CM Chandrababu Naidu: కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడండి
ABN , Publish Date - Oct 04 , 2025 | 04:53 AM
అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు....
తప్పొప్పులు వారికి తెలియజేయండి
అయినా వినకుంటే నాకు చెప్పండి
అసెంబ్లీలో కొందరి తీరు బాలేదు
సభలో ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన బాధ్యత మీదే
ఇన్‌చార్జి మంత్రులకు సీఎం స్పష్టీకరణ
శాఖాపరంగా విమర్శలకు తావివ్వొద్దు
విమర్శలొస్తే వెంటనే స్పందించండి
మంత్రులకు చంద్రబాబు నిర్దేశం
అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. క్యాబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్‌చార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ‘‘ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలి. వారు చేస్తున్న తప్పొప్పులను వారికి తెలియజేసి సరిచేసుకోవాలని కోరాలి. అప్పటికీ వినకుంటే నా దృష్టిలో పెట్టాలి. ఇదంతా ఇన్‌చార్జి మంత్రులే బాధ్యతగా చేయాలి’’ అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో, మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి మంత్రులను కోరారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారు. ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ, రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గని ర్దేశం చేయాలని సూచించారు. శాఖాపరంగా ఎలాంటి విమర్శలకూ అవకాశం ఇవ్వకుండా మంత్రులు పనిచేయాలని, ఒకవేళ ఏదైనా విమర్శ వచ్చినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపినా అందరం నష్టపోతామని చంద్రబాబు అన్నారు.
నీటిపారుదల శాఖ పనితీరు భేష్
చరిత్రలో తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్లలో వాటి సామర్థ్యంలో 93 శాతం మేర నీటిని నింపగలిగామని సీఎం మంత్రులతో అన్నారు. విజన్ 2047లో భాగంగా పెట్టుకున్న 10 ప్రధాన సూత్రాల్లో నీటిభద్రత ఒకటని, ఆ దిశగా అడుగులు వేయడంలో ఇది కీలక పరిణామమన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ఈ సందర్భంగా సీఎం అభినందనలు తెలిపారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటి మోడ్ (సీహెచ్‌ఏఎం) బాగుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ శాఖ పరిధిలో చేస్తున్న అభివృద్ధి పనులన్నింటినీ ఇదే విధానంలో చేస్తున్నారని, ఫలితంగా శాఖపై ఆర్థికభారం తగ్గిందని తెలిపారు. అదే సమయంలో కేంద్రం నుంచి, ఇతర ఏజెన్సీల నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విధానాన్ని తమ తమ శాఖల్లోని అభివృద్ధి పనులకు అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో కనెక్టివిటీ, పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పూర్వోదయ పథకంలో ఏపీని కూడా చేర్చారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, విద్యుత్తు ఉత్పత్తి పెంపునకు పూర్వోదయ పథకం దోహదపడుతుందని, హార్టీకల్చర్, ఆక్వాకల్చర్ వంటి రంగాలకు ఊపు తెస్తుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రానున్న రెండుమూడేళ్లలో సుమారు రూ.65 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం మంత్రులకు వివరించారు. గోకులాల ఏర్పాటును వేగవంతం చేయాలని, మంత్రులందరూ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీలైనన్ని ఎక్కువ గోకులాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. వీటి ద్వారా స్థానికులకు ఆదాయం సమకూరేలా చూడాలని కోరారు. కడపలో జిందాల్ ఉక్కు కర్మాగారాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని మంత్రులకు సీఎం తెలిపారు.
విజయవాడ ఉత్సవ్..భేష్
ప్రధాన నగరాల్లోనూ నిర్వహించండి : సీఎం
విజయవాడ ఉత్సవ్‌పై సీఎం ప్రశంసలు కురిపించారు. ఇలాంటి స్థానిక ఉత్సవాలు రాష్ట్రమంతా నిర్వహించడం వల్ల అన్నివర్గాలకూ ప్రయోజనం కలుగుతుందని, ఇలాంటి ఉత్సవాల నిర్వహణపై మంత్రులు దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నెలకో ఉత్సవాన్ని నిర్వహించే విషయాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.