Share News

Chandrababu yoga initiatives: చరిత్ర సృష్టించేలా యోగా డే

ABN , Publish Date - May 29 , 2025 | 05:49 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని యోగాంధ్రగా మార్చేందుకు యోగా దినోత్సవాన్ని భారీ స్థాయిలో జరుపేందుకు ప్రణాళికలు రూపొందించారు. జూన్ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమంలో 5 లక్షల మంది ఒక చోట యోగ చేయనున్నారు.

Chandrababu yoga initiatives: చరిత్ర సృష్టించేలా యోగా డే

26 జిల్లాల్లో 26 థీమ్‌లతో నిర్వహిస్తాం

యోగాంధ్ర తీర్మానంపై చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో కార్యక్రమాలు

2 కోట్ల మందికిపైగా భాగస్వామ్యం లక్ష్యం

గ్రామ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని యోగాంధ్రగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు రెండో రోజున యోగాంధ్ర తీర్మానంపై ఆయన మాట్లాడారు. ‘రోజువారీ పనుల కారణంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గత ఐదేళ్లు రాష్ట్ర ప్రజలంతా అనునిత్యం భయం, ఒత్తిడిలో ఉన్నారు. ఎవరిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తారో తెలియక ఇబ్బందులు పడ్డాం. యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలి. దీంతో శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిద్దామని ప్రధాని మోదీ కోరారు. మీ అందరిపై నమ్మకంతో చరిత్ర సృష్టించేలా యోగాడే నిర్వహిస్తామని ఆయనకు మాట ఇచ్చా. యోగా డేని ఘనంగా నిర్వహించి ఏపీని ప్రపంచ పటంలో నిలబెడదాం. యోగా దినోత్సవాన్ని ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు 5 లక్షల మందితో నిర్వహించబోతున్నాం. ఇలా ఒకే చోట 5 లక్షల మందితో యోగాడే నిర్వహించడం ఎక్కడా జరగలేదు. యోగా డే రోజు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా లక్ష్యం పెట్టుకున్నాం. ఇంతకు ముందు గుజరాత్‌లో 1.53 లక్షల మందితో యోగా నిర్వహించారు. ఆ రికార్డును తిరగరాసేలా యోగా డే నిర్వహించబోతున్నాం. 20 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందిస్తాం. 26 జిల్లాల్లో 26 థీమ్‌లతో యోగా డే నిర్వహిస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.


యోగాంధ్ర అమలుకు మార్గదర్శకాలు విడుదల

వచ్చే నెల 21న ప్రధాని మోదీ విశాఖపట్నంలో పాల్గొననున్న యోగాంధ్ర సభ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలు జూన్‌ 21న విశాఖపట్నంలో ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా స్థాయిల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రకటిస్తారు. రాష్ట్రస్థాయిలో అమరావతిలో గ్రాండ్‌ ఫైనల్‌ కూడా నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తారు. జూన్‌ 21న రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందికిపైగా యోగా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, పరిశ్రమలు, పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు సుమారు లక్ష చోట్ల యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎస్పీ వైస్‌చైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ నోడల్‌ అధికారిగా, మండలస్థాయిలో ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌ చైర్మన్‌గా గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి/వార్డ్‌ సెక్రటరీ చైర్మన్‌గా కమిటీలు ఏర్పాటు చేశారు.


మదనపల్లెలో ఐదువేల మందితో యోగాసనాలు

మదనపల్లె, మే 28(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె బీటీ కళాశాల మైదానంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమం విజయవంతమైంది. బుధవారం జిల్లా స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు, ప్రముఖులు, మహిళలు, స్వయంసహాయక సంఘాలు, అంగన్‌వాడీ, వైద్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది సుమారు 5 వేల మంది హాజరై యోగాసనాలు వేశారు. వారికి 12 మంది యోగా గురువులు సూచనలిచ్చారు. కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, ఆయన సతీమణి మాధవి, పిల్లలు శ్రీనిత్య, శ్రీదిత్య, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌, ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌ బాషా, మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీల తదితరులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యోగ సాధనతో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా మాట్లాడుతూ దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


తొలివారంలోనే 28.55 లక్షల మంది పేర్ల నమోదు

యోగాభ్యాసంపై ప్రజల్లో అవగాహన, చైత్యన్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర-2025కు మొదటి వారంలోనే మంచి స్పందన వచ్చింది. నెల రోజులు సాగే యోగాంధ్ర కార్యక్రమంలో రెండు కోట్ల మంది పేర్ల నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. మొదటి వారంలో 26,66,666 మంది పేర్ల నమోదు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ నెల 27 వరకు 28,55,048 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మాస్టర్‌ ట్రైనర్ల నమోదు కూడా బాగా జరిగింది. మొదటి వారంలో 2,600 మంది మాస్టర్‌ ట్రైనర్ల నమోదు లక్ష్యం కాగా, 10,609 మంది నమోదు చేసుకున్నారు. మొత్తం 1.35 లక్షల మంది ట్రైనర్ల నమోదు దాదాపు పూర్తైంది. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మే 21 నుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర పేరిట పలు కార్యక్రమాల్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేస్తోంది. మొదటి వారంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన వివరాల్ని క్రోడీకరించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నివేదిక తయారు చేసి కేబినెట్‌ కమిటీకి అందజేశారు. మొదటి వారంలోనే 2,600 మంది మాస్టర్‌ ట్రైనర్ల శిక్షణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, ఇప్పటికే 5,353 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని కృష్ణబాబు చెప్పారు. 12 జిల్లాల్లో లక్ష్యాన్ని మించి యోగాసక్తి కలిగిన వారి పేర్ల నమోదు జరిగిందన్నారు. పశ్చిమగోదావరి, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాలు తొలి 5 స్థానాల్లో నిలిచాయని, మరో 8 జిల్లాలు నిర్దేశించిన లక్ష్యాలకు చేరువయ్యాయని తెలిపారు. విశాఖ, కోనసీమ, ప్రకాశం, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు పెంచే ప్రయత్నం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:59 PM