Godavari District: అనుకూలించని వాతావరణం
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:01 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉండవల్లి నివాసం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం బయలుదేరారు.
సీఎం హెలికాప్టర్‌కు విజిబిలిటీ సమస్య
ఉండవల్లి నుంచి తూర్పుగోదావరికి బయలుదేరిన చంద్రబాబు
గన్నవరం ఎయిర్‌పోర్టు దాటాక దట్టమైన మేఘాలు
ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లిన సీఎం
విజయవాడ/రాజమహేంద్రవరం/కొవ్వూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉండవల్లి నివాసం నుంచి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సీఎం బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం దాటిన తర్వాత దట్టమైన మేఘాల కారణంగా పైలెట్ గన్నవరంలోని విమానాశ్రయ ఏటీసీకి సమాచారమిచ్చి, అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోసం పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరడంతో కొద్దిసేపు అధికారులు కంగారు పడ్డారు. సేఫ్ ల్యాండింగ్ జరగటంతో ఊపిరి పీల్చుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం కొద్దిసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరానికి వెళ్లారు.
ప్రజల కోసం వెళ్లాల్సిందే: చంద్రబాబు
సీఎం చంద్రబాబు ప్రజావేదిక, పింఛను పంపిణీ, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి మంగళవారం ఉదయం 11 గంటలకు చేరుకోవాల్సి ఉంది. హెలికాప్టర్‌కు విజిబిలిటీ సమస్యతో ఆయన గన్నవరంలో దిగారు. ‘మలకపల్లిలో ప్రజలు నా కోసం ఎదురు చూస్తారు. వెళ్లాల్సిందే..’ అని చంద్రబాబు ఆదేశించడంతో అప్పటికప్పుడు అధికారులు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారని తెలిసింది. దీనిలో సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 1.15 గంటలకు రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడ మంత్రులు కందుల దుర్గేశ్, నిమ్మల రామానాయుడు, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు మద్టిపాటి వెంకట్రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రోడ్డుమార్గం గుండా 1.50 గంటలకు మలకపల్లికి చేరుకున్నారు.