Share News

CM Chandrababu Naidu: ప్రజల నమ్మకాన్ని మేమే కాదు.. మీరూ నిలబెట్టాలి..

ABN , Publish Date - Sep 16 , 2025 | 04:48 AM

ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయాలన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి...

CM Chandrababu Naidu: ప్రజల నమ్మకాన్ని మేమే కాదు.. మీరూ నిలబెట్టాలి..

  • మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి

  • క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి

  • కొత్త కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాలి

  • విజన్‌ డాక్యుమెంట్‌ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌

  • మంత్రులు ప్రగతిలో భాగస్వాములు కావాలి

  • శాఖలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి

  • జిల్లాల ప్రగతి చైర్మన్లుగా వారిని నియమిస్తా

  • నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియామకం

  • సంక్షేమం దానం కాదు.. సాధికారతకు మార్గం

  • చెప్పినట్లుగా సూపర్‌సిక్స్‌ సక్సెస్‌ చేశాం

  • ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సమతూకంగా అభివృద్ధి, సంక్షేమం

  • యువత ఉపాధి కోసం జాబ్‌మేళాలు

  • త్వరలో శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు

  • ఆటో డ్రైవర్లకు అక్టోబరు 1న 15 వేలు

  • తొలి రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం స్పష్టీకరణ

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయాలన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లకు శుభాభినందనలు తెలిపారు. వారు తమను తాము నిరూపించుకోవలసిన అవసరముందన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సును ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగాను, తర్వాత వివిధ రంగాలపై సమీక్షల్లోనూ మాట్లాడారు. అందరినీ సాధికారత దిశగా నడిపిస్తామని చెప్పిన హామీని జనం విశ్వసించి.. ఎన్‌డీఏకి 94 శాతం స్ట్రైక్‌ రేటుతో 164 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారని తెలిపారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని కూడా చెప్పామన్నారు. చెప్పినట్లుగా సూపర్‌సిక్స్‌ను సక్సెస్‌ చేశామని.. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజల విశ్వాసం నిలబెట్టే బాధ్యత తమతో పాటు కలెక్టర్లది కూడానని తెలిపారు. శాఖాధిపతులు.. జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా ప్రగతిలో భాగప్వాములు కావాలన్నారు. వారిని త్వరలోనే జిల్లా ప్రగతి చైర్మన్లుగా నియమిస్తామని.. నియోజకవర్గ ప్రగతి అధ్యక్షులుగా శాసనసభ్యులను నియమిస్తామని చెప్పారు. శాఖల వారీగా ర్యాంకులు ప్రకటించామని.. అది శాఖాధిపతులకు మాత్రమే వర్తించదని.. ఆ శాఖల మంత్రులకూ వర్తిస్తుందని.. శాఖలపై వారు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పథకాల లబ్ధిదారులకు సాయం అందడంలో తలెత్తిన చిన్న చిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


విజన్‌ డాక్యుమెంటే గీత, ఖురాన్‌, బైబిల్‌..

కేంద్రం 2047 వికసిత్‌ భారత్‌ ప్రణాళిక తయారుచేస్తే.. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్‌ రూపొందించింది. ఇది అధికారులందరికీ భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ కావాలి. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌-డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5 శాతం ఉంది. 2047నాటికి 15 శాతం సాధించే దిశగా కృషిచేస్తున్నాం. ఈ ఏడాది తలసరి ఆదాయాన్ని రూ.3.47 లక్షలకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. 2029 నాటికి రూ.29 లక్షల జీఎ్‌సడీపీ లక్ష్యం. అప్పటికి రూ.4.67 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా మనం పనిచేయాలి.

అతి పెద్ద సంక్షేమ పథకం..

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్లు. 64 లక్షల మందికి ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఏడుగురు పిల్లలున్న తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేశాం. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్తున్నారు. ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు. కానీ స్త్రీశక్తి పథకం సఫలమైంది. పథకం అమలు తర్వాత ఆర్టీసీలో 90 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఽఖీభవ ద్వారా మొదటి విడతలో రూ.7 వేల చొప్పున ఇచ్చాం. 3 విడతల్లో రూ.20 వేలు అందిస్తాం. ఆటో డ్రైవర్లకు అక్టోబరు 1న రూ.15 వేలు ఇస్తాం. శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు త్వరలోనే జారీ చేస్తాం. కేజీ టు పీజీ పాఠ్యాంశాల్లో సంస్కరణలు తెస్తున్నాం. నిర్మాణ రంగంలో వర్కర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాం. జీవో 217 రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో భాగంగా వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తున్నాం. గ్రీన్‌ట్యాక్స్‌ను రద్దు చేశాం. డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం. అర్చకులకు గౌరవవేతనం రూ.15 వేలకు పెంచాం. వేద విద్యార్థులకు రూ.3 వేలు ఇస్తున్నాం. ఇమామ్‌, మౌజన్లకు కూడా గౌరవవేతనం ఇస్తున్నాం. విజయవాడలో హజ్‌హౌస్‌ త్వరలోనే పూర్తవుతుంది. హజ్‌ యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాం. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. రజకులకు దోబీఘాట్లు, షెడ్లు, ఇస్త్రీ చేయడానికి ఆధునిక మౌలిక వసతులు కల్పించాలి. చేనేతలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నాం. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద ఎంతైనా రుణం తీసుకునే అవకాశముంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్రం భరించేలా ఆలోచన చేయాలి. వచ్చే నాలుగేళ్లలో అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం ఇవ్వాలి. సంక్షేమ హాస్టళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలి. అవసరమైతే రాత్రిపూట నిద్రచేసి పరిస్థితులు మార్చాలి.డ్వాక్రా సంఘాల టర్నోవర్‌ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలి మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి. రాష్ట్రానికి కోటి 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. వాటికి రుణం ఇస్తే డబ్బులు బ్యాంకుల్లో ఉన్నట్లే! డ్వాకా సంఘాల టర్నోవర్‌ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నాను. విజయవంతంగా డ్వాక్రాను నిర్వహిస్తున్న సెర్ప్‌ అధికారులను అభినందిస్తున్నాను.


సమర్థులను నియమించాం..

సీఎస్‌, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశాం. అన్ని కోణాల్లో నుంచీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక, క్యాబినెట్‌ కూర్పు చేశాం. అదే తరహాలో సమర్థులైన వారిని కలెక్టర్లుగా నియమించాం. వారు కూడా దీనికి అనుగుణంగా పనిచేయాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. పనితీరు చక్కగా ఉన్న వాళ్లను నేనెప్పుడూ మార్చలేదు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్త స్థాయే కొలమానం. సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో శాంతి భద్రతలకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. కొంత మంది ఐఏఎ్‌సలలో నేను సీఎం అయిన సంవత్సరంలో పుట్టినవారు కూడా ఉన్నారు. కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్‌ సృష్టించాలని కోరుకుంటున్నాం.

పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఆర్థిక కార్యకలాపాలు

పోర్టులు, విమానాశ్రయాల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలి. విమానాశ్రయాలకు సమీపంలో పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యాపారాల నిర్వహణ జరగాల్సిందే. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులు కూడా వ్యాపార భాగస్వామ్య విధానంలోకి వెళ్లేలా అధికారులు చర్యలు చేపట్టాలి. భూములు ఉన్నవారితో ఒప్పందాలు చేసుకుని.. అపార్ట్‌మెంట్లను నిర్మించి ఫ్లాట్లలో 40 శాతం వాటా ఇవ్వాలి. విమానాశ్రయాల సమీపంలోనూ ఈ తరహా వ్యాపార కార్యకలాపాలు సాగాలి. ప్రతి ఇంటి నుంచీ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఇందులో భాగంగా లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తాం. జీఎస్టీ రెండో దశ సంస్కరణల ఫలాలు ప్రజలందరికీ అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. దీనిపై నెలపాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

సామాజిక అసమానతలతోనే ఆర్థిక అసమానతలు

సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు. వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గమది. సమాజంలో సామాజిక అసమానతల కారణంగానే ఆర్థిక అసమానతలు వచ్చాయు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ వారి చేతుల్లో భూముల్లేవు. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా బీసీలు తమ కులవృత్తులు లేక ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వీటన్నింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ అసమానతలు తొలగించేలా ప్రణాళికలు రూపొందించాం. పీ-4 లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చాం. వాటిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. తొలి సంతకంగా చేసిన మెగా డీఎస్సీ కింద యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయి. జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్‌మేళాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఇప్పటికే పోలీసు శాఖలో 6 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.


మొదటి సంవత్సర పరీక్షలు అయిపోయాయ్‌!

రాష్ట్రంలో కూటమి పాలనలో తొలి సంవత్సర పరీక్షలు పూర్తయ్యాయి. ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చింది. ప్రత్యేక దృష్టి పనిచేయకపోతే ఫలితాలు రావు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్‌ వర్క్‌ చేయాల్సిందే. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందిస్తున్నాం. ఏఐ, డేటా లేక్‌ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. పథకాలు, కార్యక్రమాల అమలుకు ఆర్టీజీఎస్‌ సేవలు వాడుకోవాలి. విజన్‌ రూపొందించుకుని దానికి నిధులివ్వకపోతే ఇబ్బందులు వస్తాయి.

పీ4, డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్‌ చేయండి

పీ4 మరో గేమ్‌ చేంజర్‌. స్వచ్ఛందంగానే ముందుకు రావాలి. ఎవరినీ బలవంతం చేయాల్సిన అవసరం లేదు. పీ4, డ్వాక్రా, మెప్మాను ఇంటిగ్రేట్‌ చేసి ముందుకెళ్లాలి. పరిశ్రమల స్థాపనలో ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీపడుతోంది. ఉత్తరాంధ్రలో ఆర్సెలార్‌ మిట్టల్‌, టీసీఎస్‌, గూగుల్‌ వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు.. శ్రీసిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు వస్తున్నాయి.

సమర్థ నీటి నిర్వహణ..

గతంలో గడ్డు పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ.. ఇప్పుడు కోనసీమతో సమానంగా ఉంది. రాయలసీమలో డ్రిప్‌ ఇరిగేషన్‌ లాంటి విధానాలతో సమర్థ నీటి నిర్వహణ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పట్టిసీమతో కృష్ణా నీటిని పొదుపు చేసి శ్రీశైలంద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణను వందరోజుల్లో పూర్తి చేసి కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లాం. సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపాం. సూక్ష్మ సేద్యంలో ఏపీ నంబర్‌ వన్‌గా ఉంది. రాయలసీమ ఉద్యాన పంటల్లో అగ్రస్థానంలో ఉంది. కోనసీమ కన్నా అనంతపురం జిల్లా తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. ఆయిల్‌పామ్‌ ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్‌ ఛేంజర్‌ అయింది.

Updated Date - Sep 16 , 2025 | 08:47 AM