Savings Book Purchase: పొదుపు పుస్తకాల కొనుగోళ్లలో అయోమయం
ABN , Publish Date - May 24 , 2025 | 04:46 AM
డ్వాక్రా పొదుపు సంఘాల పుస్తకాల కొనుగోళ్లపై సర్వత్రా అయోమయం నెలకొంది. ఒక అధికారి ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే కొనుగోలు చేసిన పుస్తకాలు చెల్లవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కొన్నవి చెల్లవంటూ ఓ అధికారి ఆదేశాలు
పుస్తకాలు ఎవరికి వారు కొనుక్కోవచ్చని సెర్ప్ ఐబీ వెల్లడి
ఒంగోలు, కార్పొరేషన్, మే 23(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా పొదుపు సంఘాల తీర్మానాల పుస్తకాల కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విజయవాడ కేంద్రంగా నడిచే సెర్ప్ విభాగంలోని ఓ సంస్థాగత నిర్మాణ(ఐబీ) అధికారి ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల్లో అయోమయానికి కారణమయ్యాయి. మ్యాక్స్ యాక్ట్ 95 ప్రకారం పొదుపు పుస్తకాలు, తీర్మానంలో చర్చించిన అంశాల నమోదు పుస్తకాలు ఇతరత్రా కొనుగోళ్లపై సంఘాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అయితే ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆదేశాలతో డ్వాక్రా సంఘాలు, జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలపై అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కొత్త సంవత్సరంలో పుస్తకాలు కొనుగోలు చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 73 లక్షలకుపైగా పొదుపు సంఘాలు ఉన్నాయి. సగానికిపైగా సంఘాలు ఇప్పటికే పుస్తకాలు కొనేసాయి. అయితే ఆ పుస్తకాలు చెల్లవని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాతో తామే పుస్తకాలు అందిస్తామని, ఇప్పటికే కొనుగోలు చేసినవి తీసివేయాలని ఇటీవల విజయవాడలోని సెర్ప్ విభాగ ఐబీ అధికారి ఆదేశించినట్లు సమాచారం. ఆయా జిల్లాలలో డీఆర్‌డీఏలో పనిచేసే ఐబీలు సంఘాలపై ఒత్తిడి తీసుకురావడంతో వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే, డ్వాకా సంఘాలు సమావేశ తీర్మానం పుస్తకాలు ఎవరికి వారు కొనుగోలు చేసుకోవచ్చని సెర్ఫ్ ఐబీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అయితే త్వరలోనే మొబైల్ యాప్ ద్వారా ఈ-కీపింగ్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే సెర్ప్ ఉద్దేశమని, విశాఖపట్నం నుంచి పుస్తకాల సరఫరాపై నకిలీ ఆర్డరు కాపీ వచ్చిందని, దానికీ, సెర్ప్‌కి ఎలాంటి సంబంధమూ లేదని శ్రీనివాసరావు వెల్లడించారు.