Share News

Welfare Schemes: సంక్షేమానికి ఓ కేలెండర్‌

ABN , Publish Date - May 21 , 2025 | 03:09 AM

వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల వార్షిక కేలెండర్‌ త్వరితగతిన విడుదల చేయాలని ఆదేశించారు. ‘తల్లికి వందనం’ నిధులను ఒకే విడతలో మాతృభాషా ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు.

Welfare Schemes: సంక్షేమానికి ఓ కేలెండర్‌

ఏ నెలలో ఏ పథకమో చెబుదాం: సీఎం

అప్పుడు మన విశ్వసనీయత పెరుగుతుంది

ఒకే విడతలో ‘తల్లికి వందనం’ జమ చేస్తాం

ఆర్థికంగా ఇబ్బందులున్నా తగ్గేది లేదు

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై

మంత్రులు వినూత్నంగా ఆలోచించాలి: బాబు

రెవెన్యూ సమస్యలపై 3 నెలలకోసారి నివేదిక

అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్షిక కేలెండర్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత మరింత పెరుగుతుందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ‘తల్లికి వందనం’ కింద ఒకే విడతలో తల్లుల ఖాతాలో నిధులు జమ చేసి తీరతామని స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మద్యం స్కాం, తల్లికి వందనం, ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ప్రస్తుత ఆర్థిక దుస్థితిలో ఒకేసారి రూ.10 వేల కోట్లుపైచిలుకు నిధులివ్వడం అంటే ఖజానాపై భారీగా భారం పడుతుందని..

gtk.jpg

తల్లికి వందనం కింద ఇచ్చే మొత్తాన్ని రెండు విడతలుగా ఇస్తే బాగుంటుందని కొందరు మంత్రులు సూచించారు. చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మరో ఆలోచనకు తావే లేదన్నారు.


ఒకే విడతలో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పాఠశాలలు పునఃప్రారంభించేలోగా ఈ నిధులిచ్చి తీరాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులు వినూత్నంగా ఆలోచించాలని, ఈ దిశగా మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. పింఛన్ల పంపిణీ సమయంలోను, ఇటీవల మత్స్యకారులకు భృతి అందజేసే సమయంలోనూ నేరుగా తాను లబ్ధిదారులను కలిసి వారితో సంభాషించానని.. అదే విధంగా మంత్రులూ జనంలోకి వెళ్లాలన్నారు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఇప్పటికే ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామని.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఉచిత సిలిండర్లకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాయో లేదో ఎంత మంది మంత్రులు తెలుసుకున్నారని సీఎం ప్రశ్నించారు. మంత్రులెవ్వరూ సమాధానం ఇవ్వకపోవడంతో.. ప్రతి ఒక్కరూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి డబ్బులు అందిందీ లేనిదీ తెలుసుకుని.. వారు ఉచితంగా అందుకున్న సిలిండర్‌పై టీ పెట్టించుకుని తాగి రావాలని ఆయన సూచించారు. మిగిలిన పథకాల విషయంలోనూ వినూత్నంగా ఆలోచించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

శ్రీశైలం ఆలయ విస్తరణపై దృష్టి

శ్రీశైలం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆలయ విస్తరణకు అటవీశాఖపరంగా ఉన్న అడ్డంకులను తొలిగించడానికి.. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సం యుక్తంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. సంవత్సరానికి రూ.250 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. టెంపుల్‌ టూరిజంలో భాగంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.


5 లక్షల మందితో యోగా దినోత్సవం

యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తం కావాలని మం త్రులకు సీఎం సూచించారు. 5 లక్షల మందితో దీనిని నిర్వహించాలని తెలిపారు. అలాగే, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇకపై రెవెన్యూ సమస్యలు, పరిష్కారం, పురోగతిపై ప్రతి 3 నెలలకోసారి తనకే నేరుగా నివేదిక ఇవ్వాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ఆదేశించారు.

లిక్కర్‌ స్కాం వార్తలపై స్పందించొద్దు

మద్యం స్కాంపై మంత్రులెవరూ మాట్లాడొద్దని సీఎం ఆదేశించారు. ఈ కుంభకోణం కేసులో సిట్‌ విచారణకు సంబంధించి గానీ, పత్రికల్లో వచ్చే కథనాలపై గానీ మాట్లాడవద్దని సీఎం ఈ సందర్భంగా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సిట్‌ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందన్నారు. ఈ సమయంలో మంత్రులు దానిపై మాట్లాడితే తప్పుడు సంకేతాలు పంపుతుందని, విపక్షంపై కక్ష సాధింపు చర్యగా ప్రజల్లోకి వెళ్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండాల్సిన పని లేదని స్పష్టం చేశారు. తప్పనిసరైతే మంత్రులు కాకుండా.. పార్టీ నేతలతో మద్యం స్కాంపై మాట్లాడించాలని సీఎం సూచించారు.

రాజకీయంగా వెనుకబడకూడదు!

రాజకీయంగా కూటమి పార్టీలు వెనుకబడ్డాయనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లకుండా మంత్రులు జాగ్రత్త వహించాలని సీఎం స్పష్టం చేశారు. వైజాగ్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహణలో సరిగా వ్యవహరించలేకపోయామన్నారు. పలు చోట్ల కోరం లేక స్థానిక సంస్థల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు వాయిదా పడిన ఘటనలు నేతల ప్రణాళిక, సమన్వయలోపాన్ని చాటుతున్నాయన్నారు. ప్రధానితో లోకేశ్‌ భేటీకి మీడియా, రాజకీయ పక్షాల్లో విస్తృత ప్రచారం లభించిందని మంత్రి జనార్దన్‌రెడ్డి ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 06:00 AM