చేపట్టబోతున్నారు. ఇందులో కృష్ణానదిపై పల్నాడు జిల్లా బలుసుపాడు- కృష్ణాజిల్లా మున్నలూరు మధ్య ఓఆర్‌ఆర్‌కు పశ్చిమ దిశగా 3.15 కి.మీల పొడవున కొత్త వంతెనను నిర్మిస్తారు. రెండో దశలో గుంటూరు జిల్లా పొత్తూరు నుంచి కృష్ణాజిల్లా పొట్టిపాడు వరకు మరో 65 కిలోమీటర్ల నిడివిలో నిర్మాణ పనులను చేపడతారు. ఈ దశలో కృష్ణానదిపై ఓఆర్‌ఆర్‌కు తూర్పుదిశలో గుంటూరు జిల్లా మున్నంగి- కృష్ణాజిల్లా వల్లూరుపాలెం మధ్య 4.8 కిలోమీటర్ల పొడవునా వంతెనను నిర్మిస్తారు. మూడో దశలో పొట్టిపాడు నుంచి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వరకు 62 కిలోమీటర్ల పనులను చేపట్టి ఓఆర్‌ఆర్‌ను పూర్తి చేస్తారు. మూడోదశలోనే జికొండూరు సమీపంలో 4.4 కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మాణం జరగనున్నది.