Share News

Jagan: మురళీ నాయక్‌కు రుణపడి ఉంటాం

ABN , Publish Date - May 14 , 2025 | 05:24 AM

మురళీ నాయక్‌ వీరమరణం పొందిన కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్‌ ఆయన్ను స్ఫూర్తిదాయకుడిగా మన్నించి, కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు, పార్టీ శ్రేణుల నినాదాలు, బందోబస్తు ఏర్పాటుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Jagan:  మురళీ నాయక్‌కు రుణపడి ఉంటాం

కళ్లితండాలో వీరజవాన్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ

హిందూపురం, మే 13(ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్‌ మురళీ నాయక్‌కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వీరమరణం పొందిన మురళీ నాయక్‌ కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాకు బెంగళూరు నుంచి జగన్‌ రోడ్డు మార్గాన వచ్చారు. మురళీ నాయక్‌ ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు శ్రీరామనాయక్‌, జ్యోతిబాయిని ఓదార్చారు. వారి ఇంట్లో సుమారు 25నిమిషాల పాటు గడిపి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. వీరజవాన్‌ మురళీ నాయక్‌ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాన్ని మరిచిపోలేమని చెప్పారు. అమరులైన జవాన్‌ కుటుంబానికి రూ.50లక్షలు ఇచ్చే సంప్రదాయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ తరఫున వారి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయాన్ని జగన్‌ ప్రకటించారు.


500 మందితో బందోబస్తు

కళ్లి తండాకు జగన్‌ మరికొన్ని నిమిషాల్లో చేరుకుంటారనగా, వైసీపీ శ్రేణులకు డీఎస్పీ, సీఐలు పలు సూచనలు చేశారు. వీఐపీలు వచ్చినప్పుడు నినాదాలు చేయకూడదని, ‘జై భారత్‌, జై జవాన్‌, జైహింద్‌’ అని మాత్రమే అనాలని సూచించారు. అయినా వైసీపీ శ్రేణులు ‘జై జగన్‌’ నినాదాలు చేయడం విమర్శలకు తావిచ్చింది. కాగా, కళ్లి తండాకు జగన్‌ వచ్చిన సందర్భంగా 500మందికిపైగా పోలీసులు తండాను తమ అధీనంలోకి తీసుకున్నారు. 200మీటర్ల దూరంలోనే ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికులు ఎవరూ ఇళ్ల నుంచి బయటకి రాకూడదని సూచించారు. రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సహా పలువురు మంత్రులు వచ్చినప్పుడు కూడా ఇంత బందోబస్తు ఏర్పాటు చేయలేదు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినంత స్థాయిలో ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై విమర్శలొస్తున్నాయి.


మీడియా కంట పడకుండా మిథున్‌రెడ్డి పరామర్శ

మురళీ నాయక్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డి, మీడియా కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో... తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఎక్కడ అరెస్టు చేస్తారోనని మిథున్‌రెడ్డి ఆందోళన చెందినట్లు ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.


వైసీపీ శ్రేణుల ‘సీఎం జగన్‌’ నినాదాలు

కళ్లి తండాకు జగన్‌ చేరుకున్నప్పటి నుంచి వెనుదిరిగేవరకు మురళీ నాయక్‌ ఇంటి బయటున్న వైసీపీ శ్రేణులు ‘సీఎం.. సీఎం.. జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. వీరజవాన్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఈలలు, కేకలు వేస్తూ నినాదాలు చేస్తున్నా వారించే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర సరిహద్దు నుంచి కళ్లి తండాకు చేరుకునేవరకూ జగన్‌ ఐదారుచోట్ల వాహనాలను ఆపి, జనానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇది వీరజవాన్‌ కుటుంబాన్ని పరామర్శించినట్లు లేదని, రాజకీయ పర్యటనలా ఉందని పలువురు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:24 AM